Sunday, March 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళల భద్రతకు చట్టాలే సరిపోవు

మహిళల భద్రతకు చట్టాలే సరిపోవు

- Advertisement -

ప్రతి పురుషుడు బ్రాండ్‌ అంబాసిడర్‌ కావాలి : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
జేఎన్టీయూహెచ్‌లో ”స్టాండ్‌ విత్‌ హర్‌” కార్యక్రమం
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ

మహిళల రక్షణకు కేవలం చట్టాలు చేయడం మాత్రమే సరిపోదనీ, సమాజంలోని ప్రతి పురుషుడు మహిళల భద్రతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ కావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జేఎన్టీయూహెచ్‌లో నిర్వహించిన ”స్టాండ్‌ విత్‌ హర్‌” కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలపడితేనే రాష్ట్రం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మహిళల స్వావలంబన కోసం ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తున్నదని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి విక్రయించేలా అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. మహిళల స్వేచ్ఛ, భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. మహిళలకు అవకాశాలు పెరిగితే సమాజం మరింత బలపడుతుందని అన్నారు. సోషల్‌ మీడియాను బాధ్యతా రహితంగా, అనైతికంగా ఉపయోగించడం వల్ల మహిళా భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళా భద్రతకు సంబంధించి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ బి. శివధర్‌ రెడ్డి రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ షికా గోయల్‌, మహిళా భద్రత విభాగం అండ్‌ షీ టీమ్స్‌ చీఫ్‌ చారు సిన్హా, జేఎన్టీయూహెచ్‌ వీసీ టి. కిషన్‌ కుమార్‌ రెడ్డి, విద్యా శాఖ డాక్టర్‌ యోగితా రాణా, డబ్ల్యూసీడీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, ఐఏఎస్‌ శ్రీజన, ముఖ్యమంత్రి మాజీ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఏడీజీపీ స్వాతి లక్రా, సైబరాబాద్‌ సీపీ ఎం. రమేష్‌, యునిసెఫ్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ చీఫ్‌, డాక్టర్‌ జెలాలెం టాఫెస్సే, నటుడు, ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ బ్రాండ్‌ అంబాసిడర్‌ సాయి ధరమ్‌ తేజ్‌, దివ్య, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -