Friday, March 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఫోన్‌లోనే బస్‌పాస్‌లు

ఫోన్‌లోనే బస్‌పాస్‌లు

- Advertisement -

పాస్‌ల కోసం ఇక క్యూ కట్టనక్కర్లేదు..
గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేదు
‘మీ టికెట్‌’ యాప్‌లో బస్‌పాస్‌ సేవలు!

నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోని బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బస్‌పాస్‌ల కోసం లేదా అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌ కోసం బస్‌పాస్‌ కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఎక్కడికీ వెళ్లకుండా కేవలం మీ మొబైల్‌ నుంచే సులువుగా బస్‌పాస్‌ పొందవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ‘మీ టికెట్‌’ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

యాప్‌ ద్వారా ఐదు రకాల పాస్‌లు
ఆర్టీసీ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన ‘మీ టికెట్‌’ యాప్‌ను మరింత ఆధునీకరిస్తూ.. అందులో బస్‌పాస్‌ సేవలను కూడా చేర్చింది. విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర సాధారణ ప్రయాణికులు ఇకపై తమ మొబైల్‌లోనే బస్‌పాస్‌ కోసం దరఖాస్తు చేసుకునేలా వీలు కల్పించింది. అంతేగాక ఈ నెల 25 నుంచి ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్ల ద్వారానే కింది సదుపాయాలను పొందేలా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణికులు తమ ప్రయాణానికి అవసరమైన టికెట్లను యాప్‌ ద్వారానే ముందుగా బుక్‌ చేసుకోవచ్చు. జనరల్‌ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌, గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ, పుష్‌పక్‌ ఏసీ బస్సులకు సంబంధించిన బస్‌పాస్‌లను ఈ యాప్‌ ద్వారానే పేమెంట్‌ చేసి పొందవచ్చు.

ప్రయాణికులకు అదనపు సౌకర్యం
ఈ కొత్త విధానం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కౌంటర్ల వద్ద రద్దీ కూడా తగ్గుతుంది. ముఖ్యం గా కాలేజీ విద్యార్థులకు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు ఈ సదుపాయం ఎంతో ఉపయో గకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో డిజిటలైజేషన్‌లో భాగంగా మరిన్ని సేవలను ‘మీ టికెట్‌’ యాప్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తోంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.

కేంద్రాల్లోనూ సేవలు యథావిథి..
డిజిటల్‌ సేవలతో పాటు నేరుగా కేంద్రాలకు వెళ్లి పాస్‌లు తీసుకోవాలనుకునే వారి కోసం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 42 అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌, బస్‌పాస్‌ కేంద్రాలు యథావిథిగా పనిచేస్తాయి. ప్రతిరోజూ (ఆదివారంతో కలిపి) ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకు ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు, వికలాంగులు, విద్యార్థులు, జర్నలిస్టులు, డయాలసిస్‌ రోగులు తమకు వర్తించే పాస్‌లను ఈ కేంద్రాల్లో తీసుకోవచ్చు.

ఎలా అప్లై చేయాలి?
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ‘మీ టికెట్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్న తర్వాత, ‘బస్‌ పాస్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ వివరాలు, ఫోటో, అవసరమైన ధ్రువపత్రాలను (అవసరమైతే) అప్‌లోడ్‌ చేయాలి. ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా ఫీజు చెల్లించగానే, డిజిటల్‌ బస్‌పాస్‌ మీ మొబైల్‌కే వస్తుంది. దీన్ని మీరు ప్రయాణ సమయంలో కండక్టర్‌కు చూపించవచ్చు.

ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగించుకోవాలి
ప్రయాణికుల సౌలభ్యం కోసం అందుబాటులోకి తెచ్చిన ‘మీ టికెట్‌’ యాప్‌ ద్వారా అవసరమైన సేవలను వినియోగించుకోవాలి. బస్‌పాస్‌ సెంటర్లకు వెళ్లే పని లేకుండా డిజిటల్‌ పద్ధతిలో పాస్‌లను పొందవచ్చు. డిజిటలైజేషన్‌లో భాగంగా త్వరలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువస్తాం. -ఎం.రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, టీజీఎస్‌ఆర్టీసీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -