Friday, March 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ యుద్ధంలో కెనడా?

ఇరాన్‌ యుద్ధంలో కెనడా?

- Advertisement -

టెహ్రాన్‌ : ప్రస్తుతం ఇజ్రాయిల్‌-అమెరికా సేనలు, ఇరాన్‌ దళాల మధ్య జరుగుతున్న పోరులో పాలుపంచుకునే అవకాశాన్ని కెనడా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడం లేదు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను ‘కొంత విచారం’తో సమర్ధిస్తున్నానని కెనడా ప్రధాని మార్క్‌ కార్నే చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలు అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా లేవని ఆయన అన్నారు. కానెబెర్రాలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనేస్‌తో కలిసి గురువారం కార్నే విలేకరులతో మాట్లాడుతూ ‘యుద్ధంలో పాల్గొనే అవకాశాన్ని ఎవరూ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చలేరు’ అని వ్యాఖ్యానించారు. తాము మిత్రపక్షాల వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు.

ఇరాన్‌పై దాడి చేయబోతున్న విషయాన్ని ఇజ్రాయిల్‌, అమెరికా తమకు ముందుగా తెలియజేయలేదని చెప్పారు. యుద్ధంలో భాగస్వామి కావాలని కూడా తమను కోరలేదని అన్నారు. ఐక్యరాజ్యసమితి అనేక దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరాన్‌ అణు కార్యక్రమం ఆందోళన కలిగిస్తూనే ఉన్నదని కార్నే విమర్శించారు. నాటో సభ్యదేశమైన కెనడాకు తన మిత్రదేశమైన అమెరికాతో బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాలూ నాటోలోనే ఉన్నందున సంయుక్త ఆపరేషన్లలో కెనడా దళాలు అమెరికా స్థావరాలను ఉపయోగించుకోవచ్చు. కాగా టెహ్రాన్‌తో కెనడాకు గత పదిహేను సంవత్సరాలుగా ఎలాంటి దౌత్య సంబంధాలు లేవు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ను కెనడా గత సంవత్సరం ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.

యుద్ధంలో చేరవచ్చు : పాక్‌ సంకేతం
ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయిల్‌ మధ్య జరుగుతున్న ఘర్షణలో అనేక దేశాలు చేరవచ్చునన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గల్ఫ్‌ దేశమైన సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం కారణంగా తాను కూడా యుద్ధ క్షేత్రంలో దిగుతానని పాకిస్తాన్‌ సూచన ప్రాయంగా తెలిపింది. గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాలో క్షిపణి లేదా డ్రోన్‌ దాడి చేస్తే సహించబోమని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ హెచ్చరించినట్లు తెలిసింది.

సమస్యకు యుద్ధం పరిష్కారం కాదు : మోడీ
ఇరాన్‌ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదని చెప్పారు. ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలకు పరిష్కారం యుద్ధ భూమిలో లభించదని, చర్చలు-దౌత్యం ద్వారా మాత్రమే దానిని సాధించాలని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ ఉద్రిక్తతల నివారణకు శాంతియుత పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. భారత్‌ చాలా కాలంగా శాంతి, చర్చలు, దౌత్యానికే మద్దతు ఇస్తోందని గుర్తు చేశారు. యుద్ధాల కారణంగా ప్రాణనష్టం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు ప్రధాని గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఖమేనీ మృతికి భారత్‌ సంతాపం
ఇరాన్‌ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్‌ ఎట్టకేలకు సంతాపం వ్యక్తం చేసింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ గురువారం ఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయానికి వెళ్లారు. ఖమేనీ మృతికి మన దేశం తరఫున అక్కడ సంతాప సందేశాన్ని రాశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై ఇరాన్‌ రాయబారితో చర్చించారు.

ట్రంప్‌ చర్యలకు సెనెట్‌ మద్దతు
వీగిపోయిన డెమొక్రాట్ల తీర్మానం
ఇరాన్‌పై ట్రంప్‌ సాగిస్తున్న యుద్ధాన్ని నిలువరించేందుకు అమెరికా సెనెట్‌లో డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. ఇరాన్‌పై జరిపే ఏ సైనిక చర్యకైనా కాంగ్రెస్‌ అనుమతి అవసరమన్న డెమొక్రాట్ల వాదనకు సెనెట్‌లో మద్దతు లభించలేదు. ఇరాన్‌పై ట్రంప్‌ చేపట్టిన సైనిక చర్యను సెనెట్‌లో రిపబ్లికన్లు సమర్ధించారు. డెమొక్రాట్ల తీర్మానాన్ని వారు వ్యతిరేకించారు. తీర్మానానికి అనుకూలంగా 47 ఓట్లు లభించగా 53 మంది వ్యతిరేకించారు. తీర్మానాన్ని ఒక్కరు మినహా మిగిలిన రిపబ్లికన్‌ సభ్యులంతా వ్యతింకించారు. అదే విధంగా ఒక్కరు మినహా మిగిలిన డెమొక్రాట్‌ సభ్యులందరూ దానిని బలపరిచారు. రిపబ్లికన్లకు సెనెట్‌లోనూ, కాంగ్రెస్‌లోనూ మెజారిటీ ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు ఉన్న యుద్ధ అధికారాలను కట్టడి చేసేందుకు గతంలో డెమొక్రాట్ల ప్రవేశపెట్టిన తీర్మానాలను కూడా రిపబ్లికన్లు అడ్డుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -