అవకాశమిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు : డ్వాక్రా మహిళల ‘హెల్త్ ప్రొఫైలింగ్’ ప్రారంభంలో మంత్రులు దామోదర, సీతక్క
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పోర్టల్ ఆవిష్కరణ
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళలకు అవకాశమిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారని రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఒక మహిళ చదువుకుంటే ఒక తరం ముందుకు వెళుతుందన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడమే నిజమైన సమాజాభివృద్ధి అని చెప్పారు. ఆదివారం హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆదివాసీ భవన్‌లో ఏర్పాటు చేసిన డయాగస్టిక్, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, ఫీడింగ్ కియోస్క్ స్టాళ్లను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, బాలికల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆడిటోరియంలో మహిళల ఆరోగ్య పరీక్షలు, క్యాన్సర్ టీకాలపై రూపొందించిన షార్ట్ వీడియోస్‌ను ప్రదర్శించారు. ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో ఉండే మహిళల భద్రత, వసతి కోసం ప్రత్యేకంగా రూపొందించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్‌ను, సెర్ప్ గతేడాది సాధించిన విజయాలకు సంబంధించిన బుక్‌లెట్‌ను మంత్రులు ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాల సభ్యులను మంత్రులు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ మహిళలు ఎదగడానికి ఆకాశమే హద్దు అని చెప్పారు. మహిళా సాధికారత కేవలం సంక్షేమ నినాదమే కాదనీ, అది దేశాభివృద్ధికి పునాది అన్నారు. ఈ లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా శక్తికి గుర్తింపుగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ వంటి పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని తెలిపారు. రికార్డు స్థాయిలో మహిళా సంఘాలకు సుమారు రూ.1,200 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేసినట్టు తెలిపారు. డ్వాక్రా మహిళల కోసం ఉచిత హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఉన్న 4.37 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 46 లక్షల మంది మహిళలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి మహిళకు క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ హెల్త్ రికార్డు సిద్ధం చేసి ఈ-హెచ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో భద్రపరుస్తామని వెల్లడించారు. మన దేశంలో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత అత్యధికంగా వేధిస్తున్న సర్వైకల్ (గర్భాశయ ముఖ ద్వార) క్యాన్సర్ కేసులు… ఏటా సుమారు 3,200 సర్వికల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయనీ, దీని నివారణకు హెచ్‌పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. 14 ఏండ్లు నిండిన సుమారు 4లక్షల మంది బాలికలకు ఈ టీకా వేయనున్నట్టు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో రూ.3 వేల నుంచి రూ.4 వేల విలువ చేసే గార్డాసిల్-4 టీకాను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సంజరుకుమార్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, మహిళా శిశుసంక్షేమ శాఖ సెక్రెటరీ అనితారామచంద్రన్, సెర్ఫ్ సీఈవో దివ్యదేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలతోనే సమాజాభివృద్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



