Monday, March 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకువైట్‌పై ఇరాన్‌ దాడులు

కువైట్‌పై ఇరాన్‌ దాడులు

- Advertisement -

అగ్నికీలల్లో భారీ టవర్‌
కువైట్‌:
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు ఇరాన్‌పై భీకరంగా విరుచుకుపడు తున్నాయి. ఇరాన్‌ సైతం ఇజ్రాయిల్‌తో పాటు గల్ఫ్‌ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. శనివారం రాత్రి ఇరాన్‌ మరోసారి తమపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్టు కువైట్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దాడుల్లో పలువురు ప్రజలు తీవ్రంగా గాయపడగా.. అనేక భవనాలు దెబ్బతిన్నా యని తెలిపింది. డ్రోన్ల శకలాలు పడడంతో నగరంలోని సోషల్‌ సెక్యూరిటీ టవర్‌కు మంటలు అంటుకున్నట్టు వెల్లడించింది. దానిలో అనేకమంది ప్రజలు చిక్కుకున్నారని.. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. దాడులు కొనసాగుతున్నందున సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలని కువైట్‌ సైన్యం ప్రజలకు సూచించింది. మరోవైపు ఆ దేశ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన ఇంధన ట్యాంకులు, పలు ప్రభుత్వ భవనాలకు అంటుకున్న మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకు వచ్చినట్టు అగ్నిమాపక దళం పేర్కొంది. సౌదీ అరేబియా, ఖతార్‌లలోనూ దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్‌ దేశాలపై దాడులు చేస్తున్నందుకు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ.. టెహ్రాన్‌ ఆయా దేశాలపై దాడులు కొనసాగిస్తుండడం గమనార్హం.
ఇజ్రాయిల్‌ హెచ్చరికలు
మరోవైపు ఇరాన్‌కు మద్దతిస్తున్న హిజ్బొల్లా నేతలే లక్ష్యంగా దాడులు చేపట్టినట్టు ఇజ్రాయిల్‌ ప్రకటించింది. బీరుట్‌లోని హిజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నందు వల్ల ఆ ప్రాంతాన్ని వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని స్థానిక ప్రజలను హెచ్చరించింది. సెంట్రల్‌ బీరుట్‌లోని ఓ హోటల్‌పై ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -