– ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని అమలు చేయాలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉన్నత విద్యలో నూతన విద్యావిధానం (ఎన్ఈపీ-2020) అమలు పేరుతో విద్యను వ్యాపారం చేయొద్దనీ, వాణిజ్యీకరణ దిశగా నెట్టొద్దని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ప్రజా విద్యారంగాన్ని బలోపేతం చేసే ప్రత్యామ్నాయ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజినీకాంత్, కార్యదర్శి టి నాగరాజు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎన్ఈపీ అమలు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయడం ఆందోళనకరమని తెలిపారు. విద్యా వ్యవస్థను సమానత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం అనే విలువలపై నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కానీ ఎన్ఈపీ-2020 మాత్రం విద్యను కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే ప్రమాదకర మార్గాన్ని సూచిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విద్యావిధానం కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం అమలుకు పూనుకోవడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. ఎన్ఈపీ-2020 అమలు పేరుతో మల్టిపుల్ ఎంట్రీ-ఎగ్జిట్, నాలుగేండ్ల డిగ్రీ, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ వంటి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థుల విద్యా ప్రయాణాన్ని అస్థిరంగా మార్చే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు. మధ్యలో ఎగ్జిట్ అనే పేరుతో విద్యార్థులను బయటకు నెట్టే విధానమే ఇందులో దాగి ఉందని తెలిపారు. పేద, గ్రామీణ, అట్టడుగు వర్గాల విద్యార్థులు ఆర్థిక ఒత్తిడితో చదువు మధ్యలో వదిలేయాల్సిన పరిస్థితులు మరింత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ విధానం విద్యార్థులకు అవకాశాలను పెంచేలా కాకుండా అసమానతలను పెంచేలా పనిచేస్తుందని తెలిపారు. పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ హాస్టళ్లను, మెస్ సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు. ప్రతి విద్యార్థికీ విద్య హక్కు అనే భావనతో సమాన అవకాశాలను కల్పించాలని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ఈపీ అమలు చేయడానికి ముందు విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, ప్రజా సంస్థలతో విస్తృత చర్చలు జరపడం అవసరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య చర్చలు లేకుండా విద్యా విధానాలను బలవంతంగా రుద్దడం హానికరమని తెలిపారు. ఎన్ఈపి అమలైతే అణగారిన వర్గాలు విద్యకు దూరమై ఫీజులు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రజాపాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయొద్దని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఈపీ-2020 అమలు ప్రక్రియను తక్షణమే నిలిపేసి ప్రజా విద్యను బలోపేతం చేసే ప్రత్యామ్నాయ విధానంపై చర్చలు ప్రారంభించాలని కోరారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను ఐక్యం చేసి ఉద్యమాలను నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఎన్ఈపీ అమలుతో విద్యను వ్యాపారం చేయొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



