విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి..
నాసిరికం బియ్యంను తిరిగి పంపిన అధికారులు
నవతెలంగాణ – నసురుల్లాబాద్
ప్రభుత్వ పాఠశాలలో మోనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని బాన్సువాడ డివిజన్ డిటి ఎన్ఫోర్స్మెంట్ అధికారి శారీఫోద్దీన్ అన్నారు. శుక్రవారం నసురుల్లాబాద్ మండలం లోని నెమ్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం నాడు నవతెలంగాణ పత్రికలో ముక్క వాసన ,లక్కపురుగులు అనే శీర్షిక ప్రచరితం కావడంతో జిల్లా కలెక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, తహశీల్దార్ సువర్ణ లు స్పందించి వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మండల విద్యాధికారి చందర్, పౌర సరఫరాల అధికారి ఖాజా షరీఫ్ లు విచారణ చేపట్టారు.
మధ్యాహ్న భోజనం ను పరిశీలించారు. భోజనం ముద్దలు ముద్దలుగా ఉండడం, బియ్యం నాసిరకంగా ఉండడంతో పాఠశాలలో నిలువ ఉన్న 16 సంచులను వెంటనే బాన్సువాడ డివిజన్ కేంద్రంలో ఉన్న పౌరసరఫరాల కేంద్రంకు తరలించి, తిరిగి నాణ్యమైన బియ్యంను తెప్పించుకున్నారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి చందర్, సివిల్ సప్లై అధికారి ఖాజా షరీఫ్ మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులు తో ముచ్చటించారు . భోజనం ఎలా ఉందని విద్యార్థులను ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నేను ప్రకారం భోజనం అందించాలన్నారు. వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. వీరి వెంట ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.



