Thursday, March 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుయుద్ధ జ్వాలలు

యుద్ధ జ్వాలలు

- Advertisement -

ఇరాన్‌ యుద్ధ నౌకను ముంచేసిన అమెరికా
రష్యా, చైనా సహా పలు దేశాల ఖండన
32మందిని కాపాడిన శ్రీలంక నావికాదళం
ప్రతీకారదాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్‌
లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులు..11మంది మృతి
ఖమేనీ అంత్యక్రియలు వాయిదా

నవతెలంగాణ – సెంట్రల్‌ డెస్క్‌
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధం ప్రారంభించి ఐదు రోజులు గడిచినా పరిస్థితుల్లో ఏ మాత్రమూ మార్పు లేకపోగా పశ్చిమాసియా వ్యాప్తంగా రాన్రానూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం ఇరాన్‌ యుద్ధ నౌకను అమెరికా ముంచేసింది. శ్రీలంక తీరానికి సమీపంలో జరిగిన ఈ జలాంతర్గామి దాడిని స్వయంగా పెంటగన్‌ చీఫ్‌ ప్రకటించారు. శ్రీలంక తీరంలో మునిగిపోతున్న ఇరాన్‌ యుద్ధ నౌక నుంచి 32మందిని కాపాడినట్లు శ్రీలంక నావికా దళం ప్రకటించింది. అందులో ఒకరి పరిస్థితి విషమంగా వుందని, వారికి చికిత్స అందుతోందని తెలిపింది. వీరితో పాటు కొన్ని మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇందులో నౌకా సిబ్బంది కూడా వున్నట్లు భావిస్తున్నారు. శ్రీలంక సముద్ర జలాల పరిధికి ఆవల ఈ సంఘటన జరిగినా, వారికి మద్దతునందించడానికి ముందుకొచ్చామని నావికాదళ ప్రతినిధి తెలిపారు.

ప్రస్తుతం ప్రాణరక్షణపైనే దృష్టి కేంద్రీకరించామని, తర్వాత దర్యాప్తుపై దృష్టి పెడతా మని తెలిపారు. ఇరాన్‌ యుద్ధ నౌక మునిగిపోవడానికి కారణాలేమిటన్నది కూడా వెంటనే తెలియరాలేదు. అయితే, జలాంతర్గామి దాడి కారణమని భావిస్తున్నట్లు అంతకు ముందు శ్రీలంక నావిక, రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనపై శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్‌ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, గాలె తీర ప్రాంతానికి 40 నాటికల్‌ మైళ్ళ దూరంలో ‘ఐఆర్‌ఐఎస్‌ దేనా’ అనే నౌకను గుర్తించామని చెప్పారు. ఆ నౌక నుండి వచ్చిన విపత్తు సందేశాన్ని అందుకుని వెంటనే నావికా, వైమానిక బలగాలతో రంగంలోకి దిగామని తెలిపారు. వెంటనే శ్రీలంక బలగాలు గాలింపు, సహాయక చర్యలు చేపట్టాయి.ఆ సమయంలో ఆ నౌకలో 180మంది వున్నట్లు తెలుసోందని, 32మంది కాపా డామని, మరికొన్ని మృత దేహాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఫిబ్రవరి 18 నుండి 25 వరకు బంగాళాఖాతంలో జరిగిన నావికా విన్యాసాల్లో ఈ నౌక పాల్గొంది.

లెబనాన్‌లో విస్తరించిన పదాతి దాడులు : 11మంది మృతి
తాజాగా లెబనాన్‌లో ఇజ్రాయిల్‌ దాడులను విస్తరించింది. బీరుట్‌ సమీపంలోని అధ్యక్ష భవన సముదాయం, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంది. అలాగే బీరుట్‌కు దక్షిణంగా గల ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులను ముమ్మరం చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 11మంది మృతి చెందారు. ఇరాన్‌ మద్దతు వున్న హిజ్బుల్లాపై పదాతి దాడులను ప్రారంభించింది. ఇందులో భాగంగా లెబనాన్‌లోని దక్షణ పట్టణమైన ఖయీమ్‌లో ఇజ్రాయిల్‌ ఆర్మీ ప్రవేశించింది. నివాస భవంతిపై దాడులు జరిపినట్లు మీడియా వార్తలు తెలిపాయి.

హిజ్బుల్లాపై సైనికచర్య తీసుకుంటున్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాళని ఇజ్రాయిల్‌ మిలటరీ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌ క్షిపణి సామర్ధ్యాన్ని గణనీయంగా మట్టుబెట్టడమే తమ లక్ష్యమని ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రకటించింది. టెహరాన్‌పై తాజాగా పలు దాడులు జరిపినట్లు తెలిపింది. ఇదిలావుండగా సెంట్రల్‌ ఇజ్రాయిల్‌ లోని ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు హిజ్బుల్లా ప్రకటించింది. గత రాత్రి డ్రోన్‌ దాడులు జరిపామని, తాజాగా క్షిపణి దాడులు కూడా చేశామని తెలిపింది. ఇరాన్‌ అణు స్థావరాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఐఎఇఎ బుధవారం చెప్పింది. ఎక్కడా ఎలాంటి అణు ధార్మికత వెలువడలేదని తాజా ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది.

చర్చలు జరిపేది లేదు
అమెరికాతో ఏ విధమైన చర్చలు జరిపే ఉద్దేశమే లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. తామనుకున్నంత కాలమూ యుద్ధాన్ని కొనసాగిస్తామని ఖమేనీకి సీనియర్‌ సహచరుడు మహ్మద్‌ మొక్బర్‌ ప్రకటించారు. మరోవైపు అంతర్జాతీయ ఇంధన భద్రతకు కీలకమైన హర్ముజ్‌ జలసంధిపై పూర్తి నియంత్రణ తమకు వుందని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించింది. గల్ఫ్‌ వ్యాప్తంగా అమెరికా దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడాన్ని ఇరాన్‌ ఉధృతం చేసింది. ఇందులో భాగంగా దుబాయ్ లోని అమెరికా కాన్సులేట్‌పై డ్రోన్‌ దాడి జరిగింది. ఇజ్రాయిల్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ క్షిపణులు దూసుకువచ్చాయి.

ట్రంప్‌ వైఖరిపై ఖండనలు
ట్రంప్‌ వాణిజ్య ఒప్పందాన్ని సాకుగా చూపించి బెదిరింపులు చేస్తున్నప్పటికీ వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ స్పెయిన్‌, ఇరాన్‌పై యుద్ధాన్ని తీవ్రంగా ఖండించింది. స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ అమెరికా, ఇజ్రాయిల్‌ తీరును తీవ్రంగా విమర్శించారు. ఇరాక్‌ షియా మత పెద్ద గ్రాండ్‌ ఆయతుల్లా అలీ సిస్తాని కూడా ఇరాన్‌పై దాడులను తీవ్రంగా నిరసించారు. ఇరాన్‌ నుండి ముప్పు వస్తుందని ఊహించుకుని అమెరికా ఈ దాడులకు పాల్పడుతోందని రష్యా విమర్శించింది. ఇరాన్‌లోని న్యాయ బద్ధమైన వ్యవస్థను కూలదోసేందుకే ఈ దాడులని వ్యాఖ్యానించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జకరొవా ఒక ప్రకటన చేశారు.

ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చాలన్నది అమెరికా లక్ష్యమని, దానికి ఒక ముసుగులా చర్చలను ఉపయోగించుకుందని విమర్శించారు. అన్ని స్థాయిల్లోనూ అన్ని పక్షాలతో కమ్యూనికేషన్‌ సంబంధాలు పెంపొందించడానికి తాము సాయాన్ని అందిస్తామని చైనా ప్రకటించింది. కెనడా ప్రధాని మార్క్‌ కార్నే కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఈ దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఆసియాన్‌ కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో పెచ్చరిల్లుతున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని కోరింది. ఈ మేరకు ఆసియాన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఖమేనీ అంత్యక్రియలు వాయిదా
బుధవారం సాయంత్రం టెహరాన్‌లో జరగాల్సిన మత పెద్ద ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్‌ వాయిదా వేసింది. అనూహ్యమైన పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడిందని, త్వరలో అంత్యక్రియలు జరిగే తేదీని ప్రకటిస్తామని ఇరాన్‌ ప్రభుత్వ టెలివిజన్‌ తెలిపింది. ఖమేనీ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తారని, వారికి సరైన భద్రతా ఏర్పాట్లు చేయడం కష్టమవుతుందని భావిస్తున్నట్లు ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

మేమే ముంచేశాం
శ్రీలంకకు దక్షిణ తీర ప్రాంతంలో ఇరాన్‌ యుద్ధ నౌకను తమ జలాంతర్గామి ముంచేసినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ బుధవారం ప్రకటించారు

ఇరాన్‌ ‘అట్రిషన్‌ వార్‌’
శత్రువు జేబులు ఖాళీ చేస్తుందిలా…
ఇజ్రాయిల్‌, అమెరికాలపై యుద్ధంలో ఇరాన్‌ కొత్త పంథా అవలంభిస్తోంది. తాను ఖర్చు ఎక్కువ చేయకుండానే… ప్రత్యర్థికి భారీ నష్టం కలిగిస్తోంది. శత్రువు జేబులను ఖాళీచేసి…వారిని అలసిపోయేలా చేయడమే ‘అట్రిషన్‌ వార్‌’ వ్యూహ పద్ధతి. అసలు అమెరికా, ఇజ్రాయిల్‌ల యుద్ధ ఖర్చులను ఇరాన్‌ ఎలా పెంచుతోందంటే… అత్యాధునిక సాంకేతికతతో తయారైన ఆయుధాలు కలిగిన అమెరికా, ఇజ్రాయిల్‌లను ఇరాన్‌ చౌకైన డ్రోన్లతో ఎదుర్కొంటోంది. అవే షాహెద్‌-136 వన్‌వే అటాక్‌ డ్రోన్లు. ఇవి చిన్న క్రూయిజ్‌ మిస్సైళ్లలా పనిచేస్తాయి.

లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతాయి. కాబట్టి వీటిని సూసైడ్‌ డ్రోన్లుగా పిలుస్తారు. ఒక్కో డ్రోన్‌ను తయారు చేయడానికి అయ్యే ఖర్చు సుమారు 20 వేల డాలర్లు (రూ.16 లక్షలు). ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు గల్ఫ్‌ దేశాలు, అమెరికా.. వినియోగిస్తున్న రక్షణ క్షిపణుల ఖర్చు మాత్రం రూ.కోట్లు దాటుతోంది. అమెరికా ఉపయోగిస్తున్న పేట్రియాట్‌ మిస్సైల్‌ వ్యవస్థల్లో ఒక్క ఇంటర్‌సెప్టర్‌ క్షిపణి ధర రూ.30 కోట్లకు పైగానే ఉంటుంది. అంటే రూ.16 లక్షల డ్రోన్‌ను కూల్చేందుకు రూ.30 కోట్ల క్షిపణి వినియోగించాల్సిన పరిస్థితి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -