త్వరలో ఇరాన్‌పై యుద్ధం ముగుస్తుందని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అది నిజమో కాదో ఎత్తుగడో తెలియదు. సోమవారం నాడు 116 డాలర్లకు పెరిగిన బ్రెంట్ రకం ముడి చమురు ధర మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి 92 డాలర్లకు తగ్గింది. ఇదే విధంగా మన స్టాక్ మార్కెట్‌లో సోమవారం నాడు రెండున్నరవేల పాయింట్ల వరకు పతనమైన సూచి మంగళవారం నాడు ఆరువందల పాయింట్లు పెరిగింది.ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. యుద్ధ ప్రభావం మనమీద పడుతున్నది. పెట్రోలు, డీజిలు కొరత లేదు గానీ వంటగ్యాస్ మండుతున్నది. ఇది ఒక అంశం. ఇరాన్‌పై జరిగిన దాడి సందర్భంగా కొంతమంది చైనా ఆయుధాల పనితీరు గురించి చర్చ చేస్తున్నారు. పాకిస్తాన్, వెనెజులా తరువాత ఇరాన్‌లో కూడా అవి తుస్సుమన్నాయని చెబుతున్నారు.ఇరాన్ దగ్గర ఆయుధ నిల్వలు తగ్గి పోయినట్లు, రోజూ ప్రయోగించే క్షిపణుల సంఖ్య పడిపోయినట్లు మరికొన్ని కథనాలు. మరోవైపున దాని క్షిపణి ప్రయోగ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశామని అమెరికా చెబుతోంది.ఇంకో వైపున రోజూ క్షిపణి దాడుల వార్తలు తెలిసిందే. యుద్ధ సమయాల్లో ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రచారాలు సహజమే.
ఇరాన్‌కు మిత్రదేశాలు అని చెబుతున్న చైనా, రష్యా దాని తరఫున యుద్ధంలోకి ఎందుకు దిగటం లేదు అని కొందరు తెలివిగా ప్రశ్నిస్తున్నామనుకుంటున్నారు. అమెరికా దాడిని అవి రెండూ ఖండించాయి. మనమూ యుద్ధంలోని మూడు దేశాలకూ మిత్రులమే కదా? మనమెందుకు యుద్ధంలో అడుగుపెట్టలేదని మోడీని ఎవరైనా ప్రశిస్తున్నారా? కనీసం ఇరాన్‌తో మాట్లాడను కూడా మాట్లాడలేదే! అనేక పశ్చిమ దేశాలు అమెరికాకు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి, అవి కూడా తమ మిలిటరీలను దించలేదు. అమెరికా మిలిటరీ స్థావరాలను అనుమతించిన కారణంగా గల్ఫ్‌దేశాల మీద ఇరాన్ దాడులు జరుపుతున్నది.ప్రత్యక్ష బాధితులైన ఆ దేశాలు కూడా యుద్ధాన్ని ఎందుకు ప్రకటించటం లేదు. వాటి రక్షణకు అమెరికా చేస్తున్నదేమిటి? చెప్పేవాడు లోకువ అయితే అడిగేవాడు రెచ్చిపోతుంటాడు.
కొందరు విశ్లేషకులు చెబుతున్నదేమిటి ? తాజా యుద్ధంతో ప్రధానంగా నష్టపోయేది చైనా. హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో చమురు సరఫరా నిలిచిపోతుంది.ఇరాన్‌లో దాని పెట్టుబడులకు దెబ్బతగులుతుంది. దాని ఆయుధాలు పనికిరావని తేలినందున కొనేవారు ఉండరు. అసలు ఇరాన్‌కు చైనా ఇచ్చిన ఆయుధాల గురించి ఊహాగానాలు తప్ప నిజానిజాలను నిర్ధారణగా చెప్పటం లేదు. చైనా ఆయుధాల గురించి చెబుతున్నవి వాస్తవం కాదు అని చెబుతున్నవారూ ఉన్నారు. విమానదాడుల నుంచి రక్షణకు జనవరిలో చైనా రాడార్లను భారీ విమానంలో పంపిందన్నది ఒక వార్త. రాడార్లు పెద్దవిగా ఉన్నందున ఉపగ్రహాల నిఘా నుంచి వాటిని దాచటం కష్టం. గతంలో చైనా ఆయుధాలను సరఫరా చేసింది. ఐరాస 2007లో చేసిన తీర్మానం తరువాత వాణిజ్యం నిలిచిపోయింది. అంతకు ముందు కుదిరిన ఒప్పందాల ప్రకారం 2015వరకు సరఫరాలు కొనసాగాయి.
ఇరాన్ తయారు చేస్తున్న షాహేద్ డ్రోన్ల గురించి 2022 దర్యాప్తులో తేలిన అంశం ఏమంటే ఎనభై శాతం భాగాలు పశ్చిమదేశాలు అడ్డదారుల్లో అందించినవే. ఓల్టేజ్ కన్వర్టర్లు, ఇంజన్లు మాత్రం చైనావని చెప్పారు. ఇతర దేశాల డ్రోన్లు దొరికినపుడు వాటిని పరిశీలించి అదే రకాలను ఇరాన్ స్వయంగా తయారు చేస్తున్నది. పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యంలోని ఇతర దేశాలతో కూడా చైనాకు మంచి సంబంధాలే ఉన్నాయి. అవి దెబ్బతినకుండా ఉండాలంటే సమతుల్యత పాటించాలి గనుక యుద్ధ విమానాలు కావాలని ఇరాన్ వత్తిడి తెచ్చినప్పటికీ వాటిని సరఫరా చేయలేదు. అయితే చైనా ఏమి సరఫరా చేసింది.2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం భూమి, అంతరిక్షంలో సమాచార సేకరణ కేంద్రాలను ఇరాన్‌లో ఏర్పాటు చేసింది.తరువాత 2021లో కుదిరిన 25 సంవత్సరాల ఒప్పందంలో కూడా వాటిని చేర్చింది.దాంతో బెయిడౌ-3 ఉపగ్రహ సేవలను అందుబాటులోకి తెచ్చింది. గతేడాది అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన 12రోజుల దాడుల సమయంలో ఇరాన్‌లోని జిపిఎస్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఆ యుద్ధం తరువాత జూన్ నెలలో పౌర, మిలిటరీ అవసరాలకు బెయిడౌ-3 మీద పూర్తిగా ఆధారపడేందుకు ఇరాన్ ఒప్పందం చేసుకుంది. బీజింగ్ కేంద్రంగా పని చేస్తున్న మిజరావిషన్ అనే ఉపగ్రహ నిఘా కంపెనీ సేవలను కూడా పొందుతున్నది.
తాజా అమెరికా దాడుల సమయంలో ఇజ్రాయిల్‌లోని అవడా విమాన స్థావరంలో ఉంచిన 11 అమెరికా ఎఫ్-22 బాంబర్లు, అమెరికా యుద్ద నౌకలు, గగనతలంలోనే ఇంథనం నింపుకొనే విమానాల వంటి వాటి చిత్రాలను, సమాచారాన్ని ఆ సంస్థ ఇరాన్‌కు అందచేయటంతో వాటిని గురిచూసి కొట్టిందని వార్తలొచ్చాయి. ఇలాంటి సమాచారం రష్యా కూడా అందచేసి ఉంటుంది. ఈ కారణంగానే ఆ రెండు దేశాలూ సమాచార మిస్తున్నాయని అమెరికా మీడియా రాసింది. ఆధునిక యుద్ధంలో ఆయుధాలతో పాటు శత్రువు కదలికలను పసిగట్టే సమాచారమూ అంతే ముఖ్యమైనది.ఈ రంగంలో అమెరికాకు ధీటుగా చైనా అనేక ఉపగ్రహాలను కలిగిఉంది. ఉక్రెయిన్- రష్యా పోరులో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు అందించిన సమాచారంతోనే ఉక్రెయిన్ అనేక దాడులు చేసి రష్యాకు నష్టం కలిగించిన సంగతి తెలిసిందే.అమెరికా బెదిరింపులతో మనదేశం ఇరాన్ చమురు కొనుగోలు నిలిపివేసింది. ఇతర దేశాలు కూడా అదే చేశాయి. ఈ పూర్వరంగంలో ఇరాన్ చమురు ఎగుమతుల్లో 80శాతం చైనాకే జరుగుతున్నాయి. ఈ మొత్తం చైనా దిగుమతుల్లో 12-15శాతమే. హార్ముజ్ జలసంధిని ఇతర దేశాల నౌకలకు మూసివేసినప్పటికీ చైనా వాటిని మిన హాయించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన పరిమితంగానే చైనా ప్రభావితం అవుతుందని భావిస్తున్నారు.
ఇలాంటి మినహాయింపు మనకు ఇవ్వలేదు, కారణం మనం ఇజ్రాయిల్, అమెరికా వైపు మొగ్గటమే. రెండు దేశాల మధ్య వివాదం తలెత్తినపుడు ఎవరి బలాన్ని వారు ప్రదర్శిస్తారు. ఎలాంటి క్షిపణి ప్రయోగంలేకుండానే అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాలను చైనా దెబ్బతీస్తున్నందంటూ తాజాగా ఒక విశ్లేషణ వెలువడింది.అమెరికాకు పోటీగా చైనా మరో యుద్ధాన్ని ప్రారంభించిందని చెబుతున్నారు. ప్రపంచ బలాబలా లను సమతూకం చేసేందుకు చైనా మార్చినెల ఐదున 15వ పంచవర్ష ప్రణాళికను విడుదల చేసింది. పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానం, విలువైన ఖనిజాల రంగంలో పురోగతికి దానిలో ప్రాధాన్యత ఇచ్చారు. అది పైకి ఆర్థిక పరమైనదిగా కనిపిస్తున్నప్పటికీ మిలటరీ లక్ష్యాలు కూడా ఉన్నాయని చడీ చప్పుడు లేకుండా చైనా ముందుకు పోతున్నతీరును ఎవరూ పట్టించుకోవటం లేదంటూ పెట్టుబడుల విశ్లేషకుడు షనాకా అన్సెలెమ్ పెరేరా వాపోయాడు. ఐదేండ్ల కాలంలో కృత్రిమ మేథ వినియోగం ద్వారా పరిశ్రమల్లో 1.4లక్షల కోట్ల డాలర్ల మేర అదనపు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా అనేక రంగాల గురించి దానిలో పేర్కొన్నారు.
సాంకేతిక రంగంలో చైనాను అడ్డుకొనేందుకు అమెరికా ఒక ఇనుపతెరను ఏర్పాటు చేసింది.ఫాక్స్‌సిలికా పేరుతో మనతో సహా అనేక దేశాలతో ఒక వ్యవస్థను రూపొందించింది. ఆధునిక చిప్స్, వాటి తయారీకి అవసరమైన యంత్రాలను అందకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చైనా రూపొందించిన పంచవర్ష ప్రణాళిక ఒక ఆర్థిక పథకం కాదు, అమెరికాతో యుద్ధ ప్రణాళిక అని పెరేరా పేర్కొన్నాడు. అమెరికా చిప్స్ చట్టం ఒక రైఫిల్ వంటిది కాగా చైనా పంచవర్ష ప్రణాళిక ఒక అమ్ముల పొది అని వర్ణించాడు.దీనిలో విలువైన ఖనిజాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం ఈ రంగంలో చైనా ప్రపంచంలోనే ఆధిపత్యం వహిస్తున్నది.ఈ ఖనిజాలు విద్యుత్ వాహనాల నుంచి లక్ష్యాల మార్గదర్శనం చేసే వ్యవస్థలు, అత్యాధునిక రాడార్ల వరకు ఎంతో ముఖ్యమైనవి. అమెరికా ప్రతి ఎఫ్-35 ఆధునిక యుద్ద విమానానికి వందల కిలోల ఖనిజాలు, లోహాలు అవసరం. ఇంజన్లు, సెన్సార్లు, ఆయుధ వ్యవస్థలు, క్షిపణి బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలకు ఇవి లేకుండా పని జరగదు.
చైనా మీద అమెరికా 2018 నుంచి వాణిజ్యంతో పాటు చిప్స్ యుద్ధం కూడా చేస్తున్నది.
