Sunday, March 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబంధగిరి నగరంలో మళ్లీ పోడు రగడ

బంధగిరి నగరంలో మళ్లీ పోడు రగడ

- Advertisement -

– ట్రెంచ్‌ పనులు ఆపిన గిరిజన రైతులు
– మాకు ఇదే జీవానాధారమని బాధితుల కన్నీరుమున్నీరు
– ఆధారాలు చూపించాలంటున్న అధికారులు
– చర్చలు జరిపిన సీపీఐ(ఎం), గిరిజన సంఘాల నేతలు
నవతెలంగాణ-పినపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బోటుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బంధగిరి నగరంలో పోడు భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం తెల్లవారుజామున అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పోడు భూముల్లో ట్రెంచ్‌ ఏర్పాట్లు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విషయం తెలిసిన వెంటనే పోడు రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ట్రెంచ్‌ పనులను ఆపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ తేజస్విని, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ అరుణ, బీట్‌ ఆఫీసర్లు సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేశారు. పోడు రైతులు తమ భూములను వదులుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తమకు వారం రోజుల సమయం ఇవ్వాలని, ఈలోగా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌ను కలసి తమ సమస్యను వివరించుకుంటామని అధికారులను వేడుకున్నారు. స్థానిక సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సురేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పోడు రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. రైతులు అధికారుల కాళ్లు పట్టుకుని తమ భూములు వదిలేయాలని వేడుకోవడం అక్కడ ఉన్న వారిని భావోద్వేగానికి గురిచేసింది. ఇదిలా ఉండగా అటవీ శాఖ అధికారులు పోడు రైతులు తమ భూములపై హక్కులు ఉన్నట్టు రాతపూర్వకంగా ఆధారాలు ఇవ్వాలని కోరారు. వారికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు నిమ్మల వెంకన్న, మండల కార్యదర్శి దుబ్బా గోవర్ధన్‌, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి మడివి రమేష్‌ మద్దతుగా నిలిచారు. పోడు రైతుల పక్షాన అటవీ శాఖ అధికారులతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం మంగళవారం వరకూ గిరిజన రైతులకు సమయం ఇస్తామని అధికారులు తెలిపారు. ఈలోగా తమకు సంబంధించిన సరైన ఆధారాలను లిఖితపూర్వకంగా అందజేయాలని కోరారు. లేదంటే మంగళవారం నుంచి మళ్లీ ట్రెంచ్‌ పనులు ప్రారంభిస్తామని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో గిరిజన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తమ భూములను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బంధగిరి నగరంలో పోడు భూముల సమస్య మళ్లీ ఉత్కంఠభరిత పరిస్థితులను సృష్టించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -