నవతెలంగాణ-హైదరాబాద్: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్‌ఎంపి మహమ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ కోసం 10 గంటల సమయం కేటాయించారు. అనంతరం తీర్మానంపై ఓటింగ్నిర్వహించనున్నారు. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రత్యేక స్పీకర్‌ను నియమించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో కేంద్రం సీనియర్ ఎంపి, చైర్పర్సన్ ప్యానెల్ సభ్యుడు జగదాంబికా పాల్‌ను నియమించింది. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది.
ప్రతిపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం సహా పలు అంశాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి మాట్లాడేందుకు యత్నించారని, కానీ స్పీకర్ అనుమతినివ్వలేదని అన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి లోక్‌సభలో సుమారు 200మంది సభ్యులున్నప్పటికీ.. డిప్యూటీ స్పీకర్ లేరని అన్నారు. డిప్యూటీ స్పీకర్ లేకుండా సభ ఎలా నడుస్తుందో దేశ ప్రజలు చూడాలని అన్నారు. మైక్‌ని కూడా ఆయుధంగా వినియోగిస్తున్నారని అన్నారు. ఎన్‌డిఎ సభ్యులకు మాట్లాడేందుకు అనుమతినిస్తున్నారని, కానీ ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు మైక్‌ని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని అన్నారు.



