Tuesday, March 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆదర్శ గ్రామ నిర్మాణ శిల్పి కూసం రాజమౌళి కన్నుమూత

ఆదర్శ గ్రామ నిర్మాణ శిల్పి కూసం రాజమౌళి కన్నుమూత

- Advertisement -

– గుండెపోటుతో మృతి
– మూడు పర్యాయాలు గంగదేవిపల్లి సర్పంచ్‌గా సేవలు
– గంగదేవిపల్లికి ప్రత్యేక స్థానం తెచ్చిన కమ్యూనిస్టు నేత
నవతెలంగాణ-గీసుగొండ

వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లి గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన కమ్యూనిస్టు నేత, మాజీ సర్పంచ్‌ కూసం రాజమౌళి(74) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి గ్రామ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచింది. గ్రామాభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
రాజలింగం-లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం కాగా, అందులో రాజమౌళి చిన్నవాడు. చిన్ననాటి నుంచే ప్రజాసేవా భావంతో ముందుకు సాగిన ఆయన సీపీఐ(ఎం) ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం 1982లో ఎంసీపీఐలో చేరి ఓంకార్‌ నాయకత్వంలో పనిచేశారు. గ్రామ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన ఆయన మూడు పర్యాయాలు సర్పంచ్‌గా, ఉపసర్పంచ్‌గా సేవలందించారు. ఒక సంవత్సరం కుసం లలితను సర్పంచ్‌గా చేసి గ్రామాభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించారు. అలాగే, ఎనిమిది సంవత్సరాల పాటు ఊకల్‌ సహకార సంఘానికి సేవలందించారు. ఆయన నాయకత్వంలో గంగదేవిపల్లి గ్రామం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. పరిశుభ్రత, తాగునీటి నిర్వహణ, చెట్ల పెంపకం, సంపూర్ణ మద్యనిషేధం, విద్యాభివృద్ధి వంటి అంశాలలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అభివృద్ధి చేశారు. 99 దేశాల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు గంగదేవిపల్లి గ్రామ అభివృద్ధి నమూనాను అధ్యయనం చేయడానికి రావడం ఆయన చేసిన కృషికి నిదర్శనం. గంగదేవిపల్లి అభివృద్ధిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రశంసించారు. ‘మన్‌ కీ బాత్‌” కార్యక్రమంలో ఈ గ్రామాన్ని ప్రస్తావిస్తూ గ్రామాభివృద్ధి నమూనాగా పేర్కొన్నారు. అలాగే, ఢిల్లీలో జరిగిన సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన ప్రారంభ కార్యక్రమానికి గంగదేవిపల్లి ప్రతినిధులతో పాటు రాజమౌళిని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఆయన సేవలకు దక్కిన గొప్ప గౌరవం. కాగా, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. గీసుగొండ తహసీల్దార్‌ ఎండీ రియాజుద్దీన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయాన్నిసోమవారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమై.. 3గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -