Thursday, March 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజూన్‌లోగా సింగూరు డ్యాం సేఫ్టీ పనులు

జూన్‌లోగా సింగూరు డ్యాం సేఫ్టీ పనులు

- Advertisement -

ములుగు జిల్లా ప్రాజెక్ట్‌ల భూసేకరణ వేగవంతం : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సింగూర్‌ ప్రాజెక్ట్‌ కాలువల లైనింగ్‌ పనులను జూన్‌ 26లోగా పూర్తిచేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుదవారం హైదరాబాద్‌ లోని బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, దనసరి అనసూయ సీతక్క, వివేక్‌ వెంకటస్వామి తో కలిసి ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) రూపొందించిన నిబంధనల మేరకు సింగూర్‌ డ్యాంను పరిరక్షించాలని ఇరిగేషన్‌ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణ పనులపై టెక్నికల్‌ కమిటీని నియమించాలని సూచించారు.

జంటనగరాలకు తాగు నీటిని సరఫరా చేస్తూ, పరిసర ప్రాంతాలకు సాగునీరందిస్తున్న సింగూర్‌ ప్రాజెక్ట్‌ను పరిరక్షించడంతో పాటు పునరుద్ధరణ విషయంలో రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. ఎంబాంక్మెంట్‌లో చీలికలు, స్లోప్‌ ఎరోషన్‌, రివెట్‌మెంట్‌ నష్టం, ప్లంజ్‌ పూల్‌ పనులు చేపడతామని చెప్పారు. బండ్‌ దిగువన నీటిని పూర్తిగా వదలకుండా దాగి ఉన్న నష్టాలను గుర్తించేందుకు సోనార్‌ పరీక్షలు, అండర్‌వాటర్‌ సర్వేలు చేపట్టి 2-3 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పాలెం వాగు గేట్లు, రెగ్యులేటర్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పాలెంవాగును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాజెక్ట్‌ భూ సేకరణకు కావాల్సిన రూ.5,000 కోట్లు త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు.

ములుగు జిల్లాలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. భూ సేకరణకు సంబంధించి పక్షం రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణ అంశాన్ని ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం వెంటనే చెల్లించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రామప్ప-లక్నవరం ఇంటర్‌ లింకింగ్‌ పనులకు అదనపు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సమ్మక్క సారాలమ్మ ప్రాజెక్ట్‌ విషయంలో ఛత్తీస్‌గడ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందనీ, అక్కడ ముంపు బాధితులకు తగిన పరిహారం చెల్లించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమీక్షలో ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ.శ్రీధర్‌, ఈఎన్సీలు రమేష్‌ బాబు, టి.శ్రీనివాస్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -