‘ఒక మహిళ తెల్లవారకముందే నిద్ర లేస్తుంది. కడుపులో ఆసరాకు ఏం ఉన్నాయో వెతుకుతుంది. పాలు ఉంటే టీ చేసుకుని తాగుతుంది లేకపోతే టీ పొడితో డికాక్షన్. కొంగుతో మూతి తుడుచుకుంటూనే గదిలో పడుకుని ఉన్న కోడలికి తలుపేసుకోమని చెప్పి బయలుదేరుతుంది. సూపర్వైజర్ కంటే ముందే కదన రంగంలోకి దూకాలి. తల ఎత్తి సూర్యుడిని చూడకుండానే పని చేసుకుంటూ పోతుంది. ఎండ నెత్తి మీదకు వచ్చేదాకా ఎవ్వరితోనూ మాట ముచ్చట ఉండదు. ఆ తర్వాత సిటీ బస్సు పట్టుకుని మున్సిపల్ ఆఫీసుకు చేరుకోవాలి. పని చేసినట్లు హాజరు నమోదు చేసుకోవాలి. సిటీ బస్సు అందుకుని ఇంటి దారి పట్టాలి. దారిలో ఏవైనా సరుకులు కొనుక్కుని వెళ్తుంది. వెళ్లేసరికి ఇంట్లో భోజనం ఉంటే సరే. లేకపోతే తనే వంటకు పూనుకుంటుంది. వంట ఎందుకు చేయలేదని కోడలిని అడగదు. పనికి ఎందుకు వెళ్లలేదని కొడుకును, భర్తను ప్రశ్నించదు. తనో యంత్రంలా పని చేస్తున్నా ఎవ్వరికీ చీమైనా కుట్టదేమని ఫిర్యాదు ఉండదు ఆమెకు.’
‘ఆమె ఆఫీసుకు రెడీ అవుతుంటుంది. ఆమెను డ్రాప్ చేడానికి భర్త రెడీ అవుతాడు. ఆమె హిజాబ్ చుట్టుకుంటుంది. భర్త బండి తీస్తాడు. ఆమె వేళకు ఆఫీసుకు చేరుకుంటుంది. ఎప్పటిలాగే సహోద్యుగులు ఆమెను ఏగాదిగా చూస్తారు. చెవులు కొరుక్కుంటారు. అవేమీ పట్టించుకోదు. తన పని తాను చేసుకుంటుంది. ఎప్పటిలాగే సాయంత్రం పికప్ చేసుకోవడానికి వస్తాడు భర్త. ఆమె ఇంటిముఖం పడుతుంది.’
పై రెండు కథల్లో భిన్న నేపథ్యాలున్న మహిళలు ఉన్నారు. వర్గాలు భిన్నమే, తరగతులు భిన్నమే. ఇద్దరు మహిళలు ఎవరిపైనా ఫిర్యాదు లేకుండా తమ పనిలో తాము నిమగమై ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు తమ గురించి చెవులు కొరుక్కుంటున్నారని తెలిసినా పట్టించుకోరు. తమకంటూ ఏర్పరచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి వారు తమకంటూ సష్టించుకున్న ప్రపంచానికి అనుగుణంగా నడుచుకుంటారు. వారిలో పని చేయగలమన్న ధీమా, బతుకుపట్ల భరోసా ముఖ్యంగా వారిపట్ల వారికి ఉన్న విశ్వాసం వారి వ్యక్తిత్వంగా నిలబడుతుంది. అలా నిలబెట్టిన రచయిత్రి జిలానీ బానో.
ఆమె కథా రచయిత్రిగా ఎంత గుర్తింపు పొందారో, సామాజిక స్పృహ కలిగిన మేధావిగా, స్త్రీవాద గొంతుకగానూ అంతే గుర్తింపు సాధించారు. నిజాం పాలనలోని హైదరాబాద్ సామాజిక పరిణామాలను, సామాన్యుల కష్టాలను, ముఖ్యంగా ముస్లిం మహిళల అంతరంగిక సంఘర్షణలను ఆమె తన కలంతో వెలికితీశారు.
నిత్య చైతన్య మూర్తి:
ఆధునిక ఉర్దూ సాహిత్యంలో ఆద్యులుగా వెలుగొందిన జిలానీ బానో నిత్య చైతన్య వాది. ఉర్దూ సాహిత్య దిగ్గజంగా నిలిచిన జిలానీ బానో 1936 జులై 14న ఉత్తర ప్రదేశ్ లోని ‘బదయూ’ ప్రాంతంలో జన్మించారు. తండ్రి హైరత్ బదాయూనీ ప్రసిద్ధ ఉర్దూ కవి. సాహిత్యమే ఊపిరిగా ఉన్న కుటుంబంలో పుట్టడం వల్ల ఆమెకు బాల్యం నుంచే అక్షరాలతో అనుబంధం ఏర్పడింది.