దీనికి ప్రతిగా బీజింగ్ నూతన ఎత్తుగడలను రంగంలోకి తెచ్చింది. విలువైన ఖనిజాలు, వాటితో ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడిసరకు ఉత్పత్తిలో నైపుణ్యం సాధించి, ఇతర దేశాలకు అందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది.వీటి దిగుమతులకు సంబంధించిన అమెరికా రక్షణశాఖ చేసుకున్న ఒప్పందాలు 2027లో ముగుస్తాయి.చైనాకు ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే అమెరికాకు సంవత్సరాలు, దశాబ్దం పట్టినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ పోరులో అమెరికా పెద్ద మొత్తంలో విలువైన ఖనిజాలతో కూడిన ఆయుధాలను వినియోగిస్తున్నది. ఇరాన్ యుద్ధంలో అమెరికన్లు క్షిపణులు, డ్రోన్లను అడ్డుకొనే ఆయుధాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు, మరోవైపు చైనా వాటి తయారీకి అవసరమైన ఆ ఖనిజాల సరఫరాను కఠినతరం కావిస్తున్నదని పెరేరా వాపోయాడు. తెలివితేటలు అమెరికా సొత్తు కాదు. విలువైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం రానున్న 15 సంవత్సరాలు ఉంటుందని అంచనా. నిజంగానే చైనా తన పట్టు నిలుపుకుంటే అమెరికా ఎఫ్-35 విమానాలు ఎగిరే అవకాశాలు లేవని కొందరు వ్యాఖ్యానించారు.
అయితే ఇది కాస్త అతిగా ఉన్నప్పటికీ పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నది. చైనా ఆయుధాల్లో పసలేదని ఒక వైపు ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఆయుధాలకు పదును పెట్టుకుం టున్నాయి. ఈ నేపధ్యంలో చైనా కూడా అలాంటి ఆధునిక మిలిటరీ ఉత్పత్తులను సేకరించుకోవాలి, కానీ దానికి విరుద్ధంగా గడచిన ఐదేళ్లలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలను 72శాతం తగ్గించింది. మరోవైపు మనదేశం ప్రపంచంలో సాధారణ పరిస్థితుల్లో ఆయుధాల దిగుమతిలో మొదటి స్థానంలో ఉన్నాం.(యుద్ధంలో ఉంది కనుక ఉక్రెయిన్ మనకంటే ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నది) విదేశీ ఆయుధాల స్థానంలో చైనా తన స్వంత ఉత్పత్తులను చేరుస్తున్నది. మరోవైపు చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్, దక్షిణ కొరియా, జపాన్‌లకు ఆధునిక ఆయుధాలను అమెరికా అందచేస్తున్నది, అవసరమైతే తైవాన్ విషయంలో నేరుగా జోక్యం చేసుకుంటామని అమెరికా, జపాన్ ప్రకటించాయి.
నిజంగా తన ఆయుధాలు నాశిరకమైతే చైనా వాటితోఅమెరికాను అడ్డుకోగలదా! చిత్రం ఏమిటంటే చైనా ఆయుధాలను చూసి ఇరుగు పొరుగు దేశాలు ఆధునిక ఆయుధాలను సమీకరించు కుంటున్నట్లు పశ్చిమదేశాల వ్యాఖ్యాతలు పాటపాడుతుంటారు. స్వీడన్‌లోని స్టాక్‌హౌమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్(సిప్రి) తాజాగా వివిధ దేశాల ఆయుధాల గురించి ఒక నివేదికను విడుదల చేసింది. ఐరోపా 2021-25 సంవత్సరాలలో 33శాతం, ఆసియా, ఓషియానా దేశాలు 31శాతం ఆయుధాలను దిగుమతి చేసుకు న్నాయి. అంతకు ముందు ఐదేళ్లతో పోల్చితే ఇరవై శాతం తగ్గాయి. చైనా 72, దక్షిణ కొరియా 54, ఆస్ట్రేలియా 39 శాతం తగ్గించాయి. గతంలో ఆయుధ దిగుమతుల్లో తొలి పది దేశాల్లో ఉన్న చైనా 1991-95 తరువాత ప్రస్తుతం 21వదిగా ఉంది. తన దిగుమతుల్లో రష్యా నుంచి 66శాతం దిగుమతి చేసుకుంటోంది. చైనా సాధించిన ప్రగతి గురించి కొందరు ఉక్రోషంతో తక్కువ చేసి చూడవచ్చు. కానీ విధాన నిర్ణేతలు వాటి ఆధారంగా అంచనా వేసుకుంటే పప్పులో కాలేసినట్లే !
ఎం కోటేశ్వరరావు
8331013288



