నవతెలంగాణ – నసురుల్లాబాద్
విద్యార్థులకు విజ్ఞానం అందించాల్సిన ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యం మరచి, పాఠశాలలోనే రక్తం వచ్చేదాకా కొట్టుకున్న ఘటన మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు శనివారం పాఠశాలలో వ్యక్తిగత కారణాలతో విద్యార్థుల ముందే బాహాబాహీకి దిగి కొట్టుకున్న విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మన్ దేవ్ పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నంద్యాల శ్రీనివాస్ (మ్యాథ్స్) తోటి ఉపాధ్యాయుడైన రామోజీ శ్రీనివాస్ (తెలుగు)తో వ్యక్తిగత కక్షల కారణంగా ఘర్షణకు దిగారని తెలిపారు. ఈ క్రమంలో నంద్యాల శ్రీనివాస్ కోపంతో కుర్చీతో రామోజీ శ్రీనివాస్ కొట్టే క్రమంలో కుర్చీ భూమికి తగిలి కుర్చీ ముక్క వచ్చి బలంగా రామోజీ శ్రీనివాస్ ముక్కువద్ద తగలడంతో ముక్కుకు గాయమైంది. దీంతో చికిత్స నిమిత్తం నసురుల్లాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది, మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే బాధిత ఉపాధ్యాయుడు పోలీస్ స్టేషన్ కు వెళ్తే.. యూనియన్ నాయకులు వచ్చి ఇరువురు రాజీకోసం ప్రయత్నాలు చేశారు.
గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ పాఠశాల నుంచి కొందరు ఉపాద్యాయులు సర్వే చేశారు. సర్వేకు సంబంధించిన ప్రత్యేక సెలవుల సంబంధించి ప్రొసీడింగ్స్ విషయంలో గొడవ జరిగింది. సర్వే చేసిన వారికి బిల్లులు చేయకుండా, ముగ్గురికి ఎలా బిల్లు చేస్తారని నిలదీయడంతో గొడవ మొదలైంది. నంద్యాల శ్రీనివాస్ పాఠశాల ప్రొసీడింగ్స్ ఎలా చూశావు అంటూ గొడవ పెట్టుకున్నాడని, ప్రత్యేక సెలవుల విషయంలో గొడవ గొడవకు దిగి తనను కొట్టారని ఇందులో ప్రధానోపాధ్యాయుడు ఆనంద్ తన పోన్ తీసుకొని, ఫిర్యాదు ఇవ్వకుండా అడ్డుకున్నాడని బాధితుడు తెలిపాడు.
విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన టీచర్లు పొట్టుపొట్టు కొట్టుకోవడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులకు విద్య బోధనతో పాటు క్రమశిక్షణ విజ్ఞానం అందించే ఉపాధ్యాయుల కొట్టుకోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాధితుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



