Sunday, March 8, 2026
E-PAPER
Homeసోపతివివక్ష, జాత్యహంకారం నీడన మానవ జీవితాన్ని చర్చించిన చిత్రం

వివక్ష, జాత్యహంకారం నీడన మానవ జీవితాన్ని చర్చించిన చిత్రం

- Advertisement -

ఈ ప్రపంచంలో మనిషి స్వభావం, చుట్టూ ఉన్న సామాజిక వాతావరణ ప్రభావంతో రూపు దిద్దికుంటుంది. స్వతహాగా మనుషులంతా మంచివారే. కాని ఒకరి పట్ల మరొకరిలో కనిపించే అపనమ్మకం, కోపం, అసహనం, వివక్ష, వెనుక వారు పొందిన జీవితానుభవాలుంటాయి. చాలా సందర్భాలలో వారి ఆలోచనలకు విరుద్దంగా వారికే తెలియని, అర్ధంకాని క్రూరత్వంలోకి వారిని ఆ అనుభవాలే నెట్టేస్తాయి. ముఖ్యంగా సమాజంలో శతాబ్దాలుగా పేరుకుపోయిన జాతి, కుల, లింగ వివక్ష, మనుషుల చర్యలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. వీటికి అతీతంగా జీవితాలను రూపుదిద్దుకోవడం మనుషులకు ఇంచుమించు అసాధ్యం. ఎంత జాగరూకత వహించినా ఈ వివక్ష కారణంగా ఒకరిపై ఒకరికి పుట్టుకొచ్చే అనుమానం, అపనమ్మకం, అభద్రతాభావం మనుషులను విడదీస్తూనే ఉంటాయి. వారి జీవితాలను గందరగోళపరుస్తూనే ఉంటాయి. ఈ నిజాన్ని పరిచయం చేస్తూ నైతికంగా మనిషిని పతనం చేసే ఆ భయాల ప్రభావం పట్ల జాగరూకత వహించవలసిన అవసరాన్ని చర్చించే సినిమా 2004లో వచ్చిన ‘క్రాష్‌’.

‘క్రాష్‌’ చిత్రానికి పాల్‌ హాగిస్‌ దర్శకత్వం వహించారు. అంతకుముందు ‘మిలియన్‌ డాలర్‌ బేబీ’ స్క్రీన్‌ప్లేకు ఆయన అకాడమీ అవార్డు అందుకున్నారు. 1991 ఫిబ్రవరిలో ‘ది సైలెన్స్‌ ఆఫ్‌ ది లాంబ్స్‌’ ప్రీమియర్‌ నుండి ఇంటికి కారులో వెళుతుండగా ఇద్దరు ఆఫ్రికన్‌-అమెరికన్లు ఈయన కారును దొంగిలించారు. ఆ సంఘటన అమెరికా ప్రజానికంలోని జాత్యహంకార ప్రవత్తి పట్ల ఆయనలో ఆలోచనలను రేకెత్తించింది. అదే ఈ సినిమా స్క్రిప్ట్‌గా రూపుద్దిద్దుకుంది. తాను జాత్యహంకారులను విమర్శించడానికే కాకుండా, యునైటెడ్‌ స్టేట్స్‌ వివక్ష లేని సమాజంగా మారిందనే ఆలోచనలో ఉన్న ఉదారవాదులను ఢకొీట్టడానికి క్రాష్‌ను రాశానని ఆయన పేర్కొన్నాడు. ఈ చిత్రానికి రాబర్ట్‌ మోరెస్కోతో కలిసి స్క్రీన్‌ప్లే రాసి దాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు హాగిస్‌. ఇందులో చాలా మంది పెద్ద నటులు కలిసి నటించారు.

‘క్రాష్‌’ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కొందరు దీన్ని గొప్పగా పొగిడితే, మరి కొందరు జాతి సంబంధాల చిత్రణ అంత సూక్ష్మంగా లేదని విమర్శించారు. అయినా ఇది ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఆరు అకాడమీ అవార్డు నామినేషన్లను అందుకుని, 78వ అకాడమీ అవార్డులలో ఉత్తమ చిత్రం, ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌లకు మూడు అవార్డులను గెలుచుకుంది. అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్స్టిట్యూట్‌, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రివ్యూ రెండింటి ద్వారా ఆ సంవత్సరం టాప్‌ 10 చిత్రాలలో ఒకటిగా ఎంపికైంది. ఇది తొమ్మిది బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డులకు కూడా నామినేట్‌ అయింది.
ఈ కథలో పాత్రలన్నీ యాదచ్చికంగా, అనుకోకుండా ఒకరినొకరు కలుస్తారు. ఒకరకంగా ఒకరితో మరొకరు ఢ కొంటారు. అందుకే ఈ సినిమా పేరు ‘క్రాష్‌’ అయింది. ఇతర సమూహాల పట్ల పక్షపాతం, ఆగ్రహం ఈ పాత్రలన్నీటిలో ప్రధానంగా కనిపించే విషయం. మరో జాతి వ్యక్తితో కలిసిన ప్రతి సారి తమ పూర్వ అనుభవాల ద్వారా ఒకరిపట్ల మరొకరిలోని అపనమ్మకం, అసహనం, ద్వేషం ప్రకటితమౌతూ ఉంటాయి. బాధితులు, బాధిస్తున్నవారందరూ సమాజంలో పీడితులుగానే కనిపిస్తారు చివరకు.

సినిమా ప్రారంభంలో లాస్‌ ఏంజిల్స్‌ డిటెక్టివ్‌ గ్రాహం వాటర్స్‌, తన భాగస్వామి రియాతో కలిసి ఓ కార్లో ప్రయాణిస్తూ ఉంతాడు. వీరి కారు కిమ్‌ లీ అనే ఓ కొరియన్‌ స్త్రీ కారుని ఢ కొంటుంది. రియా, కిమ్‌ లీలు ఘర్షణకు దిగుతారు. ఒకరి జాతిని మరొకరు విమర్శించుకోవడం తెలియకుండానే చేస్తారు. నిజానికి వాటర్స్‌ నల్లజాతీయుడు. రియా లాటినో. ఇద్దరూ ప్రేమికులే కాని కొన్ని సమయాలలో పరస్పర అసహనం, జాతి పర అనుమానం వీరిద్దరిలో కనిపిస్తూ ఉంటుంది. వాటర్స్‌ నేరస్థలానికి చేరుకుంటాడు, అక్కడ ఒక శవాన్ని చూస్తాడు.
సినిమా ఇప్పుడు 48 గంటల ముందుకు వెళ్తుంది. ఒక ఇరానీయన్‌ దుకాణదారుడి దుకాణం లూటి అవుతుంది. తనకు లాటిన్‌ అమెరికన్లతో భయం పొంచి ఉందని అనుమానించి అతను తన రక్షణ కోసం ఓ రివాల్వర్‌ కొనుక్కోవాలని కూతురితో ఓ దుకాణానికి వెళతాడు. అమెరికన్‌ అయిన రివాల్వర్‌ అమ్మే దుకాణదారుడు ఇతన్ని అరబ్‌ అని అవమానిస్తాడు. పైగా అతనో జిహాదీ అని బాహాటంగా విమర్శిస్తాడు. వాటిని కోపంతో ఎదుర్కొంటాడు ఆ ఇరాన్‌ దేశస్థుడు. వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగి చివరకు ఆ ఇరానియన్‌ కూతురు అందిన బులెట్లు కొనుక్కుని తండ్రితో అక్కడి నుంచి వెళ్లిపోతుంది

ఆంథోనీ, పీటర్‌ అనే ఇద్దరు నల్లజాతి యువకులు రోడ్డుపై నడుస్తూ ఉంతారు. ఆంథోని పతి ఒక్కరిలో తమ పట్ల కోపాన్ని ఆసహనాన్నే చూస్తాడు. ఇది నల్లవారి ప్రపంచం కాదని, ఇక్కడ తామేం చేసినా అందరూ అనుమానంగానే చూస్తారని ఆంథోని పీటర్‌కు బోదిస్తూ ఉంటాడు. ఆ ఇద్దరూ జిల్లా న్యాయవాది రిక్‌ కాబోట్‌, అతని భార్య జీన్‌లను బెదిరించి వారి కారు చోరీ చేస్తారు. ఆ దొంగలించిన కారులో పారిపోతూనే పీటర్‌ డాష్‌బోర్డ్‌పై సెయింట్‌ క్రిస్టోఫర్‌ బొమ్మను ఉంచుతాడు. వీరికి దారిలో శాన్‌ ఫెర్నాండో వ్యాలీ పార్కింగ్‌ స్థలంలో జరిగిన హత్యను దర్యాప్తు చేస్తున్న వాటర్స్‌, రియాలు కనిపిస్తారు. తెల్లజాతి అండర్‌ కవర్‌ పోలీసు డిటెక్టివ్‌ కాంక్లిన్‌, నల్లజాతి అండర్‌ కవర్‌ పోలీసు డిటెక్టివ్‌ లూయిస్‌ను కాల్చి చంపేస్తాడు. ఆ కేస్‌ను వాటర్స్‌ ఇన్వెస్టిగేట్‌ చేస్తూ ఉంటాడు.

కార్‌జాకింగ్‌ సంఘటన తన ఎన్నికలకు ప్రతిబంధకం కావచ్చని తాను నల్లజాతి ఓటును కోల్పోతానని ఎలక్షన్లలో నుంచోబోతున్న కాబోట్‌ భయపడతాడు. అతన్ని భార్య జీన్‌ ఇంటి తాళాలు మార్పిస్తూ ఉంటుంది. కారు దొంగలించినవారు ఇంటిపై దాడి చేస్తారన్నది ఆమె భయం. తాళాలు మార్చే పని డేనియల్‌ అనే ఓ మెక్సికన్‌ చేస్తూ ఉంటాడు. అతని జాతిని గుర్తుపట్టిన జీన్‌లో భయం పెరుగుతుంది. ఆమె దష్టిలో మెక్సికన్లు అందరూ గాంగ్‌స్టర్లే. అందుకని డేనియల్‌ మార్చిన ఆ కొత్త తాళాలను కూడా మళ్లీ మార్చవలసిందే అని భర్తతో గొడవ పెట్టుకుంటుంది. జేన్‌. ఇదంతా డేనియల్‌ వింటాడు. మౌనంగా అక్కడి నుండి తప్పుకుంటాడు.
కాబోట్‌ కారు కోసం పోలీసులు వెతుకుతుంటారు. సార్జెంట్‌ జాన్‌ ర్యాన్‌ ఈ వెతుకులాటను అడ్డుపెట్టుకుని ఒక నల్లజాతి జంట కారుని వెంబడిస్తాడు. ఆ కారు ధనవంతుడైన టీవీ డైరెక్టర్‌ కామెరాన్‌ థాయర్‌, అతని భార్య క్రిస్టీన్‌ లది. వారిని ఆపి, సోదా చేయాలని అంటూ క్రిస్టీన్‌ను బలవంతంగా కారు నుండి బైటకు లాగి, కామెరూన్‌ ముందే ఆమెను తగలకూడని చోట తాకుతూ, ఒత్తుతూ ఆమె ఒళ్ళంతా అసహ్యంగా నిమురుతూ ఆమెను లైంగికంగా వేధిస్తాడు. ర్యాన్‌తో పాటు కారులో ఉన్న అతని జూనియర్‌ టామ్‌ హాన్సెన్‌ ఇదంతా చూసి కోపంతో రగిలిపోతాడు. కాని జూనియర్‌ కావడంతో ర్యాన్‌ను ఎదిరించలేకపోతాడు. ఆ భార్యా భర్తలిద్దరూ మౌనంగా ఆ అవమానాన్ని దిగమింగుకుంటారు. హాన్సెన్‌, ర్యాన్‌ ప్రవర్తన గురించి లెఫ్టినెంట్‌ డిక్సన్‌కు చెప్తాడు. తాను అతనితో కలిసి పని చేయలేనని, తనను మరో చోటుకు బదిలీ చేయమని అభ్యర్థిస్తాడు. నల్లజాతి వ్యక్తి అయిన డిక్సన్‌, జాత్యహంకార ఫిర్యాదు కెరీర్‌ను దెబ్బతీస్తుందని హాన్సెన్‌తో చెబుతాడు. ర్యాన్‌ ప్రవర్తనపై మౌనం వహించమని చెప్తూ అతన్ని మరో ప్రాంతానికి బదిలీ చేస్తాడు.

