మల్లక్కపేట-నాగారం సరిహద్దులో 2 క్వింటాళ్ల మిర్చి అపహరణ.. పోలీసులకు ఫిర్యాదు
నవతెలంగాణ – పరకాల
పంట చేతికొచ్చిన వేళ రైతు ఇంట్లో సిరి నిండాల్సింది పోయి, దొంగల పాలు కావడంతో ఒక అన్నదాత గుండె కోత అనుభవిస్తున్నాడు. హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట – నాగారం గ్రామ శివారులో మిర్చి చోరీ జరిగింది. మల్లక్కపేట గ్రామానికి చెందిన రైతు దొమ్మటి బాబు తన పొలం వద్ద ఉన్న బావి దగ్గర కోసిన మిర్చిని ఆరబోశారు.
శనివారం తెల్లవారుజామున గమనించగా, ఆరబోసిన మిర్చిలో సుమారు 2 క్వింటాళ్లు మాయమైనట్లు గుర్తించి రైతు షాక్కు గురయ్యాడు. ప్రస్తుతం మార్కెట్లో మిర్చికి మంచి ధర పలుకుతుండటంతో, అపహరణకు గురైన మిర్చి విలువ లక్ష రూపాయలకు పైగానే ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంట కళ్లముందే మాయం కావడంతో చుట్టుపక్కల రైతులు భయాందోళన చెందుతున్నారు. మిర్చికి ఫుల్ డిమాండ్ ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ఏదైనా ముఠా ఈ తరహా చోరీలకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాధిత రైతు ఫిర్యాదు మేరకు పరకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని సిఐ క్రాంతికుమార్ ధీమా వ్యక్తం చేశారు.”రైతులు తమ పంట నిల్వల వద్ద అప్రమత్తంగా ఉండాలని. రాత్రి వేళల్లో కాపలా ఉంచుకోవడంతో పాటు, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.



