నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన ఆనందంలో దేశమంతా మునిగి తేలుతుంటే, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ మాత్రం తీవ్రమైన విషాదంలో ఉన్నాడు. ఈ చారిత్రక విజయం తర్వాత తన దివంగత తండ్రి ఖంచంద్ సింగ్ను గుర్తుచేసుకుంటూ అతను పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ అందరి హృదయాలను కదిలిస్తోంది. తన తండ్రి లేకుండా ఈ విజయం అసంపూర్ణంగా అనిపిస్తోందని రింకూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇన్స్టాగ్రామ్లో తన తండ్రి ఫొటోను పంచుకుంటూ రింకూ సింగ్ భావోద్వేగభరితమైన వ్యాఖ్యలు రాసుకొచ్చాడు. “మీతో మాట్లాడకుండా ఇన్ని రోజులు నేనెప్పుడూ గడపలేదు. మీరు లేకుండా జీవితం ఎలా ముందుకు సాగుతుందో నాకు తెలియడం లేదు. కానీ, నా ప్రతి అడుగులో మీ అవసరం ఉంటుందని నాకు తెలుసు. కర్తవ్యమే ప్రథమం అని మీరు ఎప్పుడూ నాకు నేర్పించారు. అందుకే మైదానంలో మీ కలను నెరవేర్చేందుకే ప్రయత్నించాను. ఇప్పుడు మీ కల నెరవేరింది. కానీ, ఈ సంతోష సమయంలో మీరు నాతో ఉండుంటే బాగుండేది. ప్రతి చిన్న, పెద్ద ఆనందంలోనూ మీరు లేని లోటు నాకు తెలుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను పాపా” అని రింకూ పేర్కొన్నాడు.



