– మూడు కమిషనరేట్ల ఏర్పాటుతో మీకు చేరువగా అధికారులు
– సమన్వయంతో పనులు చేయించుకునే బాధ్యత మీది : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ – కూకట్ పల్లి
నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మారుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఆధ్వర్యంలో రూ.20కోట్లు వెచ్చించి హైదరాబాద్ కూకట్‌పల్లిలోని నల్ల చెరువును సుందరీకరించి అభివృద్ధి చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పీఏసీ చైర్మెన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎంసీ కమిషనర్ శ్రీ జనతో కలిసి సీఎం చెరువును ప్రారంభించారు. ముందుగా చెరువు వద్ద పూజ చేసి గంగా హారతి ఇచ్చారు. అనంతరం నల్ల చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ‘చెరువులను పునరుద్ధరించుకుందాం-వరదల నుంచి కాపాడుకుందాం’ అని పిలుపునిచ్చారు. చిన్న వర్షాలకు ఇండ్లలోకి వరదలు వచ్చి విలువైన వస్తువులు నష్టపోయిన కుటుంబాల బాధలు చూశానని, ఇక ముందు అలాంటివి జరగకుండా ఉండేందుకు చెరువులను పునరుద్ధరించుకుందామని అన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గం అభివృద్ధికి అయినా నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, తీవ్ర ఆరోపణలు చేసినా ప్రజా క్షేమానికి, అభివృద్ధి కోసం హైడ్రా ప్రారంభించామని చెప్పారు. తనకు ఎలాంటి దురుద్దేశం లేదు కాబట్టి ఎవరెన్ని తిట్లు తిట్టినా భరించానని, ఇక్కడ చేసిన అభివృద్ధి చూసి, ఇక్కడి ప్రజలు చిరునవ్వు చూస్తే తనను తిట్టిన తిట్లని మరిచిపోతున్నానని అన్నారు. రోడ్ల విస్తరణలో కొందరికి నష్టం కలిగినా, ఎవరైనా నిర్వాసితులుగా మారినా వారి వివరాలు సేకరిస్తే వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని, భూములు నష్టపోయిన వారికి టీడీఆర్ ఇస్తామని తెలిపారు. కోటీ ముప్పై నాలుగు లక్షల జనాభా ఉన్న నగరాన్ని గొప్ప నగరంగా మార్చోవడానికి మూడు కమిషనరేట్లుగా ఏర్పాటు చేసుకొని అధికారులను ప్రజలకు మరింత చేరువ చేసినట్టు తెలిపారు. వారిని సమన్వయం చేసుకుని పనులు చేయించుకునే బాధ్యత మీదేనని అన్నారు. రాజకీయంగా తాను కష్టకాలంలో ఉండగా ఆదుకున్నది మీరేనని, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని తెలిపారు. డిల్లీలో కాలుష్యం కారణంగా సెలవులు ప్రకటిస్తున్నారని, మన హైదరాబాద్ నగరం సురక్షితమైనదని, కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేసుకుందామని అన్నారు. మూసీ ప్రక్షాళన చేసి పునరుద్ధరణ చేసుకుందామని తెలిపారు.
నల్ల చెరువు అభివద్ధి చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు : ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. తాను పుట్టిన ఊరులో ఉన్న నల్ల చెరువు అభివృద్ధి చేసుకోవడం సంతోషంగా ఉందని, నల్ల చెరువు అభివృద్ధి చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ముల్లకత్వ చెరువు, బోయిన్ చెరువులు సైతం అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని, ట్రక్ పార్క్‌లో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు.
కాలుష్యరహిత నగరంగా మారుద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



