సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
గృహ వినియోగ వంట గ్యాస్ ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. సోమవారం చౌటుప్పల్ పట్టణం కందాల రంగారెడ్డి స్మారక భవనంలో జరిగిన సీపీఐ(ఎం) చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.60 పెంపు చేయడం సామాన్య ప్రజలపై గుదిబండలా మారిందని ఆయన విమర్శించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై రూ.115 పెంపు కూడా చివరికి వినియోగదారులపైనే భారం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి మధ్యతరగతి, శ్రామిక వర్గాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్యాస్ ధరల పెంపు మరింత భారాన్ని మోపుతోందని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మళ్లిస్తూ పేద ప్రజలపై అదనపు భారాలు మోపుతోందని విమర్శించారు. గ్యాస్ సిలిండర్లపై పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి ప్రభుత్వం నిరాకరించడం ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనమని అన్నారు. పశ్చిమాసియా యుద్ధ వివాదాన్ని కారణంగా చూపుతూ ధరలు పెంచడం తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నమని విమర్శించారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ.. ఇంధన ధరల పెంపు కారణంగా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్య ప్రజల జీవన వ్యయం మరింత పెరుగుతుందని అన్నారు. గ్యాస్ ధరల పెంపును సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందని, ప్రభుత్వం వెంటనే ఈ పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ కార్యదర్శి గోశిక కరుణాకర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా,అవ్వారీ రామేశ్వరి నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, తూర్పునూరి మల్లేశం, ఎండి రేష్మ, భావండ్లపల్లి స్వామి, కందగట్ల ఆనంద్, చిక్కూరు ఈదయ్య, గుణముని ఐలయ్య, మోగుదాల రాములు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.



