కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
మావోయిస్టుల లొంగుబాటు, పునరావాసంపై కేంద్రమంత్రితో చర్చలు
మూడు గంటల పాటు సుదీర్ఘ సమావేశంలో పలు అంశాల ప్రస్తావన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి అమిత్‌షాతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. మూడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో పలు అంశాల గురించి ప్రస్తావించారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు.
ఆ సమయంలోనూ కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని సీఎం వివరించారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని సీఎం తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని కేంద్రమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 మంది ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నారని, ఆ సంఖ్యను 103కు పెంచి కేటాయించాలని సీఎం కోరారు.
అనంతరం మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్‌షాతో రేవంత్‌రెడ్డి చర్చించారు. ఇటీవల మావోయిస్టు అగ్ర నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. గత రెండేండ్లలో తెలంగాణ పోలీసింగ్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని కేంద్రమంత్రి అమిత్‌షా దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని, వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం విషయాలను కేంద్రమంత్రికి సీఎం తెలియజేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సహకరించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ వి.శేషాద్రి, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీపీ బి. సుమతి పాల్గొన్నారు.



