సూర్యుడు అస్తమించిన సాయంత్రం
ఆకాశం ఒక్క క్షణం ఎర్రగా మారింది
అది సంధ్యా రంగు కాదు, ఒక యుగం గుండె చప్పుడు.
మినార్లపై నెలకొన్న నిశ్శబ్దం విషాదం కాదు;
చరిత్ర తన శ్వాసను ఆపుకున్న వేళ.
ఎడారి గాలి మదువుగా వీయలేదు,
ఇనుప గర్జనలా దూసుకెళ్లింది;
ప్రతి ఇసుక రేణువు ఒక జ్ఞాపకపు అక్షరం, ఒక ప్రమాణపు కణం.
ఒక దేహం నేలకొరిగింది, కానీ నేల దిగులుపడలేదు;
రక్తం మట్టిలో కలిస్తే భూమి బలహీనపడదు
చరిత్రను మళ్లీ మొలకెత్తిస్తుంది.
పర్వతాలు సాక్షులయ్యాయి; నదులు గాథను వినిపించాయి
నాయకులు వస్తారు, వెళ్తారు; కానీ విశ్వాసం పర్వతాల కంటే గొప్పది.
వేకువ అజాన్ గగనాన్ని తాకింది
ఆ పిలుపు కన్నీటి స్వరం కాదు, ఉక్కు సంకల్పం.
ఒక దీపం ఆరిందని అనుకున్న క్షణంలోనే
వేల వెలుగులు ప్రసరించాయి;
ఒక స్వరం మూగబోయిందనుకున్నంతనే వేల గొంతులు గర్జించాయి.
కాలం కత్తిలా కోసినా ఆలోచనలు గాయపడవు;
మరణం తలుపు తట్టినా సిద్ధాంతం తలవంచదు.
పర్షియన్ ఆకాశం కింద ఎర్ర అర్ధచంద్రం మళ్లీ ఉదయిస్తుంది
అది రక్తపు రంగు కాదు, నిబద్ధత అరుణం.
యుగాలు దేహాలతో ముగియవు; విశ్వాసాలతో కొనసాగుతాయి.
చరిత్రలో నిజమైన నాయకులు మరణించరు –
వారు యుగాలుగా మారిపోతారు.
– యండి. ఉస్మాన్ ఖాన్, 9912580645
పర్షియన్ పర్వతాల వెనుక
- Advertisement -
- Advertisement -


