Sunday, March 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినీతిబాహ్య నేతల నిష్క్రమణపర్వం

నీతిబాహ్య నేతల నిష్క్రమణపర్వం

- Advertisement -

ఇరవయ్యేళ్ల ముఖ్యమంత్రిత్వం. సగటున రెండేళ్లకోసారి అన్నట్టు పదిసార్లు ప్రమాణ స్వీకారం. సుశాసన్‌ బాబు బిరుడు పల్టూబాబు అవహేళన. సోషలిస్టు నేపథ్యంతో మొదలై జనతా ప్రయోగంలో పెరిగి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నీడలో నలిగి చివరకు మోడీ నీడలో ముగుస్తున్న నితీశ్‌ కుమార్‌ రాజకీయ జీవితం సమకాలీన ప్రాంతీయ పాలక పార్టీల నేతల దుస్థితికి దర్పణం పడుతుంది. అదే సమయంలో రానున్న రాజకీయ మధనం ఎలా వుండేది సంకేతప్రాయంగా చెబుతుంది. ఈ సంకేతాల్లో తెలుగు రాష్ట్రాలతో సహా అనేక చోట్ల అవకాశవాద నాయకుల భవిష్యత్తు ఎలా వుండేది రేఖామాత్రంగా కనిపిస్తుంది. అంతగా కనిపించనిది ఈ మలుపులు కదుపుల వెనక బీజేపీ, సంఘ పరివార్‌ రాజకీయాల బండారం.దానికి ఆధ్వర్యం వహిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ మల్లగుల్లాలు. ఈ పరిణామాల లోతుపాతులు చూడకుండా అంతా ఏకపక్షంగా చిత్రించే ధోరణులు వాస్తవికమైనవి కావు. ఏది ఏమైనా ఒకటి నిజం, చరిత్రలో మొదటిసారి బీహార్‌లో బీజేపీ ప్రత్యక్షంగా ప్రభుత్వా ధిపత్యం చేపట్టబోతున్నది. హిమచల్‌ప్రదేశ్‌ మినహా మొత్తం హిందీ రాష్ట్రాలన్నీ దాని పాలనలో వుండ బోతున్నాయి. వచ్చే ఏడాది జరగాల్సిన ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలకూ ఈ ఏడాది జరిగే అస్సాం, పశ్చిమ బెంగాల్‌, శాసనసభ ఎన్నికలకూ ఇది లాభదాయకమని పరివార్‌ భావిస్తున్నది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ది కుటుంబ పాలన అనీ, తాను వాటికి అతీతంగా తన వాళ్లను దూరం వుంచానని గొప్పలు పోయిన నితీశ్‌ కుమారుడు నిశాంత్‌ కుమార్‌ ఇప్పుడే జనతాదళ్‌(యునైటెడ్‌) పార్టీ సభ్యుడై ఎకాఎకిన ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్ట బోతున్నారు. అయితే ఆ పదవిలో వుండే ఇద్దరిలో ఒకరుగా మాత్రమేనని గుర్తుంచుకోవాలి. 2020, 2025 ఎన్నికల తర్వాత కేవలం తమ షరతులమీద నితీశ్‌ను కుర్చీలో కూచోనిచ్చిన బీజేపీ ఇక దిగిపోవాలని హుకుం చేయగానే ఆయన ‘జీహుజూర్‌’ అని తప్పుకోవడం అనివార్యమే. తనకేదో రాజ్యసభలోనూ వుండాలని కోర్కె వుంది గనక ఇష్టంతో వెళుతున్నానని, ఎవరి వత్తిడి లేదని నితీశ్‌ ప్రత్యేకంగా ప్రకటించడం కన్నా అందుకు వేరే నిదర్శనం అక్కర్లేదు. అదే నిజమైతే ఇంత హఠాత్తుగా నాటకీయంగా జరిగివుండేది కాదు.

రెండు పరివారాల మధ్య..
1975 ఎమర్జెన్సీకి ముందు బీహార్‌లో జరిగిన విశాల ప్రజాస్వామిక ఉద్యమం నుంచి పుట్టిన ఇద్దరు కీలకనేతలు లాలూయాదవ్‌, నితీశ్‌కుమార్‌ల ఆటుపోట్లలో దేశ రాజకీయాల మదనం కనిపిస్తుంది. బీజేపీది సంఘ పరివార్‌ అయితే వారిది జనతా పరివార్‌ అనొచ్చు. మండల్‌ కమిషన్‌ నేపథ్యంలో బీసీ వర్గాల సామాజిక సమీకరణల ఇందుకు నేపథ్యమైంది. మతతత్వ రాజకీయాలే ఈ రెండు పరివార్‌ల మధ్య ఒక తేడా అనుకుంటే లాలూ లౌకిక రాజకీయాలకు కట్టుబడ్డారు. పశుగ్రాసం కుంభకోణంతో సహా వున్నాయి గాని ఈ విషయంలో పక్కకు పోలేదు. యూపీలో ములాయం సింగ్‌ యాదవ్‌ కూడా మధ్యలో వూగిస లాటలున్నా బీజేపీతో కలవలేదు. ఇందుకు పూర్తి భిన్నం నితీశ్‌ కుమార్‌ ప్రయాణం, అది కూడా మరీ అడ్డగోలు వ్యవహారం. మోడీని ప్రధాని అభ్యర్థిగానే ఆంగీరించబోనని 2014లో బీరాలు పలికి కూటములు మార్చి పదవి కాపాడుకున్న నితీశ్‌ తర్వాత 2017లో ప్లేటు ఫిరాయించి వుండకపోతే బీహార్‌లోనే గాక దేశంలో కూడా రాజకీయాలు మరోలా వుండేవేమో. 2022లోనూ ఆయన ఇదే పునరా వృతం చేశారు. అందుకే ఆయనను పల్టుబాబు అని ముద్దుపేరు వచ్చింది. ఈ విషయంలో తనతో పోటీ పడగలిగింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ ఇద్దరు నాయకులు మనుగడ కోసం బీజేపీని మోయకపోతే 2024లోనూ మోడీ మూడోసారి ప్రధాని కాగలిగేవారు కాదనవచ్చు. అరదుకు తగినట్టు వారేమైనా పట్టు పెంచుకోగలిగారా?అంటే కనిపించని ఒత్తిడితో మోడీ వారిని ఆడిస్తూనే వస్తున్నారు.

పరివార్‌ పద్మవ్యూహం
అనివార్య అవసరాలకోసం ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని తర్వాత వాటిని చప్పరించడం బీజేపీ వ్యూహమని ఇప్పుడందరికీ తెలిసిపోయింది. వాజ్‌పేయి హయాంలో మమతా సమతా లలిత అని టిఎంసి, అన్నాడిఎంకె, సమతాపార్టీలు ఆడిస్తూనే వుండేవి. మొదటి రెండుసార్లు మెజార్టీ బీజేపీకి వుంది గనక పోనీ అనుకున్నా వీరిపై ఆధారపడిన 2024లో కూడా అదే జరుగుతుందంటే చాలా కారణాలు ఒత్తిళ్లు వున్నాయనేది స్పష్టం. ప్రాంతీయ పాలక పార్టీల అవకాశవాదమే బీజేపీ విస్తరణకు ప్రాబల్యం పెరగడానికి ప్రధాన కారణం. కానీ, మోడీ హయాంలో త్రిశూల వ్యూహాల దెబ్బ దాన్ని మరింత జటిలం చేసింది. దేశంలో నలుమూలలా ఈ ఫార్ములాతోనే బీజేపీ కాలూనడమే గాక వేళ్లు తన్నుకోగలిగింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ నేతలే బాస్‌లన్నది మొదటి అవగాహన. కానీ, 2019 నుంచి ఇది మారిపోయింది. శివసేనను చీల్చి ఏక్‌నాథ్‌ షిండేతో జతకట్టడం దీనికి మొదలనుకుంటే అజిత్‌పవార్‌ను చీల్చి శరద్‌పవార్‌ ఎన్‌సిపిని నిర్వీర్యం చేయడం కూడా ఇందులో భాగమే. అస్సాం గణపరిషత్‌(ఎజిపి) విషయంలోనూ అదే జరిగింది. నెమ్మదిగా కాంగ్రెస్‌నుంచి హిమంత బిస్వాశర్మను తీసుకుని పట్టం కట్టింది. బెంగాల్‌లో వామపక్ష ప్రంట్‌ను ఎదుర్కొవడానికి మమతాబెనర్జీ టిఎంసిని పెంచి పోషించి నెమ్మదిగా తన బలం పెంచుకుంది. తమిళనాడులో జయలలిత అనారోగ్యం ఆసరాగా తీసుకుని అన్నా డిఎంకెను గుప్పిట్లోకి తెచ్చుకోగలిగింది. కర్నాటకలో జనతాదళ్‌ (సెక్యులర్‌) అని పేరు పెట్టుకున్న మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు కుమారస్వామి గౌడనూ ఇలాగే చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో మెహబూబా మఫ్తీ పిడిపితోనూ జట్టుకట్టి దెబ్బకొట్టింది. అక్కడ కూడా కాంగ్రెస్‌ నుంచి గులాంనబీ ఆజాద్‌ను దూరం చేసింది. మధ్యప్రదేశ్‌లో సింధియాలను కలిపేసుకుంది. ఈశాన్యాన చాలా ప్రాంతీయ పార్టీలను లేదా నేతలను కలిపేసుకుని తన పట్టు పెంచుకుంది. ఇందుకు ఆయా పార్టీల నేతల అవకాశవాదం ముఖ్య కారణమైతే కేంద్ర వ్యవస్థలను దుర్వినియోగం చేసి, కులమత రాజకీయాలను రెచ్చగొట్టిన బీజేపీ పరివార్‌ పాత్ర కూడా అంతే కారణం.

వ్యవస్థల ప్రయోగం
దేశంలో కార్పొరేట్‌ శక్తులు,అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడివర్గాలు, వారి గుప్పిట్లోని బడా మీడియా ఇవన్నీ ఇందుకు తోడవుతుంటాయి. ఈ ఫలితాలను ప్రభావితం చేసే సర్‌ ప్రక్రియలూ, ఇవిఎంల ఓట్ల శాతాల తారుమారు కూడా వివాదగ్రస్తమవుతున్నాయి.ఇక రాజ్యాంగ వ్యవస్థలైన ఎన్నికల సంఘాన్ని న్యాయవ్యవస్థనూ కూడా కేంద్రం దుర్వినియోగం చేస్తున్నది. ఇటీవలనే సుప్రీంకోర్టు తమపై అవినీతి పాఠం పెట్టారని ఆగ్రహావేదనలు వెలిబుచ్చడం చూశాం, ఇడి, సిబిఐ, ఐటిల ప్రయోగం నిరతరాయంగా సాగుతూనే వుంది. ముఖ్యమంత్రుల పిఎల మీద, కార్యదర్శుల మీద, సచివాలయాల మీద ఆకస్మిక దాడులు నడుస్తుంటాయి. గతంలో ఇందిరాగాంధీ తమ ముఖ్యమం త్రులను మార్చాలంటే వారిపై నిఘా నివేదికలు తెప్పించి చూపేవారని అనేవారు. మోడీ సర్కారు ప్రతిపక్ష ముఖ్య మంత్రులపై దాన్ని ఆయుధంగా మార్చేసింది. అంతేగాక మత రాజకీయాల మంటలు కూడా అవకాశవాద పార్టీలపై ప్రయోగిస్తుంటుంది. ఇవన్నీ కలిసినందునే నీతిబాహ్య నేతలు పార్టీలూ చేతులెత్తేసి చెట్టపట్టాలు కడుతుంటారు. నితీశ్‌కుమార్‌ పదేపదే మోడీకి పాదాబివం దనం చేయబోవడం, చంద్రబాబు నాయుడు కూడా సాష్టాంగ పడటం ఇలాంటివే. వాస్తవానికి వీటివెనక చాలా రాజకీయముంది. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా బీజేపీపై నిప్పులు కక్కిన దశనుంచి హఠాత్తుగా మౌనమూనడం చూస్తున్నదే. మత రాజకీయాల పట్ల వీరందరి ఉపేక్ష, ఎవరు అధికారంలో వున్నా అదానీ వంటి వారి వ్యాపార లావాదేవీలు షరామామూలుగా సాగిపోవడం యాదృచ్చికం కాదు. ఆఖరుకు ఫెడరలిజంపై ప్రత్యక్ష దాడి జరుగుతున్నా పెదవీ మెదపటేని నిస్సహాయ స్థితికి ఈ ప్రాంతీయ పార్టీలు చేరుకున్నాయి. అనవసరంగా నమో భజనలో మునిగితేలుతున్నాయి. భావజాల పరంగా డిఎంకె ఒక్కటే ఈ దశలో గట్టిగా నిలబడుతున్నది. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చేతులు కలపడమే గాక ఏపీలోనూ మోడీ మోత మోగించడం, సనాతన రాగాలు ఆలపించడం ఆందోళనకరంగా సాగుతున్నది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వున్నా బీజేపీ మత రాజకీయాలపై పోరాట కేంద్రీకరణ తగినంతగా వుండటం లేదు. బీహార్‌తో సహా దేశమంతటా కూడా కాంగ్రెస్‌ ఈ విషయంలో సమగ్రమైన సహేతుక విధానం రూపొందించుకోవలసే వుంది.

చంద్రబాబు కూడా కేంద్రానికా?
నితీశ్‌కుమార్‌ బీహార్‌ నుంచి నిష్క్రమించి ఢిల్లీ బయలుదేరే వేళ ఏపీలోనూ ఇలాంటి చర్చలు వినిపిం చడంలో వింతేమీ లేదు. కూటమి ముఖ్యమంత్రిగా నారాలోకేశ్‌ పగ్గాలు చేపడతారని చంద్రబాబు కూడా ఢిల్లీ వెళతారని జోరుగా ప్రచారం నడుస్తున్నది. టీడీపీ వర్గాలు దీన్ని ఖండించకపోగా మరిన్ని ప్రచారాలు జోడిస్తున్నాయి. 2027లో ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీ విరమణ చేసే నాటికి చంద్రబాబు అందుబాటులో వుంటారనీ, ఆ పదవి గానీ, ఉపరాష్ట్రపతి లేదా ఉపప్రధాని పదవి గానీ చేపడతారని ఆశపెట్టుకున్నాయి. నిజంగా బీజేపీ, సంఘ పరివార్‌లు రాజ్యాంగ పరంగా కీలకమైన పదవులను ఇతరులతో పంచుకుంటాయని ఎవరూ అనుకోరు. మోడీకి నచ్చని వెంకయ్యనాయుడునే కొనసాగించని వారు మరోపార్టీకి చెందిన చంద్రబాబును తీసుకుంటారని అనుకోవడం అవాస్తవికతే. అయితే హోంమంత్రి అమిత్‌షా, ప్రధాని మోడీ లోకేశ్‌ వంటివారితో బలమైన సంబంధాలు పాటిస్తున్నమాట నిజం. అమిత్‌షా కుమారుడు జైషాతోనూ మంచి స్నేహం, బీజేపీ అధ్యక్ష్ష పదవినే నితిన్‌ నబీన్‌కు అప్పగించినట్టే ప్రతిచోటా బాగా విధేయులైన ప్రాంతీయ యువనేతలను పెంచుకోవాలనీ, సీనియర్లను సాగనం పాలనీ వారి విధానం. 2025లో ప్రమాణస్వీకారం చేసిన నితీష్‌ను నాలుగు మాసాల్లో తప్పించడం సదరు వ్యూహాల ఫలితమే. వీలైతే ఆ పార్టీలను కలిపేసుకోవడానికి కూడా వారు ప్రయత్నిస్తారని గతంలో పవన్‌కళ్యాణ్‌ స్వయంగా చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. అక్కడదాకా వస్తే అధికారం కోసం అమాంతం కలిపేయడానికి లేదా కలసిపోవడానికి కూడా అనేకమంది సిద్ధంగా వుంటారని చెప్పనక్కరలేదు. నితీశ్‌ నిష్క్రమణ సంకేతాలు మలిఘట్టం రాబోయే శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత మరింతగా స్పష్టమవుతుంది.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -