ప్రభుత్వ మౌనంతో దెబ్బతిన్న స్వతంత్ర విదేశాంగ విధానం
అలీనోద్యమ వారసత్వానికి భంగం
తీవ్రంగా ఖండించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ కూటమి సాగిస్తున్న అక్రమ యుద్ధం పట్ల భారత ప్రభుత్వ వైఖరి శోచనీయమంటూ సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్న మౌనం, నిష్క్రియాపరత్వం దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని దెబ్బతీస్తున్నాయని, దీర్ఘకాలంగా అమలవుతున్న దేశ సామ్రాజ్యవాద వ్యతిరేక, అలీనోద్యమ వారసత్వాన్ని బలహీనపరుస్తోందని విమర్శించింది. ఇరాన్‌పై ప్రారంభించిన ఈ దారుణమైన యుద్ధం పశ్చిమాసియాను దాటి మన పొరుగు ప్రాంతంతో పాటూ ఇతర ప్రాంతాలకు విస్తరించింది. అమెరికా జలాంతర్గామి ప్రయోగించిన టార్పెడోల కారణంగా హిందూ మహా సముద్రంలో ఇరాన్ నౌక ఐఆర్ఐఎస్ దేనా మునిగిపోయింది. విశాఖపట్నంలో సంయుక్త నావికా విన్యాసాల్లో పాల్గొని ఆ నౌక తిరిగి వెళుతోంది. ఆ నౌక సురక్షితంగా తిరిగి వెళ్లేందుకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లను అందించడంలో భారత్ విఫలమైంది.
రెండో ఇరాన్ నౌక ఐఆర్ఐఎస్ బుషెహర్‌కు ట్రింకోమలిలో సురక్షితంగా ఆశ్రయం కల్పించి, అందులోని 208మంది సిబ్బందిని రక్షించే బాధ్యతను శ్రీలంక తీసుకున్న తర్వాత ఈ సిగ్గుచేటైన పరిణామం మరింతగా బయటపడింది. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాల ప్రకారం శ్రీలంక మానవత్వంతో ప్రతిస్పందించడంతో దక్షిణాసియాలో అగ్రగామి దేశంగా భారత్ తన హోదాను దుర్వినియోగం చేసుకోవడం ఇప్పుడు ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాకు భారతదేశ విదేశాంగ విధానం పూర్తిగా లొంగిపోయిందన్న అంశం యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో ప్రధాని మోడీ జరిపిన పర్యటనలో ప్రతిబింబిస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానం యుద్ధ నేరస్తుడిగా పేర్కొన్న ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును మోడీ ఆలింగనం చేసుకోవడంతో భారత ప్రభుత్వ తటస్థ వైఖరి, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి మొత్తంగా తొలగిపోయింది. గతంలో, శాంతికి, దేశాల సార్వభౌమాధికారానికి భారత్ అండగా నిలబడేది.
కానీ అలీ ఖమేనీతో సహా ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని హతమార్చినా కనీసం దాన్ని ఖండించడంలో కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఇదిలావుండగా, చమురు, గ్యాస్ నౌకల రవాణాకు హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో దేశ ఇంధన భద్రత తీవ్ర అనిశ్చితిలో పడింది. ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తన గొప్పతనాన్ని ప్రదర్శించేలా, రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్‌ను 30రోజుల పాటు అనుమతించింది. పైగా చైనాకు ఇచ్చినట్లుగా భారత్‌కు ఎన్నడూ అలాంటి రాయితీలు లభించబోవని అమెరికా అధికారి ఒకరు పుండుపై కారం చల్లే రీతిలో స్పష్టంగా చెప్పారు.
అలాగే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం అమెరికాకే అనుకూలంగా వుందని సూచించారు. స్వాతంత్య్రం లభించినప్పటి నుంచి మన దేశం ఎన్నడూ ఇలాంటి తీవ్రమైన అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కొనలేదు. ఈ పరిస్థితిని సరిదిద్దుకోవడానికి గానూ యుద్ధాన్ని తక్షణమే విరమించి, శాంతిని పునరుద్ధరించాల్సిందిగా మోడీ ప్రభుత్వం పిలుపివ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. తద్వారా మన జాతీయ ఆత్మగౌరవం పునరుద్ధరించుకోగలుగుతామని పేర్కొంది. పశ్చిమాసియా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గల కోటి మందికి పైగా భారతదేశ వలస కార్మికులు సురక్షితంగా, భద్రంగా వుండేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) కోరింది.


