Tuesday, March 10, 2026
E-PAPER
Homeజాతీయంభారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు

భారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు

- Advertisement -

చమురు సెగ షురూ.. దిగుమతి బిల్లు తడిసిమోపెడు
పాతాళానికి రూపాయి
కుప్పకూలుతున్న స్టాక్‌ మార్కెట్లు
మధ్యతరగతి గుండెల్లో రైళ్లు!
న్యూఢిల్లీ :
భారత ఆర్థిక వ్యవస్థలో తీవ్ర ప్రమాద ఘంటికలు మోగుతోన్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌లు సంయుక్తంగా సాగిస్తోన్న యుద్ధోన్మాద ప్రభావం ఇక్కడి ప్రజలపై పడుతోంది. ట్రంప్‌ పుట్టించిన యుద్ధ జ్వాలలు గల్ఫ్‌ నుంచి వచ్చే చమురు ధరలకు ఆజ్యం పోస్తోన్నాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి విలువ పాతాళానికి పడిపోతోంది. ఈ పరిణామాలు కేవలం స్టాక్‌ మార్కెట్‌ గణాంకాలకు మాత్రమే పరిమితం కాకుండా, సామాన్య ప్రజల జేబులకు చిల్లు పెట్టే ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. యుద్ధ భయాలు, చమురు ధరల ప్రభావంతో సోమవారం స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 2,496 పాయింట్లు పతనం కాగా.. తుదకు 1,352.74 పాయింట్ల నష్టంతో 77,566.16కు క్షీణించింది. నిఫ్టీ 422.40 పాయింట్లు కోల్పోయి 24,028.05 వద్ద నిలిచింది. ఒక్క పూటలోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.13 లక్షల కోట్లు హరించుకుపోయింది. వరుస నష్టాలతో రిటైల్‌ మదుపర్లు బెంబేలెత్తుతున్నారు.

కరోనా తర్వాత తొలిసారి…
పశ్చిమాసియాలోని అమెరికా చర్యలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నారు. సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుం దనే భయాందోళనల మధ్య సోమవారం ముడి చమురు ధరలు ఏకంగా 30 శాతం మేర పెరిగాయి. 2020లో కరోనా సంక్షోభం తర్వాత చమురు ధరల్లో ఇంతటి భారీ పెరుగుదల నమోదు కావడం ఇదే తొలిసారి. యూఎస్‌ బెంచ్‌మార్క్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ ధర 30.04 శాతం పెరిగి బ్యారెల్‌కు 118.21 డాలర్లకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ కూడా 27.54 శాతం ఎగిసి 118.22 డాలర్ల వద్ద నమోదయ్యింది. చమురు ధరలు పెరగడంతో నేరుగా రవాణా రంగంపై ప్రభావం పడనుంది. డీజిల్‌ ధరలు పెరిగితే లారీలు, ఇతర రవాణా వాహనాల అద్దెలు పెరుగుతాయి. ఫలితంగా పల్లెల నుంచి నగరాలకు వచ్చే కూరగాయలు, పాలు, పప్పు ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లనున్నాయి. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఇప్పటికే ధరల భారంతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది.

రూపాయి తగ్గితే..
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. సోమవారం అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 53 పైసలు క్షీణించి.. 92.35 ఆల్‌టైం కనిష్టాన్ని చవి చూసింది. దీనివల్ల విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఫీజులు ఒక్కసారిగా భారమవుతాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ప్రాణరక్షక మందులు, వైద్య పరికరాల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. విదేశీ రుణ చెల్లింపులు భారంగా మారనున్నాయి.

మాంద్యానికి బాటలు
అధిక ధరల పెరుగుదలను అరికట్టడానికి ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు తీసుకున్న గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు భారం కానున్నాయి. ఆదాయం పెరగకపోయినా, ఖర్చులు, రుణాల భారం పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే మార్కెట్లో డిమాండ్‌ పడిపోతుంది. ఇది చివరకు ఆర్థిక మాంద్యం పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉంది.

ప్రమాదకర స్థాయిలో లోటు
యుద్ధం ఇలాగే కొనసాగితే చమురు ధరలు 150 డాలర్లకు చేరవచ్చన్న అంచనాలు వాస్తవమయితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవచ్చు. దేశ ఎగుమతుల కంటే దిగుమతుల విలువ పెరగడం వల్ల కరెంట్‌ ఎకౌంట్‌ లోటు (సీఏడీ) అమాంతం పెరగనుంది. దీనివల్ల సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులు తగ్గడం లేదా పన్నుల భారం పెంచడం వంటి చర్యలకు ప్రభుత్వం దిగవచ్చు. భారత్‌ సహా అనేక దేశాలు అమెరికా చర్యలను ఎండగడితే తప్పా పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పలేమని.. చమురు ధరలను కట్టడి చేయలేమని నిపుణులు చెబుతోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -