ఫైనల్లో లిన్ చున్ చేతిలో ఓటమి
ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్స్
బర్మింగ్‌హామ్ (ఇంగ్లాండ్) : ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్, ఒలింపియన్ లక్ష్యసేన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. 2022లో టైటిల్‌కు అడుగు దూరంలో ఆగిపోయిన లక్ష్యసేన్.. 2026లోనూ రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో చైనీస్ తైపీ షట్లర్ లిన్ చున్ చేతిలో లక్ష్యసేన్ వరుస గేముల్లో ఓటమి చెందాడు. 15-21, 22-20తో లిన్ చున్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 57 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో లక్ష్యసేన్ ఆశించిన ప్రదర్శన కనబరచలేదు. తొలి గేమ్‌లో లక్ష్యసేన్ లయ అందుకోలేదు. లక్ష్యసేన్ ఇబ్బంది పడుతుండగా లిన్ చున్ అలవోకగా తొలి గేమ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేసిన లక్ష్యసేన్.. లిన్ చున్ తప్పిదాలు చేసేలా ఉసిగొల్పాడు. 3-4 నుంచి వరుసగా ఆరు పాయింట్లు సాధించిన లక్ష్యసేన్ 9-4తో ముందంజ వేశాడు. కానీ లిన్ చున్ వేగంగా పుంజుకున్నాడు. టైబ్రేకర్‌కు దారితీసిన రెండో సెట్‌ను 22-20తో సొంతం చేసుకున్న లిన్ చున్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో హాంగ్ వీ, నికోలె (చైనీస్ తైపీ) జోడీ విజేతగా నిలువగా.. మహిళల డబుల్స్‌లో షెంగ్, టాన్ నింగ్ (చైనా) జంట టైటిల్ ఎగరేసుకుపోయింది.
మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నం.1 అన్సె యంగ్ (దక్షిణ కొరియా)పై వరల్డ్ నం.2 వాంగ్ జి యి (చైనా) 21-15, 21-19తో వరుస గేముల్లో గెలుపొంది టైటిల్ సాధించింది. ఆల్ ఇంగ్లాండ్‌లో ఆడేందుకు వెళ్తూ పశ్చిమాసియాలో యుద్దజ్వాలల కారణంగా తెలుగు తేజం పి.వి సింధు దుబారు చిక్కుకుని, అక్కడ్నుంచి స్వదేశం చేరుకున్న సంగతి తెలిసిందే.
లక్ష్యసేన్ రన్నరప్
- Advertisement -
- Advertisement -



