సాహిత్య ప్రపంచంలో మెరిసే ఎన్నో విలువైన నక్షత్రాలు.. చంద్ర వంకలు.. పాలపుంతలు.. ఒకరిని మించి ఒకరి రచనా సామర్ధ్యం.. పోల్చలేని.. పోల్చుకోలేని.. అల్లికా నైపుణ్యం.. సాహితీ వినీలకాశం.. ధర్తీ.. రెండూ అజరామరాలు. ఈ భూమి మీద అనేకనేక జననాలు ఉండవచ్చు. కారణజన్ములు కొందరే ఉంటారు. అందులో మొదట గణించాల్సిన వారు సాహితీ కారులు.
భాష ఏదైనా సరే.. సాహితీ ప్రపంచపు ఆనవాళ్లు ఉన్న ప్రదేశం.. గుర్తించ దగిన ప్రదేశం.. అలాంటి ఒక సాహితీ మూర్తిని ఉర్దూ సాహిత్యం కోల్పోయిన.. దు:ఖిత కాలం.. ఆమె నవల, కథల అనువాదాలు.. చదివిన ఆనాటి తెలుగు సమాజం కూడా దిగులు పడిన కాలం.. మరణం భౌతికంగా బాధ పెట్టిస్తుంది.. కానీ ఆమె రచనలు.. ఆమెకు మరణం లేకుండా చేస్తాయి. ఆమే ప్రముఖ ఉర్దూ సాహిత్య దిగ్గజం జిలానీ బానో.
రచయతలకున్న వరం.. సంజీవని వారి రచనలు. ఆ రకంగా ఆవిడ రచనలలో జీవించే ఉంటారు. రచయిత తన కాలంలో జరిగిన, జరుగుతున్న అన్యాయాలను గురించి రాయకుండా.. దాటవేసినట్లయితే.. అతను లేదా ఆమె రచయిత్రిగా లేదా రచయితలు ఎవరైనా సరే అకాల మరణం పొందినట్లే. అట్లా కాకుండా.. తనదైన బాధ్యతను రచయిత్రిగా నిర్వర్తిస్తూ రచనలు చేసినట్లయితే.. ఆ నిజాయితీకి మరణం రాదు, ఉండదు.. జిలాని భానోకి మరణం లేదు.. పేద సాదల పక్షాన పోరాడిన జీలానీ బానో ఆదివారం (మార్చి 1) 90 ఏండ్ల వయసులో భౌతికంగా మరణించారని ప్రకటించారు.
హైదరాబాద్ వచ్చి…
జీలానీ బానో జూలై 14, 1936న భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదాయున్‌లో ప్రసిద్ధ ఉర్దూ కవయిత్రి హైరత్ బదాయునికు జన్మించారు. ఆమె పాఠశాల విద్య వరకు అక్కడే చదువుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖ కవి, ఇస్లామిక్ అధ్యయన విభాగ మాజీ అధిపతి అయిన అన్వర్ మోజ్జంను వివాహం చేసుకుని హైదరాబాద్‌కు మకాం మార్చి ఇక్కడ ఉస్మానియాలో ఇంటర్మిడియేట్, డిగ్రీ పూర్తి చేసి, ఉర్దూలో మాస్టర్స్ డిగ్రీ (ఎంఏ) కొనసాగించారు.
ఇరవై రెండు పుస్తకాలు
జీలానీ బానో మొదటి కథ ‘ఏక్ నజర్ ఇధర్ భి’ 1952లో ప్రచురించబడింది. ఇరవై రెండు పుస్తకాలను రచించారు, వీటిలో ‘రోష్నీ కే మినార్’ సంకలనం నుండి ‘ఐవాన్-ఎ-గజల్’ నవల వరకూ ఉన్నాయి. ఇతర పుస్తకాలలో ఆత్మకథ, అఫ్సానేతో పాటుగా ఇతర రచయితలతో ఆమె సంభాషణల సంకలనం, ‘దూర్ కి ఆవాజే’ వంటి రచనలు ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి.
