ఉన్నట్టా.. లేనట్టేనా!
అయోమయంలో కూలీలు
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామీణ ప్రాంత కూలీల వలసలను నిరోధించేందుకు, ఉన్న ఊరిలోనే పనులు కల్పించే సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది.పంట పొలాలు చదును చేయడం,చెరువులు, కుంటలు,బావుల్లో పూడిక తొలగించడం, వ్యవసాయ క్షేత్రాలకు రహదారులు వేయడం,హరితహారంలో మొక్కలు నాటడం,వాటికి కంచె లు ఏర్పాటు చేయడం వంటి తదితర పనులు కల్పిస్తున్నారు.వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత అంటే ఎండాకాలంలో ఉపాధి పనులు జోరుగా సాగుతుంటాయి. ఏటా అమలు చేసే వేసవి భత్యం విషయంపై ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో దానిపై సందిగ్ధం నెలకొంది.మండలంలో మొత్తం జాబ్ కార్డులు 8,495,కూలిలు 18,87,యాక్టివ్ కూలీలు 10,632
భత్యం ఉన్నట్టా.. లేనట్టా..
వ్యవసాయ పనులు పూర్తయిన అనంతరం ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతుంటాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో పూర్తిస్థాయిలో పనులు చేయలేని పరిస్థితి ఉండటంతో వారికి వేసవి భత్యం అమలు చేసేవారు. ఫిబ్రవరిలో 20శాతం, మార్చి, ఏప్రిల్లో 25 శాతం,మేలో 30శాతం, జూన్ 25 శాతం అందించేవారు. ఈ సారి ఫిబ్రవరి పూర్తయి మార్చి వచ్చినా ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి టీసీఎస్ సాఫ్ట్వేర్లోనే కార్యకలపాలు కొనసాగుతూ వచ్చాయి.కొత్తగా తీసుకొచ్చిన ఎన్ ఐసీ సాఫ్ట్వేర్ లో వేసవి భత్యానికి సంబంధించిన ఎలాంటి ఆప్షన్ లేదు. దీంతో ఈ సారి అమలవుతుందా ..? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదనపు భత్యం లేకపోతే కూలీలు నష్టపోయే పరిస్థితి ఉంది.అయితే ఈ విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని అధికారులు చెబుతున్నారు.
పల్లెల్లో ఊపందుకున్న పనులు…
మండల వ్యాప్తంగా ఉపాధి పనులు జోరందు కున్నాయి. రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగు తుండగా పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు ఒక్కో కూలీకి నిత్యం రూ.186-200ల వరకు చెల్లిస్తున్నారు. కాగా.. ప్రతి వేసవిలో ఉపాధి పనుల వద్ద సౌకర్యాలు అందని చెప్పడమే తప్పా ఆచరణలో ఒరిగింది శూన్యం.మండుటెండలో పనులు చేసి వడదెబ్బకు గురైన వారు కోకోల్లలున్నారు.ఉపాధి పనులు జరిగే చోట నీడ సౌకర్యం కచ్చితంగా ఉండాలి.చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి.కూలీలకు మంచి నీటి సౌక ర్యం కల్పించాలి. నీటి వసతి కల్పించని క్రమంలో ప్రతి నిత్యం కూలీతో పాటుగా రూ.5 అదనంగా మంచినీటి భత్యం చెల్లించాలి.పని ప్రదేశంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. పని చేస్తున్న సమయంలో కూలీలకు గాయాలైతే ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి.కూలీలు ఎవరైనా అస్వస్థతకు గురైతే వారిని తక్షణం ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలి.నిబంధనలు కూలీలకు ప్రయోజనకరమైనా అధికారులు అమలులో చతికిలపడుతున్నారు.



