Tuesday, March 10, 2026
E-PAPER
Homeక్రైమ్ముగ్గురు కుమార్తెలను హత్య చేసిన తండ్రి అరెస్ట్‌

ముగ్గురు కుమార్తెలను హత్య చేసిన తండ్రి అరెస్ట్‌

- Advertisement -

– చెడు అలవాట్లతో ఆర్థిక ఇబ్బందులు
– కుటుంబ పోషణ భారం కావడంతో చిన్నారుల హత్య
– వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్యరెడ్డి
నవతెలంగాణ-కామారెడ్డి

ఆటో నడుపుతూ కుటుంబాన్ని సాకిన ఆ తండ్రి చెడు అలవాట్ల వైపు మళ్లడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు.. ఈ క్రమంలో కుటుంబ పోషణ భారంగా మారడంతో చివరకు కన్న పిల్లలనే చంపేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు నటించాడు. ముగ్గురు కుమార్తెలను హత్యచేసిన కర్కష తండ్రిని కామారెడ్డి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసును సంబంధించిన వివరాలను ఏఎస్పీ చైతన్యరెడ్డి వెల్లడించారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ఇస్మాయిల్‌ రాజ్‌షేక్‌ భార్య షబీన బేగం ఈ నెల 6న ఉదయం 11 గంటల నుంచి తన ముగ్గురు కుమార్తెలు కనిపించడం లేదని పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల తండ్రి ఇస్మాయిల్‌ రాజ్‌షేక్‌ ప్రవర్తనపై అనుమానం కలగడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌ అయిన ఇస్మాయిల్‌ చెడు అలవాట్ల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. కుటుంబ పోషణ భారంగా భావించి ముగ్గురు కుమార్తెలను హతమార్చాలని పథకం వేసుకున్నాడు. 6న ఉదయం పిల్లలకు స్నాక్స్‌ కొనిస్తానని చెప్పి ఆటోలో కామారెడ్డిలోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కొంతసేపు పిల్లలతో గడిపిన తర్వాత ఎవరూ లేని సమయంలో ఒక్కొక్కరిగా సిఫత్‌ బేగమ్‌(8), అయ్యద్‌(6), మరియమ్‌(5)ను చెరువులోకి నెట్టేశాడు. వారు మునిగిపోయాక అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఇంటికి వెళ్లి ఏమీ తెలియనట్టు ఉన్నాడు. పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో చివరకు నేరాన్ని ఒప్పుకున్నాడు. పిల్లల ఆధార్‌ కార్డులను చెరువు వద్ద రాళ్ల మధ్య పడేసినట్టు తెలిపాడు. అనంతరం పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన కామారెడ్డి టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ నరహరి, రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ రామన్‌, పోలీస్‌ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్టు ఏఎస్పీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -