వెనిజులా రాజకీయ చరిత్రలో నికోలస్ మదురో పేరు ఎంతగా వినిపిస్తుందో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ పేరు కూడా అంతే ప్రాధాన్యం కలిగి ఉంది. కేవలం ఫస్ట్ లేడీగా మాత్రమే కాకుండా, దశాబ్దాలుగా వెనిజులా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కీలక వ్యక్తిగా ఫ్లోరెస్ పేరుపొందారు. ఆమె రాజకీయ ప్రస్థానం, హ్యూగో చావెజ్ నాయకత్వంలో భాగస్వామ్యం, అధికారంలోకి ఎదిగిన తీరు – ఇవన్నీ వెనిజులా ఆధునిక చరిత్రలో ముఖ్యమైన అధ్యాయాలు. వెనిజులా రాజకీయాల్లో యోధురాలిగా పేరొందారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అటువంటి యోధురాలి పరిచయం మానవి పాఠకులకు స్ఫూర్తిదాయకం…
వెనిజులాలోని కొజెడెస్ రాష్ట్రంలోని టినాక్విలో పట్టణంలో 1956, అక్టోబర్ 15న సిలియా ఫ్లోరెస్ జన్మించారు. ఆమె కుటుంబం కడు పేదరికంలో ఉండేది. కారాకస్ నగరంలోని శ్రామిక వర్గాల ప్రాంతంలో ఆమె బాల్యం గడిచింది. ఐదుగురు తోబుట్టువులతో కలిసి పెరిగింది. ఒకరకంగా ఆమె తొలినాళ్ళ జీవితం అత్యంత సామాన్యంగా గడిచింది. సామాన్య కుటుంబం నుంచి అసాధారణ ప్రస్థానం కొనసాగించడమే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం. చదువు పట్ల మక్కువతో న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. శాంటా మారియా విశ్వవిద్యాలయంలో చదివి, లేబర్, క్రిమినల్ లా కోర్సులో స్పెషలైజేషన్ చేశారు. ప్రారంభంలో ఒక డిటెక్టివ్‌ను వివాహం చేసుకుని, ముగ్గురు కుమారులకు తల్లి అయ్యారు. 1989లో కారాకస్‌లో చెలరేగిన హింసాత్మక ఆందోళనలు సిలియా ఫ్లోరెస్ జీవితంలో ఒక మలుపు తిప్పాయి. ఆమె దీన్ని తనలోని ‘విప్లవాత్మక పిలుపు’గా అభివర్ణించారు. ఈ సంఘటనే ఆమెను రాజకీయాల వైపు నడిపించింది.
చావెజ్‌తో అనుబంధం.. రాజకీయ ప్రవేశం
వెనిజులా చరిత్రలో 1992లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. లెఫ్టినెంట్ కల్నల్ హ్యూగో చావెజ్ అప్పటి అధ్యక్షుడు కార్లోస్ ఆండ్రెస్ పెరెజైస్పై తిరుగుబాటు ప్రయత్నం చేసి, విఫలమయ్యారు. దీంతో ఆయన జైలు పాలయ్యారు. ఈ సమయంలోనే న్యాయవాద వృత్తిలో వున్న సిలియా ఫ్లోరెస్ కీలకపాత్ర పోషించారు. జైలులో ఉన్న చావెజ్‌తో పాటు ఇతర సైనిక అధికారులకు న్యాయ సహాయం అందించడానికి ఆమె ముందుకొచ్చారు. 1994లో అప్పటి అధ్యక్షుడు రాఫెల్ కాల్డెరా నుంచి క్షమాభిక్ష పొందేలా చేసి, చావెజ్‌ను విడుదల చేయించడంలో ఆమె ప్రముఖపాత్ర పోషించారు.
అధికారంలోనూ ఉన్నతంగా..
అది చావెజ్ యుగం.1998లో చావెజ్ అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత సిలియా ఫ్లోరెస్ రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగారు. మొదటిసారి 2000లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2005లో మళ్ళీ ఎన్నికయ్యారు. ఆమెకు 2006లో ఒక చారిత్రక అవకాశం లభించింది. నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికై, ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. స్పీకర్‌గా పార్లమెంటును చాలా సమర్ధవంతంగా నడిపించారు. ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి. యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులాకు 2009 నుంచి 2011 వరకు రెండవ వైస్ ప్రెసిడెంట్‌గా సిలియా ఫ్లోరెస్ పని చేశారు. చావెజ్ 2012లో సిలియాను అటార్నీ జనరల్‌గా నియమించారు. ఈ కాలంలోనే సిలియా ఫ్లోరెస్ తన సన్నిహితులు కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆమె స్పం దిస్తూ, ‘వారి సొం త సామర్థ్యంతో ఇక్కడి వరకూ వచ్చారు. వాళ్ల సమర్థతకు అనుగు ణంగానే నియా మకం జరిగింది’ అని ధీటుగా బదులిచ్చారు.
మదురోతో వివాహం..
చావెజ్ 2013 మార్చిలో క్యాన్సర్‌తో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మదురో విజయం సాధించారు. ఏప్రిల్‌లో ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. మూడు నెలల తర్వాత జులైలో మదురో, సిలియా ఫ్లోరెస్ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ పిల్లలు లేరు. కానీ మునుపటి సంబంధాల నుంచి వీరికి పిల్లలున్నారు. సిలియా ఫ్లోరెస్‌కు ముగ్గురు కుమారులు, మదురోకు ఒక కుమారుడు. వీరందరినీ ఇద్దరూ కలిపి ప్రేమగా పెంచుకున్నారు. వివాహం తర్వాత సిలియా ఫ్లోరెస్ అటార్నీ జనరల్ పదవికి రాజీనామా చేశారు. కానీ రాజకీయాల నుంచి మాత్రం పూర్తిగా తప్పుకోలేదు. మళ్ళీ 2015లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మదురో ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేసిన రాజ్యాంగసభకు ఆమె ఎన్నికయ్యారు.
‘ఫస్ట్ లేడీ’ కాదు.. ‘ఫస్ట్ కాంబాటెంట్’
మదురో సిలియా ఫ్లోరెస్‌ను ‘ఫస్ట్ లేడీ’ అని పిలవరు. అందుకు బదులుగా ఆమెను ‘ప్రైమెరా కాంబాటియెంటే (మొదటి యోధురాలు)’ అని పిలుస్తారు. ఈ బిరుదు చావిస్మో సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో 2013లో మదురో మాట్లాడుతూ, ‘ఆమె మాతృభూమి తొలి యోధురాలిగా, మొదటి సోషలిస్టుగా, బారియోల ప్రజల ప్రథమ మహిళగా సిద్ధంగా ఉండాలని నేను చెప్పాను’ అని అన్నారు. అప్పటి నేషనల్ అసెంబ్లీ సభ్యుడు ఒకరు ‘ఆమె మదురోకు బలమైన హస్తంగా ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. బహిరంగంగా సిలియా ఫ్లోరెస్ సాంప్రదాయ ‘ఫస్ట్ లేడీ’ పాత్రను పోషించారు. 2015లో ‘కాన్ సిలియా ఎన్ ఫ్యామిలియా’ అనే టీవీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కుటుంబ విలువల గురించి ఆమె చర్చించేవారు. అప్పుడప్పుడూ రాష్ట్ర టెలివిజన్‌లో తన భర్తతో కలిసి సల్సా నృత్యం చేస్తూ కనిపించేవారు.
మదురోకు వెన్నుదన్నుగా..
నిజానికి 2013 తర్వాత ఆమె అధికారిక ప్రభుత్వ పదవులు ఏవీ చేపట్టలేదు. అయినా, ఆమె ప్రభావం చాలా విస్తృతంగా ఉండేది. అనేక రంగాలను తీర్చిదిద్దడంలో మదురోకు శక్తివంచన లేకుండా సహకరించారు. ఈ కృషిని పలువురు గుర్తించారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆమె వెనిజులాలోని న్యాయవ్యవస్థను తీర్చి దిద్దడంలో కీలకపాత్ర పోషించారు. చాథమ్ హౌస్ లాటిన్ అమెరికా ప్రోగ్రామ్ సీనియర్ ఫెలో క్రిస్టోఫర్ సబాటిని ఆమెను ‘సింహాసనం వెనుక శక్తి’గా అభివర్ణించారు. తన శక్తి మేరకు మదురోకు పాలనలో సహకరిస్తు న్నప్పటికీ అత్యంత సాదా, సీదా మహిళగా ఉండటానికి ఆమె చేసిన ప్రయత్నమే దీనికి కారణం.
అమెరికా నిర్బంధంలో సైతం..
వెనిజులా చరిత్రలో 2026 జనవరి 3న ఒక ఊహించని పరిణామం జరిగింది. అమెరికా ప్రత్యేక దళాలు కారాకస్‌లో నిర్వహించిన ఆపరేషన్‌లో నికోలస్ మదురో, సిలియా ఫ్లోరెస్‌ను అరెస్టు చేశాయి. వీరిద్దరినీ అమెరికాకు తరలించి, న్యూయార్క్ కోర్టులో హాజరుపరిచారు. సిలియా ఫ్లోరెస్‌పై కొకైన్ అక్రమ రవాణా కుట్ర, మెషిన్ గన్స్, విధ్వంసక పరికరాలు కలిగి ఉండటం తదితర ఆరోపణలు నమోదు చేశారు. జనవరి 5న మ్యాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో వీరిద్దరూ హాజరై, తమపై మోపిన ఈ ఆరోపణలను ఖండిస్తూ ‘నేరం చేయలేదు’ అని వాదించారు. ఈ అరెస్టుతో వెనిజులాలో సుమారు 13 ఏండ్ల మదురో పాలన తాత్కాలికంగా ఆగింది. అయితే సిలియా ఫ్లోరెస్ రాజకీయ ప్రస్థానం మాత్రం దశాబ్దాలుగా కొనసాగింది. సామాన్య న్యాయవాదిగా ప్రారంభమై, చావెజ్ ఉద్యమంలో భాగస్వామి అయి, వెనిజులా రాజకీయాలను నడిపించిన కేంద్రశక్తిగా ఆమె పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
ఆమె నిజమైన ప్రభావం ఏమిటి? ఆమె కేవలం మదురో భార్య మాత్రమేనా? లేక తన ఆలోచనాశక్తితో రాజకీయాలను ప్రభావితం చేసిన సమర్ధవంత నాయకురాలా? ఈ ప్రశ్నకు సమాధానం వెనిజులా రాజకీయ చరిత్రలోనే వెలుగొందుతోంది. ఒకటి మాత్రం నిజం.. సిలియా ఫ్లోరెస్ పేరు వెనిజులా ఆధునిక చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.
మదురోతో తొలి పరిచయం..
ఇదే సమయంలో సిలియా ఫ్లోరెస్‌కు నికోలస్ మదురోతో పరిచయమయింది. అప్పుడు మదురో చావెజ్ సహచరుడిగా, భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నారు. ‘నేను సిలియాను అప్పుడే మొదటిసారి కలిశాను. ఆమె దేశం కోసం అంకితమై పనిచేసే సైనిక అధికారులకు న్యాయవాదిగా ఉన్నారు. అంతేకాదు కమాండర్ చావెజ్‌కు కూడా న్యాయవాది. జైలులో చావెజ్‌కు న్యాయవాదిగా ఉండటం చాలా కష్టమైన పని’ అని మదురో ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.
అమెరికా కుట్రలు..
మదురోతో పాటు, ఆయనకు అన్నివిధాల అండదండగా నిలిచిన సిలియా ఫ్లోరెస్పైన కూడా అమెరికా అనేక కుట్రలకు పాల్పడింది. ముఖ్యంగా ఆమె ప్రతిష్టను దెబ్బతీసే చర్యలకు పాల్పడింది. పలు వివాదాల్లో ఆమెను ఇరికించే ప్రయత్నం చేసింది. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ 2017లో మదురోపై ఆంక్షలు విధించినప్పుడు, సిలియా ఫ్లోరెస్‌ను కూడా ఈ జాబితాలో చేర్చారు. దీనిపై మదురో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మీరు నాపై దాడి చేయాలనుకుంటే చేయండి. కానీ సిలియాను ఇబ్బంది పెట్టకండి! నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి..’ అని అన్నారు.
– శాంతిశ్రీ, 9866371283



