స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చర్చ
విప్ జారీ చేసిన అధికార, ప్రతిపక్షాలు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
నేటి నుంచి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న పార్లమెం ట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగనున్నాయి. ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్న ఈ సమావేశాలు పండుగలు, సెల వుల కారణంగా కేవలం 17 రోజులు మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది. ఎజెండాలోని మొదటి అంశంగా లోకసభ స్పీకర్‌పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం సహా కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎంపీలందరూ సభా కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశిస్తూ బీజేపీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం 11వ తేదీ వరకు సభకు హాజరు కావాలని ఎంపీలకు ఇప్పటికే విప్ జారీ చేసింది. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా విప్ జారీ చేశాయి. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం, పశ్చిమాసియా దేశాల్లో దాడులు, ఇతర అంశాలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్‌తో పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. అయితే… వెస్ట్ బెంగాల్‌లో అంతర్జాతీయ సంతల్ కాన్‌క్లేవ్ విషయంలో రాష్ట్రపతి ముర్ముకు జరిగిన అవమానం, ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతల అర్థనగ ప్రదర్శన, ఇతర అంశాలపై విపక్షాలు టార్గెట్‌గా ఎన్డీఏ కూటమి వ్యూహాలు అమలు చేయనుంది.
ఓం బిర్లాకు క్యాబినెట్ మంత్రుల స్థానాన్ని కేటాయించే ఛాన్స్
స్పీకర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అధ్యక్షత వహించే అవకాశం ఉండదు. డిప్యూటీ స్పీకర్ లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్ కమిటీలోని సీనియర్ మోస్ట్ ఎంపీ సభను నడిపిస్తారు. అయితే ప్రస్తుతం కమిటీలో సీనియర్ మోస్ట్‌గా ఉన్న ఎంపీ జగదాంబికా పాల్ చర్చకు అధ్యక్షత వహించవచ్చని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. అయితే లోక్‌సభ నిబంధనల ప్రకారం స్పీకర్ బిర్లా సభకు హాజరు కావచ్చు. ఇందుకోసం ఆయనకు కేబినెట్ మంత్రుల్లోని ఒక సీటును నిర్ధేశిస్తారని తెలిపారు.
గతంలో మూడుసార్లు లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం
భారత పార్లమెంట్ చరిత్రలో మూడుసార్లు లోక్‌సభ స్పీకర్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినట్టు రికార్డులు చెబుతున్నాయి. 1954లో ఆనాటి తొలి స్పీకర్ బీవీ మావలంకర్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. అనంతరం 1966లో హుకుం సింగ్, చివరగా 1987 ఏప్రిల్ 17లో అప్పటి స్పీకర్ బలరాం జాఖర్ పై తీర్మానాలు ప్రవేశపెట్టారు. కానీ ఈ మూడు సందర్భాల్లో స్పీకర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గలేదు. దీంతో వారు స్పీకర్లుగా కొనసాగారు. అయితే, స్పీకర్ ఓం బిర్లా విషయంలోనూ ఇదే కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకుంటే ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలకు గానూ ఎన్డీఏ కూటమికి 335, ఇండియా బ్లాక్ 230 ఎంపిల సంఖ్యాబలంతో ఉన్నాయి. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(సీ) ప్రకారం స్పీకర్‌ను తొలగించేందుకు కావాల్సిన సంఖ్యాబలం ఇండియా బ్లాక్ వద్ద లేదనే చెప్పాలి. తాజాగా 2024లో ఆనాటి రాజ్యసభ చైర్మెన్ (ఉపరాష్ట్రపతి) జగదీప్ దన్‌ఖర్‌పై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టింది. 2024 డిసెంబర్ 10న దన్‌ఖర్ తొలగింపు నోటీసుపై కనీసం 60 మంది ప్రతిపక్ష సభ్యులు సంతకం చేశారు. అయితే, డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ ఈ తీర్మానాన్ని తోసిపుచ్చారు. ఇది చాలా లోపభూయిష్టమైన చర్య అని, ఉప రాష్ట్రపతి ప్రతిష్టను దెబ్బతీసేందుకు రూపొందించిన అనుచిత చర్యగా అన్నారు.
చర్చలో మా వాదన వినిపిస్తాం… : ప్రతిపక్షాలు
స్పీకర్‌పై ప్రవేశపెట్టే తీర్మానం వీగిపోయినా, ఈ తీర్మానంపై జరిగే చర్చలో తమ వాదనలు స్పష్టంగా వినిపించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం జరిగింది. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో తమ అభిప్రాయాలను చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి స్వల్పకాలిక చర్చ నిర్వహించేందుకు పట్టుబట్టాలని నిర్ణయించారు. కేంద్రం కేవలం ప్రకటన చేస్తే సరిపోదని, దీనిపై లోతైన చర్చ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతానికి పశ్చిమాసియాలోని పలు దేశాల్లో సుమారు ఒక కోటి మంది భారతీయులు పని చేస్తున్నారని, వారి భద్రత, జీవనోపాధిపై ఈ సంక్షోభం ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్రో ప్రియేషన్స్ బిల్, ఫైనాన్స్ బిల్ వంటి ముఖ్యమైన శాసన బిల్లులు చర్చించాలని డిమాండ్ చేస్తోంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితి, ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం, రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురు విషయంలో అమెరికా ఒత్తిడి వంటి కీలకాంశాలు చర్చించేందుకు పట్టుబట్టనున్నట్టు సమాచారం.
నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- Advertisement -
- Advertisement -