ఆమె కథలలో ఒకటైన ‘నర్సయ్య కీ బౌవ్డీ’ 2009లో ప్రఖ్యాత చిత్రనిర్మాత శ్యామ్ బెనెగల్ ద్వారా ‘వెల్ డన్ అబ్బా’ అనే చలన చిత్రంగా రూపొందించబడింది. జిలానీ బానో 1960లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును, 1985లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డును అందుకున్నారు. ఆమె 1989లో హర్యానా ఉర్దూ అకాడమీ నుండి ‘క్వామి హాలీ అవార్డు’ను అందుకున్నారు. భారత ప్రభుత్వం 2001లో ఆమెను పద్మశ్రీ పౌర పురస్కారంతో సత్కరించింది.
సామాజిక శిల్పి
మహిళా హక్కుల కోసం పనిచేసే ప్రభుత్వేతర సంస్థ ‘అస్మిత’ మాజీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చూసిన జిలానీ బానో హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో నివసించారు. ఆమె యూత్ ఫర్ యాక్షన్ వంటి ప్రతిష్టాత్మక వేదికలతో చైర్ పర్సన్‌గా, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫోరమ్ అయిన చైల్డ్ అండ్ ఉమెన్ హ్యూమన్ రైట్స్ దాని ప్రధాన సలహాదారుగా కూడా ఉన్నారు. ఆమె ఒక సామాజిక శిల్పి, సంప్రదాయం – ఆధునికత మధ్య అంతరాన్ని తగ్గించడానికి తన కలాన్ని ఉపయోగించారు.
1954లో ఆమె మొదటి చిన్న కథ నుండి పద్మశ్రీ గ్రహీత, డాక్టర్ ఆఫ్ లిటరేచర్‌గా ఆమె సాధించిన విజయాల వరకు, బానో కెరీర్ ఏడు దశాబ్దాల నిరంతర సృజనాత్మక ప్రపంచాన్ని నిర్మించారు. ఆమె సాహిత్య ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. దక్కన్ నేలలో లోతుగా పాతుకుపోయిన ఆమె కథలు మాస్కో నుండి మాడిసన్ వరకు పాఠకుల హృదయాల్లో చిరగని ముద్ర వేశాయి. అట్టడుగు వర్గ పాఠకుల అభిమానాన్ని కూడబెట్టుకున్న సంపాదకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
సాంస్కృతిక చరిత్రకు సహకారం
హైదరాబాద్ ‘ఆత్మ’ను కాపాడటానికి ఆమె చేసిన కృషి చెప్పుకోదగినది. సాధారణ ప్రజలు మాట్లాడే దక్కని ఉర్దూ భాషలోని 13 ఆడియో క్యాసెట్లను రికార్డ్ చేయడం ద్వారా ఆమె తన స్థానిక హైదరాబాది ప్రత్యేకతను కాపాడడానికి మంచి ప్రయత్నం చేసి విజయం సాధించారు. మొదటిసారి తన కలం పట్టినప్పుడు ఉన్న పదునునే నేటికీ ఆమె రచనలలో పాఠకులు ఆస్వాదిస్తారు.
చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బానో నిత్య ఆరోగ్య వంతురాలిగా రచనా ప్రపంచంలో గుబాళిస్తూనే ఉన్నారు. ఒక రచయితని కోల్పోవటం అంటే.. ఆ సమాజం ఒక చరిత్ర కారిణిని.. ఒక శిల్ప కారిణిని.. ఒక అమ్మని.. ఒక కాపలా కారుడిని.. మంచి స్నేహితురాలిని.. మంచి అధ్యాపకురాలిని.. ఇంకా అనేకులను పోగొట్టుకున్నట్లు అర్థం. ఆ అర్ధంలోంచే జీలానీ బానోను దూరం చేసుకున్నందుకు వారి కుటుంబ సభ్యులకే కాక సమాజం మొత్తానికి సానుభూతి తెలపాల్సిన సమయం.
(మార్చి 1న జిలానిబానో అకాల మరణవార్త విని)
- నవన



