Sunday, March 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం99 రోజుల్లో లక్ష్యాలను చేరుకోవాలి

99 రోజుల్లో లక్ష్యాలను చేరుకోవాలి

- Advertisement -

హౌసింగ్‌ బోర్డు పరిధిలోని 5 వేల రిజిస్ట్రేషన్లను పూర్తి చేయాలి : పోర్టల్‌ ప్రారంభంలో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హౌసింగ్‌ బోర్డు పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఐదు వేల రిజిస్ట్రేషన్‌లను పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. 99 రోజుల్లో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలకు పారదర్శకంగా వేగవంతమైన సేవలను అందించడానికి తెలంగాణ హౌసింగ్‌ బోర్డు రూపొందించిన రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ను శనివారం సచివాలయంలో మంత్రి పొంగులేటి ప్రారంభించారు. అలాగే తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 99 రోజుల్లో హౌసింగ్‌ కార్పొరేషన్‌, హౌసింగ్‌ బోర్డ్‌ నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. హౌసింగ్‌ బోర్డ్‌ పరిధిలో ఇండ్లు, ఫ్లాట్లు, స్థలాలను వాయిదాల రూపంలో కొనుగోలు చేశారనీ, ఇందులో కొంతమంది అసలు మరికొంతమంది వడ్డీలు చెల్లించాలనీ, ఇంకొంతమంది వాయిదాల గడువు ముగిసిపోయిందని ఈ విధంగా దాదాపు ఐదు వేల మంది తమ ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అసలు, వడ్డీ, ప్రస్తుత మార్కెట్‌ ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయాలని సూచించారు. ఈ పోర్టల్‌ వల్ల ప్రజలు ఎవరూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండబోదనీ, పూర్తి సమాచారం పోర్టల్‌లోనే ఉంటుందని అన్నారు. కేటాయింపుదారులు వారి రిజిస్ట్రేషన్లు, చెల్లింపుల ధృవీకరణ, ఇతర లావాదేవీల పర్యవేక్షణను ఒకే వేదిక ద్వారా సులభంగా పూర్తి చేసుకోవచ్చని సూచించారు. డిజిటల్‌ విధానం వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, పౌరులకు సేవలు మరింత చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది హౌసింగ్‌ బోర్డు, అలాటీల మధ్య నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ నిబద్ధత అని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ బోర్డు ఎండీ వీపీ గౌతమ్‌, సీఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -