యూఎస్ నియంత్రణను అధిగమిస్తూ ఆయుధాలకు నిధులు
ఆర్థిక ఆంక్షల నడుమ కూడా విదేశీ కొనుగోళ్లు
అమెరికాకు ఇరాన్ కొత్త సవాల్
టెహ్రాన్, వాషింగ్టన్ : అమెరికా విధించిన కఠిన ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. అయినప్పటికీ.. ఇరాన్ ఆయుధాలకు నిధులు సమకూరుతున్నాయి. అయితే బిట్‌కాయిన్ మైనింగ్ ద్వారా అంతర్జాతీయ చెల్లింపులు కొనసాగిస్తూ ఆయుధాలు, యంత్రాలు వంటి అవసరమైన వస్తువులను విదేశాల నుంచి కొనుగోలు చేస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇటీవల ఇరాన్ కరెన్సీ విలువ పడిపోవడం, అంతర్జాతీయ ఆంక్షల ఒత్తిడి పెరగడం వంటి సమస్యల మధ్య ఆ దేశం విదేశీ చెల్లింపుల కోసం కొత్త మార్గాన్ని ఉపయోగిస్తోంది. 2019లో ఇరాన్ ప్రభుత్వం బిట్‌కాయిన్ మైనింగ్‌ను చట్టబద్ధం చేసింది. అప్పట్లో ఇది ఆర్థిక ప్రయోగంగా కనిపించినప్పటికీ.. ప్రస్తుతం ఇది ఆంక్షలను తప్పించుకునే వ్యూహంగా మారిందని విశ్లేషకులు చెప్తున్నారు.
నిపుణుల ప్రకారం… ఇరాన్లో ఒక బిట్‌కాయిన్‌ను మైనింగ్ చేయడానికి సుమారు 1300 డాలర్లు ఖర్చవుతుంది. ప్రస్తుతం బిట్‌కాయిన్ ధర దాదాపు 73 వేల డాలర్లు ఉండటంతో ఒక్క నాణెంపై భారీ లాభం వస్తోంది. ఈ బిట్కాయిన్లను ప్రభుత్వం నియంత్రించే డిజిటల్ వాలెట్లకు పంపించి, వాటితో విదేశీ సరఫరాదారులకు చెల్లింపులు చేస్తోంది. దీంతో ‘స్విఫ్ట్’ (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీకమ్యూనికేషన్) బ్యాంకింగ్ వ్యవస్థ అవసరం లేదు. అలాగే డాలర్ వ్యవస్థను తాకకుండా చెల్లింపులు జరిపేయొచ్చు. అమెరికా ఆంక్షలను దాటుకుంటూ ఇరాన్ తన పని తాను కానియొచ్చు. ఇది అమెరికాకు ఇరాన్ విసురుతున్న కొత్త సవాలుగా చూడొచ్చని నిపుణులు చెప్తున్నారు.
బ్లాక్‌చెయిన్ విశ్లేషణ సంస్థ చెయినాలసిస్ ప్రకారం… 2025లో ఇరాన్ క్రిప్టో ఆర్థిక వ్యవస్థ విలువ 7.78 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ లావాదేవీలలో పెద్ద భాగం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు సంబంధించిన వాలెట్లతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు. బిట్‌కాయిన్ లావాదేవీలు పబ్లిక్ బ్లాక్ చెయిన్‌లో నమోదు అవుతాయి. అందువల్ల ఆర్థిక కదలికలను విశ్లేషకులు గమనించగలుగుతున్నారు. ఉదాహరణకు, గతనెల 28న ఇజ్రాయిల్-అమెరికా దాడుల సమయంలో ఇరాన్‌కు చెందిన పెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ నోబైటెక్స్ నుంచి అకస్మాత్తుగా భారీగా డబ్బు బయటకు వెళ్లినట్టు గుర్తించారు. మూడు రోజులలో దాదాపు 10.3 మిలియన్ డాలర్ల క్రిప్టో లావాదేవీలు జరిగాయని చెప్తున్నారు.
నిపుణుల మాటలో చెప్పాలంటే.. ఇది యుద్ధ సమయంలో ఆర్థిక సమాచార సంకేతాలను ఇచ్చే కొత్త ఇంటెలిజెన్స్ పద్దతిగా మారుతోంది. ఇరాన్ మాత్రమే కాదు.. ఇతర దేశాలు కూడా క్రిప్టోను ఆంక్షలను తప్పించుకునే మార్గంగా ఉపయోగిస్తున్నాయి. రష్యా ఒక ప్రత్యేక స్టేబుల్‌కాయిన్ ద్వారా 93 బిలియన్ డాలర్ల లావాదేవీలు జరిపిందని నివేదికలు చెప్తున్నాయి. ఉత్తర కొరియా హ్యాకర్లు ఒక క్రిప్టో దాడిలో 1.5 బిలియన్ డాలర్లు దోచుకుని ఆయుధ కార్యక్రమాలకు మళ్లించినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి.
డాలర్ ఆధిపత్యానికి ఇరాన్ గండి
అమెరికా ప్రపంచంపై డాలర్ ద్వారా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. పలు దేశాలపై ఆర్థిక ఆంక్షల పేరుతో వాటిని తన గుప్పెట్లో పెట్టుకుంటోంది. అయితే డాలర్ ఆధిపత్యానికి బ్లాక్‌చెయిన్ సాంకేతికత ఒక సవాలుగా మారుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. అందువల్ల ఇరాన్ వంటి దేశాలకు అమెరికా నియంత్రణలోని ఆర్థిక వ్యవస్థను దాటుకొని మరీ లావాదేవీలు చేయగల దారులు ఏర్పడుతున్నాయని అంటున్నారు.



