ఆర్థిక శాఖ సన్నాహక సమావేశాలు రెండుసార్లు వాయిదా
ఆన్లైన్లో ప్రతిపాదనలకే పరిమితం
సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సంప్రదింపులు కరువు
ప్రభుత్వ తీరుపై సర్వత్రా చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర బడ్జెట్‌పై కసరత్తు మాత్రం నత్తనడకన సాగుతున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం అంతా అధికారుల కేంద్రంగానే ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహం ఈనెల ఐదున హైదరాబాద్‌లో నిర్వహించారు. ఆ వివాహ పనుల్లో ఆయన నిమగ్నం కావడంతో బడ్జెట్ కసరత్తు పనులకు సంబంధించి అధికారులపైనే భారం పడింది. ఇంకోవైపు అన్ని శాఖల మంత్రులు, సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశాలను నిర్వహించడానికి ఆర్థిక శాఖ షెడ్యూల్‌ను జారీ చేసింది. రెండు సార్లు ఆ సమావేశాలు వాయిదా పడడం గమనార్హం. ఆన్లైన్లో ప్రతిపాదనలకే ఆర్థిక శాఖ పరిమితమైంది. వాటి ఆధారంగానే ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్నారు.
అయితే శాఖలు ఆన్లైన్లో సమర్పించే ప్రతిపాదనల్లో బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాయి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, అప్పు ఇలా అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను చేస్తుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలు, ప్రజల అవసరాలు ఇలా ఇతర అంశాలనూ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అందులోనూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు పెద్దపీట వేస్తుంది. అయితే మంత్రులు, సంబంధిత శాఖల అధికారులతో నేరుగా సంప్రదిస్తేనే ప్రతిపాదనలు, కేటాయింపులపై స్పష్టత వస్తుంది. ఈ సంప్రదింపులను చేయకపోవడం వల్ల ప్రభుత్వ తీరుపై కొంత అసహనం వ్యక్తమవుతున్నది. ఈనెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ ఎప్పుడు కొలిక్కి వస్తుందన్న చర్చ సర్వత్రా జరుగుతున్నది.
ఇక బడ్జెట్ కసరత్తులో భట్టి బిజీ బిజీ
కుమారుని పెండ్లి ముగియడంతో ఇక బడ్జెట్ కసరత్తులోనే ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్క నిమగ్నమవుతారని అధికారులు చెప్తున్నారు. పూర్తిగా బిజీబిజీగా ఉంటారని సమాచారం. అన్ని శాఖల మంత్రులు, అధికారులతో సంప్రదింపులు చేస్తారని తెలుస్తున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల తొమ్మిది నుంచి సన్నాహక సమావేశాలను ప్రారంభించే అవకాశమున్నది. ఆరు గ్యారంటీలు, 420 హామీలను కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. వివిధ డిక్లరేషన్లను కూడా విడుదల చేసింది. అయితే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, రేషన్‌కార్డుల పంపిణీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.పది లక్షల వరకు పెంపు వంటి హామీలను అమలు చేయడం వల్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు అధికార కాంగ్రెస్‌కే జై కొట్టారు.
అయితే ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో మెజార్టీ వాగ్ధానాలు ఇంకా అమలుకు నోచుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు చెల్లింపు, విద్యార్థులకు రూ.ఐదు లక్షల వరకు విద్యా భరోసా కార్డు, ఆసరా పెన్షన్లు రూ.నాలుగు వేలకు పెంపు, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగులకు పెండింగ్ డీఏల మంజూరు, 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించడం, ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి వాటితోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలన్న డిమాండ్ వస్తున్నది. రానున్న బడ్జెట్లో వాటి అమలు కోసం నిధులను కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందో ఆసక్తి నెలకొంది. కొత్త పథకాలను ప్రారంభిస్తుందా?అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికకు ఇబ్బందులు
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరిట ఈనెల ఆరు నుంచి జూన్ 12 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 99 రోజులపాటు ఈ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఆచరణలో ఈ కార్యక్రమం అమలుకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 16 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ జరిగే సమయంలో సీఎస్ సహా అన్ని శాఖల ఉన్నతాధికారులు అసెంబ్లీకే పరిమితమవుతారు. ఇంకోవైపు బడ్జెట్ కసరత్తుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ జరిగినన్ని రోజులు ప్రజా ప్రాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సజావుగా సాగుతుందా?అన్న ప్రశ్న తలెత్తుతున్నది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాతే ఇది పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశమున్నది. ఇప్పటికే ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండాకాలంలో 99 రోజుల కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రజల భాగస్వామ్యం ఏ స్థాయిలో ఉంటుందోననే చర్చ కూడా జరుగుతున్నది.



