తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22-ఎ కింద నిషేధిత భూముల జాబితా మరోసారి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సరైన కారణాలు లేదా తగిన ధ్రువీకరణ లేకుండా భూములు నిషేధిత జాబితాలో కొనసాగుతున్నాయని భూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2025 ఆగస్టు నెలలో తెలంగాణ హైకోర్టు పలు పిటిషన్లను విచారిస్తూ ప్రభుత్వం మొత్తం 22-ఎ నిషేధిత భూముల జాబితాను సమగ్రంగా సమీక్షించాలని ఆదేశించింది. భూమిని నిషేధిత జాబితాలో చేర్చేటప్పుడు తెలంగాణ రిజిస్ట్రేషన్ నియమాలు 2016లోని రూల్స్ 238 నుండి 241 వరకు కచ్చితంగా పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్. నం.98 తేదీ 23 ఆగష్టు 2025 ద్వారా ఒక మూడు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షుడిగా, ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జితో పాటు సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ భూ రికార్డులను పరిశీలించి ప్రజల అభ్యంతరాలను స్వీకరించి నిషేధిత జాబితాలోని భూములను ధ్రువీకరించడం, తొలగించడం లేదా సవరించడం చేయడానికి అధికారం కలిగి ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా జిల్లా అధికారుల ద్వారా అందిన వివరాల ఆధారంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పోర్టల్‌లో 2025 డిసెంబర్ 3 ప్రాంతంలో నిషేధిత భూముల జాబితా మళ్లీ అప్లోడ్ చేయబడింది. అయితే కొన్ని ప్రాంతాలలో పాత జాబితానే యథాతథంగా మెకానికల్‌గా అప్లోడ్ చేయబడినట్లు పౌరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ప్రత్యేకంగా ఫ్రీడం ఫైటర్ల కుటుంబాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, పాత పట్టాదారులు తమ భూములు దశాబ్దాలుగా సాగులో ఉండి పట్టాదార్ పాస్‌బుక్స్ ఉన్నప్పటికీ నిషేధిత జాబితాలో కొనసాగుతున్నాయని వాపోతున్నారు.
ఇక మరో ముఖ్యమైన సమస్య భూభారతి గ్రీవెన్స్ పోర్టల్ పనితీరుకు సంబంధించినది. ఈ పోర్టల్‌లో ”Grievance relating to inclusion of land in Prohibited List” అనే ఎంపిక ద్వారా అభ్యంతరాలు నమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ, నిషేధిత జాబితాలో కనిపించే కొన్ని సర్వే నంబర్లు గ్రీవెన్స్ పోర్టల్‌లోని డ్రాప్ డౌన్ జాబితాలో కనిపించడం లేదని పౌరులు చెబుతున్నారు. ఆ పోర్టల్‌లో సర్వే నంబర్‌ను డ్రాప్‌డౌన్ జాబితా నుండి ఎంపిక చేయడం తప్పనిసరి కావడంతో, అలాంటి సందర్భాల్లో పౌరులు తమ అభ్యంతరాలను ఆన్లైన్లో నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సాంకేతిక లోపాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు కూడా సమాచారం.
అదే సమయంలో తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న 22-ఎ నిషేధిత జాబితా సమీక్షకు సంబంధించిన కేసుల ప్రస్తుత స్థితి, కేసు వివరాలు, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ వంటి వివరాలు ప్రజలకు స్పష్టంగా అందుబాటులో లేకపోవడం కూడా అనేక సందేహాలకు దారితీస్తోంది. నిపుణులు అభిప్రాయపడుతున్నట్లుగా, ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత అత్యంత అవసరం. జి.ఓ. ఎం.ఎస్. నం.98 ప్రకారం జరుగుతున్న సమీక్ష సరైన విధంగా పూర్తయితే, తప్పుగా నిషేధిత జాబితాలో చేరిన భూములను సవరించే మంచి అవకాశం లభిస్తుంది. అందువల్ల ప్రభుత్వం భూభారతి, గ్రీవెన్స్ పోర్టల్‌లో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే సరిచేసి, 22-ఎ నిషేధిత భూముల జాబితా సంబంధిత పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పౌరులు కోరుతున్నారు.
బి.వినోద్ కుమార్
9391137664



