నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని అన్ని గ్రామాలలో ఆవు జాతి, గేదె జాతి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం ఉచిత టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాటారం పశువైద్యాధికారి డాక్టర్ జి. రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమం మార్చి 10, 2026 నుండి ఏప్రిల్ 25, 2026 వరకు మండలంలోని గ్రామాల్లో కొనసాగుతుందని చెప్పారు.
పశువులలో వ్యాపించే గాలికుంటు వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం ఈ టీకాల కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. రైతులు, పశుపోషకులు తమ గ్రామాలకు పశువైద్య సిబ్బంది వచ్చినప్పుడు సహకరించి తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని డాక్టర్ జి. రమేష్, డాక్టర్ ధీరజ్ ఆధ్వర్యంలో పశువైద్య సిబ్బంది నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రేపు (మార్చి 10) గుండ్రాత్‌పల్లి గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. పశువుల ఆరోగ్య రక్షణ కోసం రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశువైద్య అధికారులు కోరారు.



