Sunday, March 8, 2026
E-PAPER
Homeకవితనిఘా నీడన శ్వాస

నిఘా నీడన శ్వాస

- Advertisement -

కలల కన్నీటిలో తడిచి
రక్తపు కథలు చెప్పలేక
ఉసూరుమంటున్న ఊపిరి
ఒక పక్షి తన గూడును కోల్పోయి
మరో వసతిని నిర్మించుకోవడానికి
ఎండు పుల్లలు కూడా దొరకక
ఇల్లు కట్టే ప్రయత్నమే మానుకున్నది
రక్తపు మరకలపై శాంతి ముసుగులు వేస్తూ
నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తున్న పాలకులారా!
మీరేనా రేపటి సూర్యోదయంలో
శాంతి రేఖల్ని చూద్దామనుకుంటున్నది!?
ఇదేమి చిత్రమో గానీ
ముక్కుపచ్చలారని చిన్నారులు సీతాకోకచిలుకలు, చందమామ
ఇల్లు, పక్షులు, స్కూల్‌ బస్సులు కాదు
తుపాకీ ఆకారాన్ని గీయటం నేర్చుకుంటున్నారు
రసాయనాల కత్తులు
చంటి బిడ్డల ఉచ్ఛ్వాస నిశ్వాసలపై నాట్యం చేస్తుంటే..
ఫిరంగుల మోతలతో
ఒక తల్లి గర్భంలోంచి పిండం
‘అమ్మ గర్భమే సురక్షితమని.. ఈ మారణహోమపు వెలుగులు చూడనని..’ లోపలికే ముడుచుకుపోతోంది
ఇప్పటిదాకా నన్ను కాపాడిన
సైనిక బూట్ల చప్పుడు
ఇప్పుడు నా కళ్ళలో బాంబులు దాచి
కాపలా కాస్తున్నాయి.
విచిత్రం ఏమిటంటే
నాపైనే నా శ్వాస నిఘా పెట్టింది.
యుద్ధాన్ని ఓడించాలంటే
ప్రేమ మంత్రం, శాంతి మంత్రమే శరణ్యం.
జీవం లేని జడపదార్ధంగా బతకడం కన్నా
మానవత్వానికి కొత్త నిర్వచనమై
జీవించడమే గొప్ప!
జీవనదులు కన్నీటి కాలువలై
రక్తపుటేరులతో కలిసి పారుతున్నాయి
పంచభూతాలు తాము నిర్మించిన జీవరాశిపై
‘బతుకు జీవుడా’ అని
నిశ్శబ్దంగా విలపిస్తున్నాయి.
– విల్సన్‌ రావు కొమ్మవరపు, 8985435515

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -