ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది. ఆమె ఉదయం లేస్తే ఇల్లు లేస్తుంది. కుటుంబం సజావుగా నడుస్తుంది. కానీ ఆమె ఆరోగ్యం గురించి మనం ఎన్నిసార్లు ఆలోచిస్తాం? చాలా మంది మహిళలు ‘బాగానే ఉన్నాను’ అంటారు. కానీ దేశ గణాంకాలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5, 2019-21) ప్రకారం 15-49 ఏళ్ల మహిళల్లో 57 శాతం రక్తహీనతతో ఉన్నారు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి పైగా. అదే నివేదిక ప్రకారం సుమారు 24 శాతం మహిళలు అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉన్నారు. దాదాపు 21 శాతం మహిళలకు రక్తపోటు ఉంది. ICMR-INDIAB (2023) నివేదిక ప్రకారం దేశంలో 10 కోట్లకు పైగా పెద్దల్లో డయాబెటిస్ ఉంది. ఇందులో మహిళల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. పట్టణ యువతిలో 10-20 శాతం వరకు పీసీఓఎస్ లక్షణాలు ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఈ గణాంకాలు చిన్నవి కావు. ఇవి మహిళల ఆరోగ్యంలో పెరుగుతున్న ఒత్తిడిని చూపిస్తున్నాయి.
బాధ్యతలు ఎక్కువ, విశ్రాంతి తక్కువ
Time Use Survey (2019) ప్రకారం మహిళలు రోజుకు సగటున దాదాపు 5 గంటలు వేతనం లేని ఇంటి పనులకు కేటాయిస్తున్నారు. పురుషులు దాని కంటే చాలా తక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ఇంటి పని, పిల్లల సంరక్షణ, వద్ధుల బాధ్యతలు… ఇవన్నీ మహిళల భుజాలపై ఉంటాయి. ఉద్యోగం ఉంటే మరింత భారం.
ఈ పరిస్థితిలో భోజనం సరిగా చేయడం, నిద్రపోవడం, వ్యాయామం చేయడం కష్టమవుతుంది. ఆరోగ్య పరీక్షలు వాయిదా పడతాయి. చిన్న లక్షణాలు పెద్ద సమస్యలుగా మారేవరకు పట్టించుకోరు.
రక్తహీనత ఎందుకు అధికంగా ఉంది?
మహిళలకు ప్రతి నెల నెలసరి వల్ల రక్తనష్టం జరుగుతుంది. గర్భధారణలో ఐరన్ అవసరం మరింత పెరుగుతుంది. కానీ ఆకుకూరలు, పప్పులు, ప్రోటీన్ తక్కువగా తీసుకుంటే రక్తహీనత తప్పదు. రక్తహీనత వల్ల అలసట, పని శక్తి తగ్గిపోవడం, తలనొప్పి వస్తాయి. గర్భిణీల్లో ఇది ప్రమాదాన్ని పెంచుతుంది.
బరువు పెరగడం, దాని ప్రభావం
శారీరక చలనం తగ్గడం, ఒత్తిడి, నిద్రలేమి, ప్రాసెస్ చేసిన ఆహారం వినియోగం పెరగడం వల్ల బరువు పెరుగుతోంది. బరువు పెరగడం వల్ల డయాబెటిస్, రక్తపోటు, గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుంది. గర్భధారణ సమయంలో షుగర్ వచ్చిన మహిళలకు తర్వాత జీవితంలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
రక్తపోటు, గుండె ఆరోగ్యం
రక్తపోటు చాలాసార్లు లక్షణాలు లేకుండా ఉంటుంది. క్రమమైన పరీక్షలు లేకపోతే ఆలస్యంగా గుర్తిస్తారు. మెనోపాజ్ తర్వాత ఎస్ట్రోజెన్ తగ్గిపోవడం వల్ల గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
పీసీఓఎస్… యువతిలో హెచ్చరిక
నిద్రలేమి, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం యువతిలో హార్మోన్ అసమతుల్యతకు దారి తీస్తున్నాయి. నెలసరి అసమానత, బరువు పెరగడం, మొటిమలు ఉంటే దాన్ని చిన్న విషయం అనుకోవద్దు.
మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం
World Health Organization నివేదికల ప్రకారం మహిళల్లో డిప్రెషన్ రేటు పురుషుల కంటే ఎక్కువ. National Mental Health Survey ప్రకారం మహిళల్లో మానసిక ఒత్తిడి గణనీయంగా ఉంది. కుటుంబ బాధ్యతలు, భావోద్వేగ భారం, తన సమస్యలు చెప్పుకోలేకపోవడం కారణాలు. నిద్రలేమి, చిరాకు, నిరాశ… ఇవి కూడా ఆరోగ్య సమస్యలే. దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంపై ప్రభావం చూపి బీపీ, షుగర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
మెనోపాజ్ దశ
మెనోపాజ్ సమయంలో ఎముకల బలం తగ్గుతుంది. భారతదేశంలో మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఆస్టియోపోరోసిస్ గణనీయంగా ఉంది. కాల్షియం తక్కువైతే జారిపడినప్పుడు చిన్నదెబ్బకి కూడా ఎముక విరగవచ్చు.
అవసరమైన మార్పులు
క్రమమైన రక్తపోటు, షుగర్ పరీక్షలు అవసరం. ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక అలవాటు చేయాలి. సరైన నిద్ర తప్పనిసరి. మానసిక ఒత్తిడి ఉంటే మాట్లాడాలి. ఇంటి బాధ్యతలు పంచుకోవాలి.
మహిళ ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధ కుటుంబ ఆరోగ్యానికి పెట్టే పెట్టుబడి.
డా|| యం. రమాదేవి
ప్రొఫెసర్ డ హెడ్, ఫిజియాలజీ
గాంధీ మెడికల్ కాలేజ్



