Sunday, March 8, 2026
E-PAPER
Homeచౌరస్తాషేక్‌ హ్యాండ్‌!!

షేక్‌ హ్యాండ్‌!!

- Advertisement -

పన్నెండు గంటలు కొట్టిన గడియారం, ఇక మళ్లీ పన్నెండు గంటల దాకా ఇన్ని సార్లు కొట్టే అవస్త తప్పింది అనుకుంది. దీపాలు మలిపేశారు. ఇంక నాలుక చాచినా తిండానికి ఏమీ చిక్కదు అని నిద్ర మొదలుపెట్టింది గోడ మీది బల్లి. అడవిలో క్రూరమృగాలు అప్పుడప్పుడు అరుస్తుంటే స్మశానంలో నక్కలు అదే పనిగా అరుస్తున్నాయి. ఇళ్లల్లో మనుషుల గురక చప్పుళ్లు వింటున్నాయి గోడలు.. గోడలు!
గోడలంటే గోడలు కావవి కోట గోడలు. గోడల వెనుక మేడలున్నాయి. మేడల్లో విలాస మందిరాలున్నాయి. మందిరాల్లో పడక గదులున్నాయి. గదుల్లో హంసతూలికా తల్పాలున్నాయి. ఒక గదిలో తాగాల్సినవి తాగి, తినాల్సినవి తిని, ఊగినంతసేపు ఊగి మంచం మీద అటూ ఇటూ దొర్లి, దొర్లే ఓపిక ఖర్చయిపోయాక, నిద్రలోకి జారుకున్నాడు రాజు. పేరేదయితేనేం రాజు ఎవడైనా రాజే కద!
రాజయితేనేం మీసాలూ, పొగరూ ఉన్నోడయితేనేం నిద్ర ముంచుకువచ్చిందంటే ఆపలేడు కదా. రాజు ముక్కులోకి గాలి పోతున్న జాడ తెలీడంలేదు కానీ బయటకు వస్తున్నప్పుడు మాత్రం చప్పుడు చేస్తున్నది. గడియారం ‘ఉస్‌… ఒకటే కదా కొట్టేస్తే పోలా’ అంటూ హుషారుగా కొట్టేసింది ఒకటి!
ఒకటి కొట్టిన గడియారం చప్పుడుతో పాటు మరొక శబ్దం వినిపించింది రాజుకి. గదిలో మరెవరో మెసలుతున్నట్టు అనిపించింది. రాజు శరీరం కొంచెం కదిలింది. కళ్లు మాత్రం రాజు మాట వినాలనుకోలేదు. అందుకే తెరుచుకోలేదు. కాసేపు నిశ్శబ్దం గదిలో పచారు చేసింది. ఎవరో దాన్ని లాగిపెట్టి తన్నినట్టున్నారు. ఈసారి మళ్లీ శబ్దం రెచ్చిపోయింది!
రెచ్చిపోయిన శబ్దానికి రాజు ఉలిక్కిపడ్డాడు. ఉలిక్కిపడ్డరాజు చటుక్కున లేచి దిండుకి వీపు ఆనించి కూచున్నాడు. తెర్చుకున్న కళ్లు చీకట్లో చీకటిని తప్ప ఏమీ చూడలేకపోయాయి. చూడలేకపోయినా మెదడు సంకేతాలు జారీ చేసింది. ఎవడు? ఎవడయినా గదిలోకి చొరబడ్డాడా? అంత ఎత్తు కోట గోడలు, అడుగడుగునా పహారాదార్లు వుండే ఈ చోటికి ఎవడు రాగలడు? దొంగోడా?!
దొంగోడే! దొంగోడనగా నేనే! అన్న మాటలు రాజు చెవి పక్కనే వినిపించాయి. బిత్తరపోయాడు రాజు. రాజునన్న విషయం క్షణకాలం మరచిపోయి మామూలు మనిషిలా భయపడ్డాడు. ఆ తర్వాత తను రాజునన్న విషయం గుర్తుకువచ్చి హుంకరించాడు. ఎవడ్రా నువ్వు? ప్రాణాలమీద ఆశ వదులుకుని వచ్చావా? రాజ్యానికి రాజునిరా నేను! సింహం జూలు పట్టుకున్నావురా! పులి నోట్లో చేయి దూర్చావురా అన్నాడు రాజు, చీకట్లో వేళ్ల కొసలతో మీసాలు వెతుక్కుంటూ, దొరికిన మీసం చివరని తిప్పుకుంటూ!
తిప్పుకోవడానికి నీకే కాదు నాకూ వున్నాయి మీసాలు. ఎవడ్రా అన్నావు కదా. చెప్తా చెప్తా… నేనే దొంగోడిని. ప్రాణాల సంగతి వదిలెయ్యి. తెగిస్తేనే కదా దొంగోడినయ్యాను. సైనికులూ, అంగరక్షకులూ ఎవరూ లేరిక్కడ. అంచేత నువ్విప్పుడు సింహానివి కాదు, పులివి అంతకంటే కాదు. ఖజానా తాళం చెవులు ఇచ్చేస్తే, ఈ మంచానికి నిన్ను కట్టేసి నా పని నేను చేసుకుపోతా అన్నాడు చీకట్లో కనిపించకుండా వినిపిస్తున్నోడు!
కనిపించని దొంగోడి మీద పిచ్చికోపం వచ్చింది రాజుకి. చిర్రెత్తింది. సైనికుల్ని పిలవడానికి గంట వాయిద్దామని చేత్తో తడిమాడు. అది తగల్లేదు. గంటెక్కడ్రా అని అరిచాడు. వృత్తిలో ఆరితేరిన వాణ్ణి కదా… గంట వుండదు, కత్తులూ కనపడవు. మర్యాదగా తాళం చెవులు ఈయకపోతే రేపొద్దున ప్రజలకి నువ్వూ కనపడవు. తీ.. తాళాల గుత్తి తీరు! అన్నాడు దొంగోడు.
అనగానే ఇచ్చేస్తానేంటి? ఖజానా అంటే ఏంటనుకున్నావు. అందతా ప్రజల సొమ్ము. దాని మీద నాకూ అధికారం లేదు. దాన్ని ఎత్తుకుపోవడం నీకు న్యాయం కాదు అన్నాడు రాజు, రాజునన్న విషయాన్ని పక్కకు నెట్టి చిన్నగా, మెత్తగా, ఉపాయాలు తెల్సిన నక్కగా!
నక్కలూ రాజులూ ఒకటేనంటుండేవాడు మా అయ్య. నిజమే! ఎత్తులు మొదలు పెట్టావు కదా. ఏమన్నావేమన్నావు? ప్రజల సొమ్మా? అది పాపపు సొమ్ము! నువ్వు, నీ తండ్రి, నీ తాత ప్రజల్ని హింసించి, ఏడ్పించి, చావగొట్టి చెవులు మూసి పన్నుల రూపంలో, జరిమానాల పేరుతో జమ చేసుకున్న సొమ్ము. ఇళ్లు నేలమట్టం చేసి, భూములు బలవంతంగా లాక్కుని భోంచేసిన సొమ్ము. ప్రజల సొమ్మనడానికి నోరెలా వచ్చింది. అది నిజంగా ప్రజల సొమ్మే కాని నువ్వు అనుభవించడానికి తేరగా వచ్చిన సొమ్ము కదా!
దొంగోడి మాటల్ని మధ్యలోనే తుంచుతూ, పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్ముతోనే కద ప్రజల సంక్షేమం చూసుకునేది. ప్రజల సేవ కోసమే కదా, ప్రజల సౌకర్యం కోసమే కదా ఖజానాలో సొమ్ము కూడబెట్టేది. ఈ ప్రజలకోసం నా తాత ముత్తాతలు నామీద పెట్టిన భారాన్ని మోస్తున్నాను అన్నాడు రాజు.
భారాన్ని నువ్వు కాదు, ప్రజలు మోస్తున్నారు నీ విలాస జీవితాన్ని. నువ్వు ఆడే ఆటలకు, తిరిగే తిరుగుళ్లకు చేసే పర్యటనలకు, అయినవాళ్లకు అందించే బహుమతులకు సరిపడా సొమ్ముకోసం ప్రజలు చెమటోడుస్తారు. తమ తమ జీవనభారాన్ని మోయలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. అబద్దాల కోటలో హాయిగా పడుకున్న నువ్వు రాజువి. చీకట్లో అన్ని రకాల రిస్కులు నాకు. నేను దొంగని. నిజానికి నువ్వూ దొంగవే. రాజులందరూ దొంగలే. పేరు మాత్రమే తేడా. మన గమ్యం ఒక్కటే కాని దారులే వేరు అన్నాడు దొంగోడు.
తను ఇరుక్కుపోయాననుకున్నాడు రాజు. ‘కాంప్రమైజ్‌’ అవడం తప్పదనుకున్నాడు. మనమొక అండర్‌స్టాండింగ్‌కి వద్దాం. నా పని నేను చేస్తా, నీ పని నువ్వు చేసుకుపో. నా మనుషులు నీకు అడ్డురారు. నువ్వు నా ఖజానావైపు చూడకు అన్నాడు రాజు. అయితే ఓకే అంటూ రాజావారి వేలి వుంగరం ఊడలాక్కుంటూ అన్నాడు దొంగ… ఇది నాకు లైసెన్స్‌ అన్నమాట. అప్పుడప్పుడూ నువ్వు దోచుకున్న సొమ్ములో కొంత నాకు ముట్టచెప్పాలి సుమా. ప్రజా సంక్షేమ పథకాలకు అవసరం అన్నాడు రాజు. రాజూ దొంగా షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్నారు.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -