Sunday, March 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినీ మొఖం కాదె....

నీ మొఖం కాదె….

- Advertisement -

ఇది నీది కాదయ్యా ఆధార్‌ కార్డు, ఆపరేటరు
నాదే సారూ, రైతుకాని, కూలీ కాని వ్యక్తి ప్రాధేయపడుతున్నాడు
కాదని చెబుతున్నానా, ఆపరేటరు
గదేంది సారూ, నా మొహం చూడండి దీన్లో
నాకూ కనిపిస్తోందయ్యా… కానీ కంప్యూటర్‌ కాదంటోంది, ఆపరేటరు
గదెట్లంటది సారూ, ఇంకొక్కసారి చూడండి సారూ. ఈ స్కీములో లేకపోతే అన్యాయమైపోతా కద సారూ…
నీకు అన్యాయం చేయడానిక్కాదయ్యా నేనుండేది, చూస్తానుండు. ఆధార్లో నీ మొహం, ఇప్పుడున్న నీ మొహం వేరే అంటోంది. నా పరేషాన్లో నేనున్నాను.
ఇంతలో ఆపరేటరు సారుకు ఫోనొచ్చింది. ఏమాత్రం అనుమానమున్నా పేర్లు తీసెయ్యండి అని అవతలనుండి పెద్ద బాసు, తనకంటే పెద్దబాసుదగ్గరినుండి తనకూ ఈ ఆదేశాలే ఉన్నాయన్నాడు.
కొద్దిగా వినిపించీ, వినిపించక, అర్థమయ్యీ అర్థమవ్వక బిక్కచిక్కిన మొహంతో ఆధార్‌ కార్డు పట్టుకొని అటు రైతుకాని, కూలీ కాని వ్యక్తి అలాగే నిలబడ్డాడు.
మళ్లా ఒకరోజు రావయ్యా, అన్నాడు ఆపరేటరు.
బాబూ ఈరోజు పని వదులుకొని వస్తే అక్కడ హాజరులేక జీతం రాదు ఇక్కడ ఇది నా మొహం గుర్తుపట్టదు, ఎలా సారూ అని తన బాధ చెప్పుకున్నాడు.
నీ బాధ నీది, నా పరేషాన్‌ నాది, మరొకరోజు రావాల్సిందేనయ్యా…. ఆపరేటరుకూ ఇబ్బందిగా ఉంది చెప్పాలంటే.
సరే సారూ, నా తలరాత ఎలాగుందో ఈసారైనా తేలుతుందా? తన అనుమానం, భయం తనది మరి.
చెప్పలేనయ్యా, పైవాళ్లను కాదనలేను, మీకు అన్యాయం చేయలేను, నా పరిస్థితి…. ఎవ్వరికీ రాకూడదు ఆపరేటరు లోన అనుకోవాలనుకుని పైకే అనేశాడు.
లిలిలి
కరోనాకు ముందు తీసిన ఫొటోలతో ఆధార్‌ కార్డులు ఇప్పటికీ వాడుతున్నారు. కళ్ల ఐరిష్‌ కూడా అప్పటిదే. కరోనా సమయంలో బతకలాన్న ఆశతో అందరిలాగే సోపులు, హ్యాండ్‌ వాషులూ, శ్యానిటైజర్లు ఏవిపడితే అవి రుద్ది ఎలాగో బతికి బట్ట కట్టిన మిత్రుడొకడు డ్రైవింగ్‌ లైసెన్సుకుపోతే ఏ వేలుకూ గుర్తులు లేకుండా అరిగిపోయాయి. అక్కడ ఏజెంటు కాస్త నిదానస్తుడున్నట్టున్నాడు, మూతికి పెట్టుకున్న మాస్కు సవరించుకొని పదివేళ్లూ పరీక్షగా చూశాడు మా మిత్రుడి ఎడమచేతి చూపుడు వేలుకు కొద్దిగా గీతలు కనిపించాయి. ఇదొక్కటీ ప్రయత్నిద్దాం సార్‌, ఆపై మీ అదృష్టం అని దాన్ని స్కాను పెట్టాడు. మావాడిని సిస్టం గుర్తు పట్టింది, వచ్చినతను దామోదరేనని నిర్ధారించింది. మావోడు బిగ్‌ బాస్‌లోనో, పాడుతా తీయగాలోనో గెలిచినంత పనిచేసి విజయ గర్వంతో మా ఇంటికొచ్చి విజయగర్వంతో జరిగిందంతా చెప్పాడు.
ఆధార్లో ఉన్న ఫొటోలకు లోన్లూ, స్కీముల్లో పైసలు రావచ్చేమో కాని అవి చూస్తే పెళ్లిళ్లు మాత్రం కావు, అట్లాగుంటయవి. ఏదో గవర్నమెంటు స్కూల్లోనో, పసువుల ఆసుపత్రిలోనో, ఇంకో ప్రభుత్వ కార్యాలయంలోనో కిటికీపక్క మొహానికి ఒకవైపుమాత్రమే పడ్డ వెలుగులో తీసిన ఫొటోకు, పదేళ్ల తరువాత ఇప్పుడున్న ఫొటోకు ఎలా ఉంటాయి పోలికలు. మనుషులు మారింటారు, మనుషుల రంగు మారింటారు. ఇప్పుడవన్నీ నేడున్న మనిషిని ఎలా పోలుస్తాయి. ముందే పైనుండి ఆదేశాలు, ఏమాత్రం ట్యాలీ కాకున్నా తీసేయమని. ఈ తీసేసుకుంటూపోవడమన్నది రెండువైపులా జరుగుతుందన్నది ప్రజలు సత్యం, ప్రజలెప్పుడో చూపిన వాస్తవం.
లిలిలి
ఎన్నికలముందు దేవుళ్లు వాళ్లు, ఇప్పుడు ఈ ముఖ గుర్తింపని పథకాలకోసం దేవుళ్లాడవలసి వస్తోంది. అదీకాక పురపాలక ఎన్నికలైపోయాయన్న భరోసా ఒకటి కావచ్చు. ఏమైనాకాని నాయకులు, వాళ్లు ఏ పార్టీవాళ్లైనా ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఏదో ఒక ఎన్నికలు వస్తూనే ఉంటాయి అవి కాకపోతే ఐదేళ్లకోసారి పరీక్ష తప్పదు. ఇప్పుడు ముఖం సరిగా కనబడలేదంటే మళ్లీ ఓటేసేనాడు నీ మొఖమూ వాళ్లకు కనబడదు. ఇదొక్క పాయింటు గుర్తుపెట్టుకుంటే నీవు జనాలకెంత ముఖ్యమో, జనాలూ నీకంత ముఖ్యమన్న విషయం తెలుస్తుంది. సాంకేతికత మీద తోసేసి కోత విధిస్తేనో, పైనుండి నిధులు రావడంలేదంటేనో అందరిమీదా ఒకేసారి వేటు పడుతుంది, ఎన్నికలప్పుడు. అందుకే కార్యాలయాల చుట్టూ తిరగలేని వృద్ధులకు, వికలాంగులకు ఇప్పుడు ఆసరాగా నిలబడకపోతే వాళ్లు పథకాల్లో గల్లంతవ్వడమేమోకాని నీవు తరువాత ఓటుజారి గల్లంతవుతావు.
ఎన్నికల వాగ్దానాల్లో వరద పారుతుంది. అధికారంలోకొచ్చినాక నీరంతా ఇంకిపోయి అంతా బీడుభూమిలా మారుతుంది. ఓడ మల్లయ్య కాస్తా బోడి మల్లయ్య ఐపోతాడు. మళ్లీ ఏరు దాటాల్సి వచ్చినప్పుడు ఆ మల్లయ్య తడాఖా తెలుస్తుంది. రుణమాఫీ నీకు లేదు, లిస్టులో నీ పేరు లేదని చెప్పావనుకో నీ లిస్టు మారిపోతుంది తరువాత. ఐదువందలకే గ్యాసు ఉత్తుత్తి గ్యాసని ప్రజలకు అనుమానమొచ్చిందనుకో నీ బెలూన్‌లో గాలి పీకేస్తారు. అందరికీ ఇస్తానని చెప్పి ఇప్పుడు రాజకీయం చేస్తివనుకో, వాళ్లకూ తెలుసు రాజకీయం. సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి మొహాలు గుర్తించనంత వరకు నీ మొహం ప్రజలకు చూపలేవు. చాటేయాల్సి వస్తుంది. అందుకే చాటుమాటు వ్యవహారాలు మాని నీటుగా ధీటుగా మాట ఇచ్చినప్పుడున్నంత ఘాటుగా ఇప్పుడూ ఉండాలి. లేకుంటే చేటైపోతావు.
నీ మొఖం కాదె…. అని నువ్విప్పుడంటే వాళ్లు కూడా నీ మొఖం కాదె…. అనేరోజులొస్తాయి. వాళ్లు వేరే మొహాలవైపు చూస్తే నీకే ప్రమాదం.

జంధ్యాల రఘుబాబు
9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -