Sunday, March 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫీజుల దోపిడీని అరికట్టాలి

ఫీజుల దోపిడీని అరికట్టాలి

- Advertisement -

ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కాలేజీల్లో ఫీజు పెంపును రద్దు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని ప్రయివేట్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ఫీజులను భారీగా పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని భారత విద్యార్ధి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ రజినీకాంత్‌, కార్యదర్శి టి నాగరాజు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ఫీజులను రూ.లక్షల వరకు పెంచడం విద్యను సామాన్య విద్యార్థులకు దూరం చేసే చర్య అని విమర్శించారు. ఇంజినీరింగ్‌లో అత్యధికంగా రూ.1.83 లక్షల వరకు ఫీజు నిర్ణయించడం, కొన్ని కళాశాలల్లో గతంతో పోలిస్తే రూ.45 వేల వరకు పెంచడం విద్యార్థులపై భారీగా ఆర్థిక భారం మోపే నిర్ణయమని తెలిపారు. ఇప్పటికే మధ్యతరగతి, పేద కుటుంబాల విద్యార్థులు ఉన్నత, సాంకేతిక, మెడికల్‌ విద్యను కొనసాగించడం కష్టంగా మారిన ఈనేపథ్యంలో ఈ నిర్ణయం వారి భవిష్యత్తుపై మరింత భారాన్ని మోపుతోందని పేర్కొన్నారు. విద్య హక్కుగా చేయాల్సింది పోయి వ్యాపారంగా మారుతున్నదన్నడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ అని తెలిపారు. విద్యను కార్పొరేట్‌ లాభాల సాధనంగా మార్చే విధానాలను ప్రభుత్వం ప్రోత్సహించడం ఆందోళనక రమని విమర్శించారు. ఒకవైపు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉండగా మరోవైపు కళాశాలలకు ఫీజులు పెంచేందుకు అనుమతి ఇవ్వడం పూర్తిగా విద్యార్థి వ్యతిరేక విధానమని తెలిపారు. ఈ ఫీజుల పెంపు నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో సముచితమైన, సామాన్యులకు అందుబాటులో ఉండే ఫీజు నిర్మాణాన్ని అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చే ఈ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను ఐక్యం చేసి పోరాటాలను నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -