Saturday, March 7, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్అతి జోక్యం వద్దు

అతి జోక్యం వద్దు

- Advertisement -

భార్యా భర్తల మధ్య తల్లిదండ్రుల అతి జోక్యం సరైనది కాదు. పరస్పర అవగాహనతో ఇద్దరూ నిర్ణయాలు తీసుకోవాలి. చిన్న చిన్న గొడవలు తమంతట తామే పరిష్కారం చేసుకోవాలి. అంతేగానీ ప్రతి విషయం తల్లిదండ్రులతో, అత్తమామలకి చెప్పడం సరైన పద్దతి కాదు. భార్యాభర్తల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం చాలా సందర్భాల్లో అవసరం లేదు. ప్రతి చిన్న విషయంలో తల్లిదండ్రుల జోక్యం చేసుకుంటే వారికి తమ బంధంపై నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. వారి మధ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌లో మీకోసం…

మాధవికి దాదాపు 29 ఏండ్లు ఉంటాయి. పెండ్లి అయ్యి రెండేండ్లు అవుతుంది. భర్త శంకర్‌ ప్రయివేటు సంస్థలో ఉద్యోగి. శంకర్‌కి తల్లి తప్ప ఎవరూ లేరు. ఆమె కూడా వీళ్లతోనే ఉంటుంది. చెల్లికి ఏండేండ్ల కిందట పెండ్లి జరిగింది. ఆమె అత్తగారింట్లో ఉంటుంది. ఇక మాధవికి అన్నదమ్ములు లేరు. ముగ్గురూ ఆడపిల్లలే. ఒక అక్కకు పెండ్లి అయింది. శంకర్‌, మాధురి చిన్న చిన్న సమస్యలకు కూడా గొడవ చేసుకుంటారు. చిన్న విషయమైనా వాళ్లకు మాత్రం పెద్దగా కనిపించేది.
అవి ఎలాంటి విషయాలంటే నీళ్లను వేస్ట్‌ చేయొద్దంటాడు శంకర్‌. దానికి మాధవి ‘ఈ విషయం కూడా నాకు తెలియదా?’ అంటుంది. ఎక్కువగా ఇలాంటి విషయాల్లోనే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాధవి ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి తన సమస్యను చెప్పుకుంది.


‘నా భర్త ప్రతి చిన్న విషయానికీ నాతో గొడవ పెట్టుకుంటాడు. నా జీతం డబ్బులన్నీ తీసుకుంటాడు. నా అకౌంట్లో ఒక్క పైసా కూడా ఉంచడు. నాకు తెలియకుండా నా ఫోన్‌ తీసుకుని డబ్బులు వేసుకుంటాడు. మా అమ్మానాన్నలకు ఎప్పుడైనా సాయం చేస్తే గొడవ పెట్టుకుంటాడు. వచ్చిన డబ్బంతా వేస్ట్‌ చేయడం ఎందుకు? కొంత సేవింగ్‌ చేయొచ్చు కదా అంటే వినిపించుకోడు. అప్పులున్నాయి అంటాడు. ఇంట్లో పనులు చేయడానికి పనమ్మాయి ఉంటుంది. వంట మాత్రం మేము చేసుకుంటాం. అయితే నేను ఎంత బాగా వండినా మా అత్తకు నచ్చదు. టీ కూడా బాగోలేదం టుంది. బయట నుండి తెప్పించమంటది. టీ, టిఫిన్‌, కూరలు అన్నీ బయట నుండే.

ఎప్పుడైనా మా అత్త వంట చేస్తే తన కొడుక్కు మాత్రమే వండుతుంది. నా బాక్స్‌ కోసం నేను మళ్లీ వండుకోవాలి. ఇదేంటి అంటే ‘నీకు నేనెందుకు వండి పెడతాను’ అంటుంది. మా అత్తయ్య మా బెడ్‌ రూంలోకి వచ్చి పడుకుంటుంది. ఎప్పుడైనా మేము లోపల ఉంటే డోర్‌ పెట్టుకోవద్దు, నాకు భయంగా ఉంటుంది అంటది. మా ఇద్దరినీ అస్సలు మాట్లాడుకోనీయదు. మాకు సంబంధించిన ప్రతి విషయంలో ఆమె జోక్యం చేసుకుంటుంది. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా తల్లి మాటలు విని నాపై గొడవ పెట్టుకుంటాడు. ‘మీ అమ్మానాన్న నీకు పద్దతులు నేర్పలేదా, వంట నేర్పలేదు’ అంటూ సూటి పోటి మాటలు అంటుంటారు.
ఒకసారి మా నాన్నకు డబ్బులు అవసరమంటే వేశాను. అప్పుడు నాతో గొడవ పెట్టుకున్నాడు. ఇలా గొడవలు జరిగిన ప్రతి సారి మానాన్న వచ్చి నన్ను తీసుకెళతాడు. ఆరోగ్యం బాగోకపోయినా అక్కడికే వెళ్లి చూపించుకోవాలి. తగ్గిన తర్వాత తిరిగి రావాలి. శంకర్‌కు బీపీ ఉంది. దానికి మందులు వాడడం లేదు. చిన్న విషయానికే అతనికి కోపం వస్తుంది. చేతులు గోడలకు, తలుపులకు కొట్టుకుంటుంటాడు. వాళ్ల అమ్మ అతనికే సపోర్ట్‌ చేస్తుంది. ఆ ఇంట్లో నాకసలు స్థానమే లేదు. ఒకసారి పంచాయితీ పెడితే పెద్దలు మమ్మల్ని విడిగా ఉండమన్నారు. ఆమెకు కావల్సిన సరుకులన్నీ శంకర్‌ ఏర్పాటు చేస్తున్నాడు. దీపావళికి నేను పుట్టింటికి వెళ్లి వచ్చాను. అప్పుడు నాతో గొడవ పడ్డాడు. దాంతో మళ్లీ మా పుట్టింటికి వెళ్లాను. అప్పటి నుండి శంకర్‌ నాతో మాట్లాడడం లేదు. ఇలా ఎన్ని రోజులని భరించాలి. పుట్టింట్లో ఎన్ని రోజులని ఉండాలి. మీరే నాకు సలహా ఇవ్వండి’ అంది.

మేము శంకర్‌ కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడితే అందరూ చెప్పింది విన్న తర్వాత శంకర్‌, మాధవీల మధ్య సమస్యకు కారణం ఇరు కుటుంబాల పెద్దలే అని అర్థమయింది. వారి మధ్య జరిగే ప్రతి చిన్న విషయంలో తల్లిదండ్రులు కల్పించుకుంటున్నారు. వారిని సొంతగా ఆలోచించనీయడం లేదు. ఇద్దరి మధ్య గొడవ జరగడానికి కారణం శంకర్‌ తల్లి కారణమైతే, మాధవి తండ్రి గొడవ జరిగిన ప్రతిసారీ ఆమెను పుట్టింటికి తీసుకెళ్లిపోతాడు. ఇద్దరూ ఆఫీస్‌ నుండి వచ్చిన తర్వాత కనీసం పది నిమిషాలు కూడా మాట్లాడుకోరు. ఫోన్లు చూస్తూ కూర్చుంటారు. ఇద్దరికీ కాస్త సమయం దొరికితే శంకర్‌ తల్లి అడ్డు పడుతుంది. అయితే ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ మాత్రం ఉంది. కేవలం పెద్దల అతి జోక్యం వల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయనే విషయం మాకు అర్థమయింది.
శంకర్‌ తల్లితో ‘ఇంటికి కోడలు వచ్చినప్పుడు ఆమెను మీ కుటుంబ సభ్యురాలిగా చూసుకోవాలి. అంతేకానీ మీరు మీ కొడుకు, కోడలిని దూరం చేస్తున్నారు. వాళ్ల సంతోషానికి అడ్డుపడుతున్నారు. మీ కొడుకు ఇలా ఇబ్బంది పడుతుంటే మీరు మాత్రం ఆనందంగా ఉండగలుగుతారా? అనవసరంగా వారిద్దరి మధ్య గొడవలు సృష్టించకండి. ఇద్దరూ సంతోషంగా ఉండేందుకు మీ సహకారం చాలా అవసరం’ అని చెప్పాము.

మాధవి తండ్రితో ‘మీరు వాళ్ల మధ్య చిన్న గొడవ జరిగితే చాలు వచ్చి మాధవిని తీసుకెళ్లిపోతున్నారు. మీరే మాట్లాడి తిరిగి ఆమెను పంపిస్తున్నారు. ఇక వాళ్లిద్దరూ ఎప్పుడు మాట్లాడుకుంటారు. సమస్యలు రాకుండా ఎలా చూసుకుంటారు. మీరు ఇలా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే వాళ్లకు కుటుంబం, బంధాల గురించి ఎలా తెలుస్తుంది. కూతురుని అన్నేసి రోజులు పుట్టింట్లో ఉంచుకుంటే ఆమె సంసారం ఎలా సాగుతుంది. సంతోషంగా ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ల సమస్యలు వాళ్లు పరిష్కరించుకుంటారు. అవసరమైతే ఇకపై మా దగ్గరకు వస్తారు. మీరు వాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మానుకోండి. అప్పుడు మీ అల్లుడు, కూతురు సంతోషంగా ఉంటారు’ అని చెప్పాము.

శంకర్‌, మాధవిని కూర్చోబెట్టి ‘మీరు ఆఫీస్‌ నుండి వచ్చిన వెంటనే ఫోన్లు చూసుకోవడం మానేయండి. సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకోండి. అంతకంటే ముందు ఓ వారం రోజులు సెలవులు పెట్టి ఎక్కడికైనా వెళ్లి రండి. అప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు కచ్చితంగా వస్తాయి. వాటిని మీరే పరిష్కరించుకోవాలి. అంతేకానీ ప్రతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోవడం సరైనది కాదు. దీని వల్ల మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే భావనకు వాళ్లు వచ్చేస్తారు. ఇకపై మీకు ఎలాంటి సమస్య వచ్చినా మాతో చెప్పండి’ అన్నాము. మేము చెప్పిన దానికి అందరూ అంగీకరించి వెళ్లారు.

– వై వరలక్ష్మి, 9948794051

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -