Friday, March 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమోడీ పాలనలో అన్ని వ్యవస్థలూ ధ్వంసం

మోడీ పాలనలో అన్ని వ్యవస్థలూ ధ్వంసం

- Advertisement -

బీజేపీ గద్దె దిగాలి-దేశాన్ని ప్రక్షాళన చేయాలి
ఆ పార్టీ డీఎన్‌ఏతో నా డీఎన్‌ఏ ఎప్పటికీ కలవదు
వామపక్షాలతో కలిసి పని చేస్తా
కష్టాల్లో అండగా నిలబడని బీఆర్‌ఎస్‌

హామీలపై కాంగ్రెస్‌ రిక్తహస్తం
తెలంగాణ అస్తిత్వానికే నా తొలి ప్రాధాన్యత
నిరంతరం ప్రజా సమస్యలే ఎజెండా

‘నవతెలంగాణ’తో ఇంటర్వ్యూలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ములాఖాత్‌

‘ప్రధాని మోడీ పాలనలో అన్ని వ్యవస్థలూ ధ్వంసమయ్యాయి. బీజేపీ గద్దె దిగాల్సిందే.. అది దిగిన తర్వాత మళ్లీ అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేసుకోవాల్సిందే…’ అని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బీజేపీ డీఎన్‌ఏతో తన డీఎన్‌ఏ ఎప్పటికీ కలవబోదని తెలిపారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై వామపక్షాలతో, ఇతర ప్రగతిశీల శక్తులతో కలిసి పోరాడతా మని పేర్కొన్నారు. అందుకనుగుణంగానే భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.

తెలంగాణ కోసం నిలబడ్డ కేసీఆర్‌ కూతుర్ని కాబట్టే బీజేపీ తనను లక్ష్యంగా చేసుకుని వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ కష్ట సమయంలో బీఆర్‌ఎస్‌ తనకు అండగా నిలబడలేదని వాపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ జాగృతి తరపున ఇప్పటికే అనేక సమస్యలపై పోరాడిన తాము, భవిష్యత్తులో పార్టీ ఏర్పాటు చేసి, ఇదే పంథాలో ముందుకెళ్తామని చెప్పారు. నవతెలంగాణ ప్రతినిధి కె.ప్రియకుమార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలపై ముచ్చటించారు.

రెండేండ్లపాటు వేధింపులు
”నాపై బనాయించిన మద్యం కేసు అంతా ఒట్టిదేనని కోర్టు తీర్పుతో తేలిపోయింది. ఆ కేసును అడ్డుపెట్టుకుని బీజేపీ అరెస్టుకు 3 నుంచి 4 నెలల ముందు నుంచే నాపై దాడి మొదలు పెట్టింది. 2022 నుంచి 2024 వరకు ఈ వేధింపులు కొనసాగాయి. రాష్ట్ర బీజేపీ నేతలు సోషల్‌ మీడియాలో… నా వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి వేధించారు. నైతికంగా, రాజకీయంగా పూర్తిగా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించారు. అరెస్ట్‌ అయిన తర్వాత కేటీఆర్‌, ప్రచార సమయంలో కేసీఆర్‌ ఖండించారే తప్ప అంతకు మించి పార్టీగా నా కోసం అండగా నిలబడలేదు. ఇదే కేసులో కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియాకు ఆప్‌ అండగా నిలిచింది” అని కవిత అన్నారు.

జాతీయ అంశాలపై స్పష్టమైన వైఖరి…
”రాష్ట్రంపై ప్రభావం చూపించే జాతీయ అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోబోతున్నాం. ఇందుకోసం నేషనల్‌ ఎఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ఆయా అంశాలపై అధ్యయనం చేసి, వైఖరి వెల్లడిస్తాం. తెలంగాణ అస్థిత్వమే ప్రధానంగా మా పార్టీ రాబోతోంది…” అని కవిత వివరించారు.

ఆ మూడు పార్టీలతో కలిసేదే లేదు…
‘బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లతో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కలవను. రాజకీయ ప్రయోజనాల కోసం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉద్యమాలు చేసే అలవాటు నాకు లేదు. 2006లో ఏ మాట చెప్పానో ఇప్పుడూ అదే మాట చెబుతున్నా. అనేక అంశాలను కాంగ్రెస్‌ నెరవేరుస్తున్నదంటే అది మా ఉద్యమ ప్రభావమే. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లదే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయం. పాత తాళం చెవితో కొత్త తలుపును తెరవలేం. రాష్ట్రంలో కొత్త రాజకీయాలకు నేను నూతన తాళం చెవి లాంటిదాన్ని (ఐయామ్‌ న్యూ కీ ఫర్‌ న్యూ పాలిటిక్స్‌)…’ అని ఆమె అన్నారు.

ఆ రెండు పార్టీలూ విఫలం…
‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ను ఎండగట్టడంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ విఫలమయ్యాయి. దేశంలో బీజేపీ అరాచకత్వాన్ని నిలదీయడంలో కాంగ్రెస్‌ ఫెయిలైంది. వామపక్షాలు అన్ని రకాల ఒత్తిడిలను ఎదుర్కొంటున్నాయి. బీజేపీ మానవ హక్కులను హరిస్తోంది. వరవరరావు, సాయిబాబా, ఉమర్‌ అలీఖాన్‌ లాంటి వారిని అరెస్ట్‌ చేసింది. మేం పార్టీ పెట్టాక వామపక్ష, ప్రగతిశీల శక్తులతో కలిసి పోరాడతాం…’ అని వివరించారు.

లేబర్‌ కోడ్‌లకు పూర్తి వ్యతిరేకం…
‘లేబర్‌ కోడ్‌లకు తెలంగాణ జాగృతి పూర్తిగా వ్యతిరేకం. బీజేపీ అనేక చట్టాల్లో అంతర్లీనంగా చాలా మార్పులు చేస్తున్నది. కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. అందువల్ల తిరిగి అన్ని చట్టాలను ప్రజల పక్షాన రీడిజైన్‌ చేయాలి…” అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అన్నారు.

నాకు పదవులతో పని లేదు…
”గతంలో నేను ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా పని చేశాను. ఇప్పుడవేవీ లేవు. పదవులతో నిమిత్తం లేకుండా పనితో గుర్తింపు, గౌరవం పొందాను. కేసీఆర్‌ కూతురుగా, జాగృతి వ్యవస్థాపకురాలిగా ఏ పదవిలో ఉన్నా క్షేత్రస్థాయిలో పోరాడుతూనే ఉన్నాను. ఎంపీగా అనేక చర్చల్లో పాల్గొన్నాను. పార్లమెంటరీ విధానాన్ని అర్థం చేసుకున్నాను. ఎమ్మెల్సీగా అనేక ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చాను.

మహిళా బిల్లు, అంబేద్కర్‌, ఫూలే విగ్రహాల ఏర్పాటు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, సావిత్రీబాయి ఫూలే జయంతిని మహిళా టీచర్స్‌ డేగా ప్రకటించాలని దరఖాస్తులివ్వటంతోపాటు ధర్నాలు కూడా చేశాను. రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా అనేక ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపట్టబోతున్నాం. ఈనెల 12న సంబంధిత కార్యాచరణపై రౌండ్‌టేబుల్‌ నిర్వహించబోతున్నాం…” అని ఆమె చెప్పారు.

మావోయిస్టులు వస్తే ఆహ్వానిస్తాం…
‘మావోయిస్టులు ప్రజల కోసం సర్వం త్యాగం చేశారు. ఆయుధాలు వదిలి జన జీవన స్రవంతిలోకి వచ్చిన అన్నలు… మాతో కలిసి పని చేసేందుకు ముందుకొస్తే ఆహ్వానిస్తాం. మాజీ నక్సలైట్ల జీవితాలకు ప్రభుత్వాలు ఎలాంటి భరోసానివ్వలేదు. వారి సమస్యలపైనా పోరాడతాం…’అని కవిత అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -