రాజ్యసభకు నితీశ్ కుమార్
పాట్నా : బీహార్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నట్లు, దీంతో రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రానున్నారని అక్కడి మీడియా లో నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 16న బీహార్‌లో ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో నాలుగు స్థానాలను అధికార కూటమి ఎన్డీఏ కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ, జేడీ(యూ) చెరో రెండు స్థానాలు పంచుకున్నాయి. బీజేపీ ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. జేడీ(యూ) ఇంకా తన అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే జేడీ(యూ) నుంచి నితీష్ కుమార్ ఎగువ సభకు వెళ్లనున్నారని, ఇప్పటికే ఆయన రాజ్యసభ పేపర్స్ రెడీ అయినట్టు సమాచారం.
జేడీ(యూ) నాయకుల సమాచారం ప్రకారం.. నితీశ్ రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారని, గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 16న రాజ్యసభకు ఎన్నికలు జరిగే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. తర్వాత నితీశ్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఈ సారి బీజేపీ నాయకుడు బీహార్ ముఖ్యమంత్రి అవుతారని సమాచారం. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొపెట్టాలని బీజేపీ భావిస్తున్నట్టు ఆ రాష్ట్ర మీడియా తెలిపింది. అలాగే, నితీశ్ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నిశాంత్‌కు బీహార్ డిప్యూటీ సీఎంగా అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది.



