సామాజిక ప్రజాసంఘాల నేతలు
రజక, దళిత, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రెండు నెలల పసిబిడ్డ హంతకులను అరెస్ట్ చేయాలని ప్రజాస్వామ్యయుతంగా న్యాయం కోరిన సామాజిక ప్రజాసంఘాల నాయకులను అరెస్ట్ చేయడాన్ని ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఖండించాలని సామాజిక ప్రజాసంఘాల నేతలు కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్ వద్ద రజక, దళిత, సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రజక వృత్తిదారుల సంఘం నగర కార్యదర్శి గోపాల్ అధ్యక్షతన జరిగిన సభలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు మాట్లాడారు.
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ రజక, దళిత బాధితులకు న్యాయం చేయకుండా హంతకులకు రక్షణ కల్పించడం సిగ్గుచేటన్నారు. న్యాయం చేయాలని సెక్రటేరియట్ ముట్టడి చేపట్టిన ఉద్యమకారులను అక్రమ అరెస్టు అన్యాయమన్నారు. హత్య చేసిన పెత్తందారులని అరెస్టు చేయాలని, నిందితులపై హత్య కేసు, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, కేసు తప్పుదారి పట్టిస్తున్న పోలీసులను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, సెక్రటేరియట్ ముట్టడి చేస్తున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
ఇప్పటికైనా సీఎం చిత్తశుద్ధితో స్పందించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రజక, దళిత, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్‌చార్జి పెద్దాపురం భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కేశరాజు యాదగిరి, నాయకులు పరిపల్లి రాజు, రాయరాకుల తిరుపతి, నరేష్, వెంకన్న, వెంకటేష్, టీపీటీఎల్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సుబ్బారావు, నాయకులు చెన్నయ్య, సీఐటీయూ నాయకులు జి రాములు, రాజశేఖర్, ఐద్వా నాయకులు ఇందిర, బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు.