ర్యాన్‌ అనారోగ్యంతో ఉన్న తన తండ్రితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తుంటాడు. అతని తండ్రి నల్లవారి కోసం ఓ ఫ్యాక్టరీ నడిపేవాడు. కాని దాన్ని వాళ్ల కారణంగానే మూసేయవలసి వస్తుంది. ఇది ఆ తండ్రీ కొడుకులిద్దరినీ మానసికంగా దెబ్బతీస్తుంది. తండ్రికి సరైన వైద్యం అందక డాక్టర్‌ అపాయింట్మెంట్‌ దొరకక తండ్రి పడే నరకం చూస్తూ ఆ కోపాన్ని ర్యాన్‌ తోటి నల్లజాతీయులపై చూపిస్తూ ఉంటాడు. తండ్రి డాక్టర్‌ అపాయింట్మెంట్‌ కోసం రోజూ ఫోన్‌లో మాట్లాడే నల్లజాతీయురాలిపై తన ఆగ్రహాన్ని అనాలోచితంగా ప్రకటిస్తూ ఉంటాడు.
ఆంథోనీ, పీటర్‌ కారు దొంగలించి వెళ్తూ అనుకోకుండా ఒక ఆసియా వ్యక్తిని ఢకొీడతారు. భయంతో వాళ్ళే అతన్ని ఆసుపత్రి దగ్గర పడేసి పోతారు. తాళాలు బాగు చేసే డేనియల్‌ కూతురు గతంలో తుపాకి కాల్పులను ఎదుర్కొంటుంది. ఆ భయం ఆమెను వెన్నాడుతూనే ఉంటుంది. బిడ్డను బాగు చేసుకోవడానికి డేనియల్‌ ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఒకసారి ఇతను ఇరానియన్‌ దుకాణంలో తలుపు బాగు చేయడానికి వెళతాడు. తాళం కాదు పూర్తి తలుపు మార్చాలని డేనియల్‌ చెప్తున్నది ఇరానియన్‌ అర్ధం చేసుకోడు. కోపంతో డేనియల్‌ని తిట్టడం మొదలెడతాడు. మెక్సికన్లు అందరు దొంగలన్నది అతని ఆభిప్రాయం. చేసిన పనికి డబ్బు తీసుకోకుండా మౌనంగా డేనియల్‌ అతని దుకాణం నుండి బైటకు వచ్చేస్తాడు. కాని అదే రోజు ఆ దుకాణాన్ని దొంగలు దోచుకుని అంతా విరగొట్టి వెళతారు. ఆ పని డేనియలే చేసాడని కోపంతో అతన్ని చంపడానికి అతని అడ్రస్‌ తెలుసుకుని వెళతాడు ఆ ఇరానియన్‌. అయితే డేనియల్‌ కూతురు తండ్రిని ఎవరో చంపబోతున్నారని చూసి పరుగెత్తుకుంటూ తండ్రి ముందుకు వస్తుంది. ఇరానియన్‌ గన్‌ నుండి వచ్చిన బులెట్‌ ఆమెకు తగుతులుతుంది. బిడ్డ చనిపోయిందనే అందరూ అనుకుంటారు. కాన్ని ఆ ఇరానియన్‌ రివాల్వర్‌లో ఉన్నవి నిజం తూటాలు కావు. కొనేటప్పుడు షాపతను కావాలని బొమ్మ తూటాలు వారికి ఇస్తాడు. బిడ్డ చనిపోనందుకు డేనియల్‌తో పాటు ఆ ఇరానియన్‌ కూడా సంతోషిస్తాడు.

డిటెక్టివ్‌ వాటర్స్‌ ఒంటరిగా ఉంటున్న తన తల్లిని చూడడానికి వెళతాడు. ఆమె తప్పిపోయిన తమ్ముడి అచూకి కనుక్కొమ్మని అతన్ని అడుగుతుంది. భర్త మీద కోపంతో కారు నడుపుతూ రాష్‌గా డ్రైవ్‌ చేస్తున్న క్రిస్టిన్‌ కారు ప్రమాదంలో చిక్కుకుంటుంది. తిరగబడిన కారులో క్రిస్టీన్‌ను ర్యాన్‌ చూసి ఆమెకు చేరుకోవాలనుకుంటాడు. అతన్ని గుర్తుపట్టి దగ్గరకు రావద్దని క్రిస్టిన్‌ అరుస్తుంది. కాని ఆమెకు నచ్చజెప్పి తన ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడతాడు ర్యాన్‌. ఒకప్పుడు పైశాచికంగా తన శరీరాన్ని తడిమి తడిమి అవమానించిన ఆ పోలీస్‌ ఇప్పుడు ప్రాణాలకు తెగించి తనను కాపాడడాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది క్రిస్టిన్‌.

వాటర్స్‌ను DA ఉద్యోగి ఫ్లానాగన్‌తో సమావేశానికి పిలుస్తారు. చనిపోయిన నల్లజాతి పోలీస్‌ లూయిస్‌ నిజానికి ఓ కేసులో దోషి అని, అతన్ని చంపడంలో తప్పు లేదని వాటర్స్‌ కొని సాక్షాలు సేకరిస్తాడు. కాని దాన్ని జాత్యాహంకార హత్యగా ప్రకటించమని దాని ద్వారా ఎలక్షన్లలో కామెరాన్‌ సానుభూతి ఓట్లు పొందగలడని చెప్తాడు ప్లానాగన్‌. బదులుగా వాటర్స్‌కు పదోన్నతి ఇచ్చి అతని సోదరుడి నేర చరిత్రను తొలగిస్తానని వాగ్దానం చేస్తాడు. ఒక పత్రికా సమావేశంలో, వాటర్స్‌ అయిష్టంగానే హత్య జాతిపరంగా ప్రేరేపించబడిందని ధవీకరిస్తాడు. మరో చోట కామెరాన్‌ ఓ సీరియల్‌కు దర్శకత్వం వహిస్తూ నల్లజాతి వ్యక్తులు తెలివిగా ఉండడం సహజంగా లేదని నమ్మే తోటి వారి సలహాను అయిష్టంగానే పాటించి జమాల్‌ అనే నటుడి పాత్రను మార్చడానికి ఒప్పుకుంటాడు. జాత్యాహంకారాన్ని నిర్దేసించే సామాజిక, రాజకీయ పరిస్థితులను ఈ రెండు సంఘటనలతో దర్శకులు చూపిస్తారు.