సాహిత్య ప్రస్థానం:
జిలానీ బానో తన ఎనిమిదవ ఏటనుంచే రాయడం ప్రారంభించారు. 1952లో ‘నయీ దునియా’ పత్రికలో ప్రచురితమైన ‘ఏక్ నజర్ ఇధర్ భీ’ (ఒక్కసారి ఇటు కూడా చూడండి) అనే కథతో ఆమె సాహిత్య రంగంలో గుర్తింపు పొందారు.
ఆమె కథలు మాస్కో నుండి మాడిసన్ వరకు పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆమెను కేవలం ఒక రచయిత్రిగా మాత్రమే కాదు. సంప్రదాయం, ఆధునికతల మధ్య అంతరాన్ని తగ్గించడానికి తన కలాన్ని ఉపయోగించిన సామాజిక రూపశిల్పిగానూ చెప్పుకోవచ్చు. చిన్న వయసులోనే ఆమె తన మొదటి కథతో ఆరంభించిన ప్రయాణం చివరిదాకా కొనసాగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీతగా, డాక్టర్ ఆఫ్ లిటరేచర్‌గా ఆమె సాధించిన విజయాల వరకు అలుపెరుగని ప్రయాణం ఆమెది. ఏడు దశాబ్దాల నిరంతర సజనాత్మక సంజీవని డాక్టర్ జిలానీ బానో. సరిహద్దులు లేని స్వరం ఆమె. జిలానీ బానో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
నవలలు, నాటకాలు, స్క్రీన్ ప్లేలను కవర్ చేసేలా 22 పుస్తకాలను రచించారు. ఆమె తాకిన ప్రతి మాధ్యమంపైనా ఎనలేని పట్టు సాధించారామె. ఐవాన్-ఎ-గజల్, బారిష్-ఎ-సంగ్ వంటి కళాఖండాలు ఉర్దూలో రూపొందించారు. వీటిని చదవడమే కాకుండా రష్యన్, జర్మన్, నార్వేజియన్ లతోపాటు దాదాపు ప్రతి ప్రధాన భారతీయ భాషలోకి అనువదితమయ్యాయి. జిలానీ బానో ఎంచుకున్న మానవ పోరాటం, గౌరవం అనే ఇతివత్తాలు సార్వత్రికమైనవని ఈ రచనలు నిరూపించాయి.
ఆమె కథల్లో పాత్రలు కేవలం ఊహాజనితం కాదు. మన పక్కింట్లోనో, ఎదురింట్లోనో కనిపించే వ్యక్తుల్లా ఉంటారు. ముఖ్యంగా ఆమె రాసిన ‘అమ్మ’ అనే కథ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది.
ఆమె కథలు చెబుతుంటే పిల్లలు వింటూ ఉండేవారట. సాధారణ భాషలో, అందరికీ అర్థమయ్యేలా కథ చెప్పడంలో జిలానీ బానో ఎంతో నైపుణ్యం సాధించారు. అదే ప్రావీణ్యతతో ఆమె రాసిన ‘నర్సయ్యాకీ బావ్డీ’ వెండితెరకు చేరుకుంది, ముఖ్యంగా దర్శకులు శ్యామ్ బెనెగల్ ఆ కథను ‘వెల్ డన్ అబ్బా’గా తెరపై సాక్షాత్కరింప చేసారు. జిలానీ బానో రాసిన కథనాలు మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా ఉంటాయి. జిలానీ బానో రాసిన ‘నర్స్’ అనే కథ ఆధారంగా శ్యామ్ బెనెగల్ ప్రసిద్ధ చిత్రం ‘జుబేదా’ రూపొందించారు. అలాగే ఆమె రాసిన మరికొన్ని కథలు టెలివిజన్ ధారావాహికలుగా వచ్చాయి. ఇది ఆమె రచనలకు ఉన్న దృశ్యరూప బలాన్ని నిరూపిస్తుంది.
బానోను ప్రత్యేకంగా నిలిపింది ఆమె ‘ప్రాథమిక’ ఆత్మ. ఆమె జీవితం గురించి రాయడమే కాదు దానిని మెరుగుపరచడానికి కూడాకృషి చేసింది. ASMITA వంటి NGOకు చైర్‌పర్సన్‌గా, ఆమె మహిళా సాధికారత, మానవ హక్కులకు బలీయమైన శక్తిగా నిలిచారు.
సాంస్కతిక చరిత్రకు ఆమె వ్యక్తిగత సహకారం హైదరాబాద్ ‘ఆత్మ’ను కాపాడటానికి ఆమె చేసిన కృషి కావచ్చు. సాధారణ ప్రజలు మాట్లాడే దకనీ ఉర్దూను 13 ఆడియో క్యాసెట్ల రూపంలో రికార్డ్ చేసారు. తన ఇంటి ప్రత్యేకతను, చరిత్రను ఎప్పటికీ నిలిపి ఉంచాలనే ఆలోచనతో ఈ ప్రయత్నం చేశారు.
సామాజికస్పృహ – అభ్యుదయ భావాలు:
జిలానీ బానో వ్యక్తిత్వంలో అత్యంత బలమైన అంశం. ఆమె సామాజిక స్పృహ. సమాజంలోని అణగారిన వర్గాలు, ముఖ్యంగా దళితులు, పేదలు, అట్టడుగు వర్గాల పట్ల ఆమెకు అపారమైన సానుభూతి ఉండేది. కేవలం సానుభూతి చూపడమే కాకుండా, వారి సమస్యలను తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ధైర్యవంతురాలు.
స్త్రీల పక్షపాతి:
ఆమె వ్యక్తిత్వంలో స్త్రీల పట్ల గౌరవం, వారి స్వేచ్ఛ పట్ల తపన స్పష్టంగా కనిపిస్తుంది. ముస్లిం మహిళలు ఎదుర్కొనే కష్టాలను, మధ్యతరగతి కుటుంబాల్లో స్త్రీల మానసిక సంఘర్షణలను ఎంతో సహజంగా చిత్రిస్తారు. మహిళలు చైతన్యం పొందాలని, తమ హక్కుల కోసం పోరాడాలని ఆమె ఆకాంక్షించేవారు.
హైదరాబాద్ సంస్కృతి ప్రతీక:
హైదరాబాద్‌కు చెందిన ఆమె వ్యక్తిత్వంలో ఇక్కడి గంగా-జమునా తహజీబ్ (హిందూ-ముస్లింల ఐక్య సంస్కతి) తొణకిసలాడుతూ ఉండేది.
నిరంతర అన్వేషి:
ఒక రచయిత్రిగా ఆమె ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి, మారుతున్న కాలానికి అనుగుణంగా తన ఆలోచనలను మార్చుకోవడానికి ఇష్టపడేవారు. ఆమె ఒక సంప్రదాయవాదిగా కాకుండా, ఆధునిక ఆలోచనలు గల వ్యక్తిగా నిలిచారు. ఆమె మరణించినా ఆమె వదిలి వెళ్లిన సాహితీ వారసత్వంలో తరాలుగా జీవించి ఉంటారు.
‘ఐవాన్-ఎ-గజల్’ (నవల) గురించి:
ఇది ఆమె మాస్టర్ పీస్ అని చెప్పవచ్చు. ‘ఐవాన్-ఎ-గజల్’ అత్యంత ప్రసిద్ధి చెందిన నవల. ఈ నవల కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఇది హైదరాబాద్ చరిత్రకు, సంస్కృతికి నిలువుటద్దం. ఈ నవల ప్రధానంగా హైదరాబాద్ నగర నేపథ్యంలో సాగుతుంది. నిజాం పాలన కాలం నుండి స్వాతంత్య్రం వచ్చే వరకు, ఆ తర్వాత జరిగిన సామాజిక మార్పులను ఈ నవలలో అద్భుతంగా చిత్రించారు. ఇది ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబానికి చెందిన మూడు తరాల కథను వివరిస్తుంది.
దీనిని ఉర్దూ సాహిత్యంలో ఒక ‘క్లాసిక్’గా పరిగణిస్తారు. ఈ నవల ద్వారా ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీనిని అనేక భాషల్లోకి అనువదించారు.
హైదరాబాద్‌లోని గంగా-జమునా తహజీబ్ (హిందూ-ముస్లింల ఐక్య సంస్కృతి), ఇక్కడి భాష, వేషభాషలు, పద్ధతులను ఈ నవలలో చూడవచ్చు. ఆ కాలంలోని ఉర్దూ కవిత్వం, సాహిత్యం పట్ల ప్రజలకున్న మక్కువను జిలానీ బానో ఎంతో అందంగా వర్ణించారు.
స్త్రీల పాత్రలు – స్వేచ్ఛ
జిలానీ బానో ఈ నవలలో స్త్రీల ఆలోచనా ధోరణిని చాలా లోతుగా విశ్లేషించారు. పాత కాలపు కట్టుబాట్ల మధ్య నలిగిపోయే మహిళలు ఒకవైపు ఉంటే, తమ హక్కుల కోసం, చదువు కోసం పోరాడే ఆధునిక మహిళల పాత్రలు మరోవైపు కనిపిస్తాయి. వారి మానసిక వేదనను, ఆశలను అద్భుతంగా చిత్రీకరించారు.
గౌరవాలు – పురస్కారాలు
సాహిత్య రంగానికి ఆమె చేసిన సేవలకు గాను అనేక గౌరవాలు దక్కాయి. – భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం (2001). బ గాలిబ్ అవార్డు.- సాహిత్య అకాడమీ అవార్డు. – హర్యానా ఉర్దూ అకాడమీ నుండి ‘హాలి అవార్డుస.- మఖ్దూమ్ అవార్డు తెలంగాణ/హైదరాబాద్ సాహిత్య రంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపు.- సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు వంటి అంతర్జాతీయ గౌరవాలు కూడా ఆమెను వరించాయి.
నస్రీన్ ఖాన్
9652432981



