నవతెలంగాణ – ఆలేరు టౌను
ఇచ్చిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, సీపీఐఎం.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి, ఆర్.జనార్ధన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన వంట గ్యాస్ సీలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ, ఆలేరు పట్టణంలో ఆదివారం రైల్వే గేట్ ఆవరణలో కట్టెలు పోయితో వంటచేస్తూ నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆర్ జనార్ధన్ మాట్లాడుతూ,ప్రజా సమస్యలను పరిష్కరించడానికి చేతగాని, బీ జే పీ మోడీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి, ప్రజలపై అదనపు ఆర్థిక భారాలను మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. బీ జే పీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో లెక్కలేనన్ని సార్లు పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ సిలిండర్ల ధరలను విపరీతంగా పెంచిందని,ధరలను పెంచే,ప్రజలను ముంచే ప్రభుత్వంగా బీ జే పీ పాలన ఉన్నదని ఎద్దేవా చేశారు.
బీ జే పీ మోడీ ప్రభుత్వానికి ప్రజల మీద కంటే బడా బడా సంపన్నుల మీద,ప్రజలను దోపిడీ చేసి సంపాదించిన కోట్లాది రూపాయల ఆదాయంను సమకూర్చుకున్న పెట్టుబడిదారుల మీదనే ప్రేమ ఎక్కువని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న కేంద్రంలోని బీ జే పీ ఎన్ డీ యే ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగట్టాలని అందుకు ప్రజలు పోరాటాలలోకి రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడాల బాల మల్లేష్, టంగుటూరు మాజీ సర్పంచ్ కట్టా సమరసింహారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు పిన్నపు రెడ్డి రాఘవ రెడ్డి,చిరబోయిన కొమురయ్య, కొమ్మిడి గోపాల్ రెడ్డి,తమ్మడి అంజయ్య,మారుజోడు కుమార్,గోధుమ కొమురయ్య,కడకంచి సత్తయ్య, ఇక్కిరి సంపత్, జాలపు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