ఆంథోనీ, పీటర్‌ మరో కారు దొంగిలించాలనుకుని ఎదురుగా వస్తున్న కామెరాన్‌ కారుని అడ్డగిస్తారు. తాము దొంగలిస్తుంది ఓ నల్లవాని కారు అని తెలియక అతనితో కలబడతారు. అప్పటి దాకా తెల్ల దాష్టికాన్ని భరిస్తున్న కామరాన్‌ ఈ నల్లజాతీయులపై తన కోపాన్ని చూపుతాడు. ఆంతోనిని పట్టుకుని తన్నడమే కాకుండా వారి లాంటి వాళ్ళ వల్ల తమ జాతి అవమానాల పాలవుతుందని చెప్తాడు. పోలీసులు రావడంతో అక్కడి నుండి పీటర్‌ పారిపోతాడు. కామెరాన్‌, ఆంథోనీ కారులో వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంతారు. హాన్సెన్‌తో సహా ఇతర పోలీసులు వారిని వెంబడించి ఆపుతారు. హాన్సెన్‌ కామెరూన్‌ను గుర్తిస్తాడు. తన సీనియర్‌ ర్యాన్‌ ఆ భార్యా భర్తలను అవమానించింది అతనికి గుర్తుకు వస్తుంది. కామరాన్‌కు మద్దతుగా నిలబడి అతన్నితోటి పోలీసుల నుండి రక్షించి పంపించేస్తాడు హాన్సెన్‌. తన కారులో దాక్కున్న ఆంథోనీని కామెరూన్‌ బస్‌ స్టాప్‌లో దింపేస్తాడు. ఆ రాత్రి ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న పీటర్‌ను చూసి హాన్సెన్‌ తన కారులో అతనికి లిప్ట్‌ ఇస్తాడు. దారిలో పీటర్‌ తన జేబులోకి చేయి పెట్టి ఏదో తీయబోతున్నడని గమనించి అది తుపాకీ అయి ఉంటుందన్ని హాన్సెన్‌ భావించి అతనిని కాల్చివేస్తాడు. వాస్తవానికి తన జేబులో ఉన్న సెయింట్‌ విగ్రహం కోసం చేయి చాచుతున్న పీటర్‌ ఆశ్చర్యంగా టామ్‌ హాన్సెన్‌ ను చూస్తూనే ప్రాణాలు విడుస్తాడు. తప్పు తెలుసుకుని హాన్సెన్‌, పీటర్‌ మతదేహాన్ని దాచిపెట్టి, సాక్షాలు మాయం చేయాలని తన కారును కూడా తగలబెట్టేస్తాడు. అలా వాటర్స్‌, రియా సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ పడి ఉన్న మతదేహం వాటర్స్‌ సోదరుడు పీటర్‌ దని కనుక్కుంటారు. పీటర్‌ మరణవార్త విన్న వాటర్స్‌ తల్లి, తమ్ముడిని కాపాడలేదని అతన్ని తూలనాడుతుంది. అతనితో తన సంబంధాన్ని తెంచుకుంటుంది. జీన్‌ ఇంట్లో జారి పడిపోతంది. తనకు ఆ ఊరిలో తాను ఎప్పుడూ ద్వేషించే స్పానిష్‌ వంట మనిషి తప్ప మరెవరూ నిజంగా ప్రేమించలేదని ఆమె ఆ సంఘటనతో తెలుసుకుంటుంది.

ఆంథోనీ దారిలో మరో తెల్ల వ్యాన్‌ను దొంగలించి దాన్ని అమ్మడానికి తీసుకెళతాడు. అయితే ఆ వ్యాన్‌లో బంధించబడిన కంబోడియా వలసదారులుంటారు. ఆ వ్యాన్‌ సినిమాలో మొదటి సీన్‌లో కనిపించిన కొరియన్‌ స్త్రీ కిమ్‌లీ, ఆమె భర్తకు చెందినదని తెలుస్తుంది. కారు షాపు యజమాని ఆంథోనీకి అ వలసవాదులొకొక్కరికి వి500 ఇస్తానని వాళ్ళను తనకు అమ్మేయమని అంటాడు. కానీ ఆంథోనీ ఆ పని చేయలేకపోతాడు. వాళ్లను చైనాటౌన్‌కు తీసుకెళ్లి అక్కడ వదిలేస్తాడు ఆంథోని. ఆ దారిలో కొందరు గొడవ పడుతూ ఉంటారు. అందరూ వివిధ జాతుల వారు ఒకరినొకరు దూషించుకుంటూ ఉండగా సినిమా ముగుస్తుంది.
మనమందరం, వివిధ జాతులకు చెందినవారం. మనం ఎంత న్యాయంగా ఉండటానికి ప్రయత్నించినా ఎక్కడో ఒక చోట మన చుట్టూ ఉన్న విద్వేషం మనలోకి చేరి అది ప్రకటితమౌతూనే ఉంటుంది. ర్యాన్‌ మొదట చాలా కిరాతకంగా క్రిస్టీనాతో ప్రవర్తిస్తాడు. కాని అతను తండ్రికి అపారమైన సేవ చేసే ఓ కొడుకు కూడా. తండ్రి జీవితంలో జరిగిన సంఘటనలతో తనలో పెంచుకున్న జాత్యాహంకారాన్ని పక్కకు పెట్టి క్రిస్టీనా చావు బతుకుల్లో ఉన్నప్పుడు ప్రాణలకు తెగించి ఆమెను కాపాడతాడు. మరో పక్క టామ్‌ హాన్సెన్‌, ర్యాన్‌లోని జాత్యాహంకారాన్ని ద్వేషిస్తాడు. తాను మానవతావాదినని నమ్ముతాడు. కాని అతనే కారులో కూర్చున్న పీటర్‌ జేబులో దేనికోసమో వెతుకుతుంటే తనను కాల్చేస్తాడేమో అన్న అనుమానంతో అతన్ని చంపేస్తాడు. తరువాత ఆ హత్య గురించి తెలియకుండా సాక్షాలను మాయం చేసేస్తాడు. ఈ పాత్రలు ముందు కనిపించినప్పటి నుండి సినిమా చివరకు వచ్చేసరికి పూర్తి విరుద్దంగా ప్రవర్తిస్తారు. ఆ ఇద్దరు కూడా వారి వారి పరిస్థితుల ప్రభావం నుండి, చుట్టూ ఉన్న జాత్యాహంకార వాతావరణ ప్రభావం నుండి తప్పించుకోలేని అసహాయులే.

ఈ సినిమా విడుదలైన తర్వాతి సంవత్సరాలలో, ఎన్నో విమర్శలు, చర్చలు అమెరికాలో సామాజిక ఉద్యమాల గురించి కొనసాగుతున్న సాంస్కతిక సంభాషణలతోపాటు పెరిగాయి. 78వ అకాడమీ అవార్డులలో, క్రాష్‌ ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ అవార్డును గెలుచుకుంది. ఇది చాలా మందిని నిరాశకు గురి చేసింది కూడా. ఈ అవార్డును ప్రకటించిన తర్వాత, ప్రెజెంటర్‌ జాక్‌ నికల్సన్‌ కూడా తన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయాడు. ఎందుకంటే చాలామంది ‘బ్రోక్‌బ్యాక్‌ మౌంటైన్‌’కు ఈ అవార్డు వస్తుందని ఆశించారు. కాని అది గొప్ప చిత్రం అని ఎందరో చెప్పినా స్వలింగ సంపర్కం అనే కథావస్తువుతో ఉన్నందువల్ల దానికి ఆ అవార్డ్‌ లభించలేదని, మిగతా చిత్రాలు విద్వంసాన్ని కథావస్తువుగా తీసుకున్నాయని అందుకే వాటన్నిటికి కాదని మానవ నైతికతను చర్చించిందన్న ఒక్క కారణంతో ‘క్యాష్‌’ కు ఆ అవార్డు వచ్చించనే అపవాదు నేటికీ వినిపిస్తూ ఉంటుంది. 2015లో, ది హాలీవుడ్‌ రిపోర్టర్‌ వందలాది మంది అకాడమీ సభ్యులను పోల్‌ చేసి, గత వివాదాస్పద నిర్ణయాలపై తిరిగి ఓటు వేయమని కోరగా, 2005 ఉత్తమ చిత్ర విజేతగా ‘బ్రోక్‌బ్యాక్‌ మౌంటైన్‌’ క్రాష్‌ తో పాటుఇతర నామినీలను ఓడించింది.
ఏమైనా ఈ సినిమాకు చాలామంది అభిమానులున్నారు. పైగా ర్యాన్‌ పాత్రలో నటించిన మ్యాట్‌ డిల్లాన్‌, కామరాన్‌ పాత్రలో నటించిన టెర్రస్‌ హవార్డ్‌ లు విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నారు.

– పి.జ్యోతి,
98853 84740

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -