ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం– చెరుకువాడలో రోడ్డు ప్రమాదం
– తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మతి
– ఏపీ రాష్ట్ర క్యాబినెట్‌, చంద్రబాబు, సీపీఐ(ఎం) సంతాపం
భీమవరం: ప్రజా ఉద్యమాల ముద్దుబిడ్డ ఉభయ గోదావరి జిల్లాల పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ తుది శ్వాస విడిచారు. ఉండి మండలం చెరుకు వాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. ఏలూరు జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బయలుదేరిన ఎమ్మెల్సీ సాబ్జీ ఆకివీడులో నాలుగు రోజుల నుంచి జరుగు తున్న అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపి భీమవరం వస్తుండగా చెరుకువాడ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢకొీట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది. వ్యాగన్‌ ఆర్‌ కార్లో ఎదుర సీట్లో కూర్చున్న సాబ్జీకి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడి నుంచి పోలీస్‌ వాహనంలో భీమవరం ప్రభుత్వాసు పత్రికి తరలించారు. ప్రజానీకం సందర్శనార్థం సాబ్జీ మృత దేహాన్ని భీమవరం ఆస్పత్రిలో ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌ రాజు, జిల్లా కలెక్టర్‌ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రామ్‌ సుందర్‌ రెడ్డి, భీమవరం ఆర్డీవో శ్రీనివాసులు రాజు సాబ్జీకి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బి బలరం, యూటీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి గోపి మూర్తి, సీఐటీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జెఎన్వి గోపాలన్‌, కే రాజా రామ్మోహన్‌ రారు, యుటిఎఫ్‌ నేతలు, కార్మిక వర్గం అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, కార్మికులు ఘనంగా నివాళులర్పించారు.
ప్రజాస్వామ్య శక్తులకు బాధాకరమైన అంశం : పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు
పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి మృతి పట్ల పీడీఎఫ్‌ ఏపీ ఎమ్మెల్సీల తరఫున కేఎస్‌ లక్ష్మణ్‌ రావు, ఐ వెంకటేశ్వరరావు సంతాప ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడుగా ఉద్యమ నాయకుడిగా పనిచేస్తూ సాబ్జి యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక ఉద్యమాలలో భాగస్వామి అయ్యారని తెలిపారు. 2021 మార్చిలో తూర్పు గోదావరి పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజక వర్గం నుండి శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటు : పీడీఎఫ్‌ మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ
ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి మృతికి పీడీఎఫ్‌ మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ సంతాపం ప్రకటించారు. సాబ్జి మృతి యూటీఎఫ్‌ ఉద్యమానికి, ఉపాధ్యాయుల ఉద్యమానికి తీరని లోటని తెలిపారు. వారి కుటుంబానికి సానుభూతిని తెలిపారు.
ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంతాపం
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, యూటీఎఫ్‌ మాజీ అధ్యక్షుడు షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన మరణం ఉపాధ్యాయ ఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు.
టీఎస్‌యూటీఎఫ్‌ దిగ్భ్రాంతి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, యూటీఎఫ్‌ మాజీ అధ్యక్షుడు షేక్‌ సాబ్జీ శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చురుకైన నాయకుడు, సమరశీల ఉద్యమకారుడు సాబ్జీ మరణం ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ప్రజాఉద్యమాలకు తీరని లోటు : బి వెంకట్‌
ఉపాధ్యాయ ఉద్యమ నేత, యూటీఎఫ్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి సభ్యులు షేక్‌ సాబ్జీ మరణం కలచి వేసిందని ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ అన్నారు. సుదీర్ఘకాలంగా ఆయనతో పరిచయాలు ఉన్నాయనీ, ఆయన అకాల మరణం వారి కుటుంబంతో పాటు ప్రజా ఉద్యమాలకు, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌కు తీరనిలోటన్నారు. విద్యార్థి ఉద్యమం నుంచి ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలు అనేకం ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు, యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Spread the love