నవతెలంగాణ-హైదరాబాద్ : అధిక వడ్డీలు ఆశ చూపి పలువురి నుంచి కోట్ల రూపాయల డబ్బు అప్పుగా తీసుకుని భారీ స్థాయిలో మోసం చేసిన ఓ ఘరానా లేడీ రూ.25 కోట్లకు పైగా వసూలు చేసి పరార్ అయిన ఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. వనస్థలిపురం పరిధిలోని కమలానగర్‌లో ఉండే బద్దం జ్యోతిరెడ్డి తీసుకున్న అప్పు కింద ఇటీవల తన సొంత ఇంటిని ఒకరికి అమ్ముతానని చెప్పి అగ్రిమెంట్ చేయగా.. ఆయన బంధువులు ఆ ఇంట్లో ఉంటున్నారు. బుధవారం అదే ఇంటిని తనకు సేల్‌డీడ్ చేసిందని మరొకరు వచ్చి.. ఇంట్లో ఉంటున్న వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. ఇద్దరూ ఇల్లు తమదంటే తమదని ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కానీ, ఇద్దరి వద్ద డబ్బులు తీసుకున్న సదరు మహిళ పరార్ అయినట్లు తెలుస్తోంది.
అయితే బంధువులు, స్నేహితుల వద్ద నుంచి తెచ్చి డబ్బులు ఇచ్చామని, తమకు ఆత్మహత్యే శరణ్యమని ఇల్లు కొనుగోలు చేసిన బాధితులు వాపోతున్నారు. అయితే జ్యోతిరెడ్డి లక్షల రూపాయలు అప్పులు తీసుకుని ముఖం చాటేసిందని పలువురు బాధితులు ఇటీవల ఫిర్యాదు చేశారని వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మహేశ్ తెలిపారు. తన వద్ద రూ. 46 లక్షలు తీసుకుని ఇవ్వడం లేదని శనివారం మరొకరు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. వనస్థలిపురం డివిజన్ కమలానగర్‌లో ఉండే బద్దం జ్యోతిరెడ్డి వనస్థలిపురం, హయత్నగర్ ప్రాంతాల్లో పలువురు రియల్టర్లు, రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుంది. పలువురి వద్ద 10 శాతం వడ్డీ ఇస్తానని చెప్పి అప్పులు చేసింది.
ముందుగా వడ్డీ క్రమం తప్పకుండా ఇవ్వడంతో చాలా మంది అప్పులు ఇచ్చారు. దాదాపు రూ.25 కోట్లకు పైగానే వసూలు చేసి పరారైంది. రూ.3 కోట్లు అప్పుగా తీసుకున్న సుజిత్ అనే వ్యక్తికి కమలానగర్లోని తన సొంత ఇంటిని సేల్ అగ్రిమెంట్ చేసింది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన రామకృష్ణారెడ్డికి కూడా సేల్‌డీడ్ చేసింది. అగ్రిమెంట్ చేసుకున్న సుజిత్ బంధువులు ఆ ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇంటిని తమకు అమ్మారని, ఖాళీ చేసి వెళ్లాలని బుధవారం నాడు రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి వచ్చి సుజీత్ కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమె మోసం బయటపడింది.



