Thursday, March 12, 2026
E-PAPER
Homeమానవిప్ర‌కృతిర‌త్న శ‌శిక‌ళ‌

ప్ర‌కృతిర‌త్న శ‌శిక‌ళ‌

- Advertisement -

అనుకోని సంఘటనలు, ఊహించని మలుపులు జరగడమే జీవితం. ఉపాధ్యాయనిగా జీవితం ప్రారంభించిన ఆమె నేడు మహిళా రైతుగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. చెక్కుచెదరని చిరునవ్వుతో, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. బంధువులు అవహేళన చేస్తున్నా భర్తకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కలం వదిలి హలం చేతబట్టారు. అలా మట్టిపరిమణాన్ని ఆస్వాదిస్తూ వ్యవసాయం ప్రారంభించారు. ఉత్తమ మహిళా రైతుగా, ప్రకృతి రత్నగా ఎన్నో అవార్డులు అందుకున్న కర్ర శశికళ పరిచయం నేటి మానవిలో…

శశికళ నల్లగొండ జిల్లా, గరిడేపల్లి గ్రామంలో పుట్టి పెరిగారు. తల్లిదండ్రులు భారతమ్మ, జానకిరామ్‌ రెడ్డి. ఈమెకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. చిన్నప్పటి నుండి బాగా చదువుకొని టీచర్‌ ఉద్యోగం చేయాలని కలలు కన్నారు. డిగ్రీ చివరి ఏడాది చదువుతుండగా మంచి సంబంధమని తల్లిదండ్రులు వివాహం చేశారు. తన గ్రామానికి దూరంగా మిర్యాలగూడలో కాపురం పెట్టారు. భర్త ప్రైవేటు ఉద్యోగి. చదువుకో వాలన్న ఆమె ఆసక్తిని గమనించి భర్త మాధవరెడ్డి ప్రోత్సహిం చారు. అతని సహకారంతో పీజీ పూర్తి చేసి, బీఈడీ చదివారు. తదనంతరం ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా చేరారు.

ఊహించని మలుపు
అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? అలాగే శశికళ జీవితం కూడా ఊహించని మలుపు తిరిగింది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మాధవరెడ్డి కొందరితో కలిసి వ్యాపారం మొదలు పెట్టారు. వ్యాపారంలో చాలా నష్టం వచ్చి ఐదు లక్షలకు పైగా అప్పు మిగిలింది. అప్పుల బాధ అలా ఉండగా మరో పిడుగు లాంటి వార్త. భర్త ఆరోగ్యం క్షీణించింది. వైద్య పరీక్షలు చేయిస్తే గుండె సంబంధిత వ్యాధి అని తెలిసింది. వైద్యానికి దాదాపు నాలుగు లక్షల దాకా ఖర్చు చేశారు. భర్త కోరిక మేరకు మిర్యాలగూడ వదిలి దుర్గాపల్లి అనే తమ గ్రామానికి వచ్చేసారు. ఎన్నో ఆసుపత్రులకు తిప్పారు. ఎందరో వైద్యుల్ని సంప్రదించారు. అయినా ఫలితం శూన్యం. ఆమె ప్రయత్నం ఫలించలేదు. చివరికి మాధవరెడ్డి కన్నుమూశారు.

అవగాహన లేకపోయినా…
తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబమే. అయినా ఆమెకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు. మట్టి వాసన, పేడ వాసన గిట్టేది కాదు. తెలిసిన వారింట్లో గేదెలు, ఆవులు ఉన్నాయంటే అటుపక్కకు వెళ్ళేది కాదు. అటువంటి ఆమె వ్యవసాయం చేయడానికి సిద్ధపడ్డారు. పంట ఎలా వేయాలో, ఎలాంటి ఎరువులు వాడాలో ఏమి తెలిసేది కాదు. పురు గుల మందు కొనడానికి వెళితే ఎవరూ పట్టించు కునేవారు కాదు. గంటల కొద్ది ఎండలో నిలబడ లేక ఏడుపు వచ్చేది. పంట మీద ఆదాయం రాని పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో రెండు రూపాయల వడ్డీతో 50 వేలు అప్పు చేసి 5 గేదెలను కొన్నారు. ఆ గేదెలతోనే వ్యవసాయం ప్రారంభించారు. కేవలం భర్త కోరికను తీర్చడం కోసం తనకు ఎంత కష్టమైనా ఆ పనిని ఇష్టంగా మొదలుపెట్టారు.

సేంద్రియ వ్యవసాయం
డైరీ నిర్వహిస్తూనే భర్త నాటిన బత్తాయి తోటను సాగు చేశారు. బత్తాయి తోట ఎనిమిది ఎకరాలు ఉండేది. పంట బాగా పండటంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. తమ్ముడు అభినందించి అండగా నిలిచాడు. అయితే కంటి ముందు అప్పులు కనిపించాయి. వాటిని తీర్చే ప్రయత్నంలో అనుభవజ్ఞుల ద్వారా పూర్తిగా సేంద్రియ విధానంపై పట్టు సాధించారు. పాలు అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు గడిపేవారు. ఆవుతో చేసే ఎరువు బలవర్ధకమని తెలిసి కబేళాకు వెళ్లి ఆవులను కొనాలను కున్నారు. చాలామంది ‘ముసలి ఆవుతో గోసాల ఏంటి?’ అని ఎగతాళి చేశారు. ఎవరు ఎన్ని అవహేళనలు చేసినా తాను చేయాలనుకున్న పనిని ఆచరణలో పెట్టి 40 ముసలి ఆవులను కొన్నారు. ఎరువుల తయారీకి కావలసిన డబ్బు తన వద్ద లేదు. పైగా అప్పులు ఉన్నాయి. చాలా బ్యాంకులు తిరిగారు. ఏ బ్యాంకూ రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు. పైగా ‘మహిళవు నువ్వేం చేస్తావు’ అంటూ అవహేళన చేసేవారు. చివరికి ఓ బ్యాంకు అధికారి మనసు కరిగి 10 లక్షల రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

30 రకాల పురుగు మందులు
డబ్బు చేతికి ఇస్తూ… ‘అమ్మా.. నిన్ను నమ్మి డబ్బిస్తున్నా, మమ్మల్ని వీధిలో పెట్టకు’ అన్నాడు. ఆ మాటతో ఆమె మనసు ఎంతో గాయపడింది. ఎలాగైనా యూనిట్‌ విజయవంతం చేయాలనుకున్నారు. ముసలి ఆవుల్ని మేపుతూ, పేడ, వానపాములతో ఎరువు తయారు చేయడం ప్రారంభించారు. ఏడాదికి రెండు నుండి పది టన్నులు అమ్మే స్థితికి చేరుకున్నారు. ప్రతినెలా బ్యాంకుకి డబ్బులు చెల్లించి అప్పు తీర్చేశారు. క్రమంగా అప్పులన్నీ తీరి, ఉన్న పొలానికి మరో రెండు ఎకరాలు చేర్చి ట్రాక్టర్‌ని కొన్నారు. రసాయనిక ఎరువులను వాడకుండా తాను సొంతంగా తయారు చేసుకున్న వాటినే మొక్కలకు, పొలానికి వాడుతున్నారు. గిర్‌ ఆవుతో 30 రకాల పురుగు మందులు తయారు చేస్తున్నారు. ఎరువుల కోసం హెర్బల్‌ లిక్విడ్స్‌, పంచగవ్య, కాస్టింగ్‌ టీ, జీవామృతం వాడుతున్నారు.

ఉత్తమ మహిళా రైతుగా…
ఉదయం 3.30 గంటలకు నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి 8:30 గంటల వరకు శశికళ పనులు చేస్తూనే ఉంటారు. పశువులకు మేత వేయడం, పరిసరాలను శుభ్రం చేయడం, వ్యవసాయ పనులు చూసుకోవడం, వర్మి కంపోస్టు యూనిట్‌ పనులు నిత్యం పర్యవేక్షిస్తూ వుంటారు. వ్యవసాయం రంగంలో శశికళ ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 2006లో 8 ఎకరాల బత్తాయి తోటలో 102 టన్నుల దిగుబడి సాధించి ఉత్తమ మహిళా రైతుగా పురస్కారాన్ని అందుకున్నారు. 2007లో హర్టీ కల్చరల్‌ విభాగంలో బంగారు పతకం అందుకున్నారు. 2025లో ప్రకృతి రత్న పురస్కారం అందుకున్నారు. వీరు అందుకున్న పురస్కారాలు, ప్రశంస పత్రాల జాబితా చాలా పెద్దదే. భర్తకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, అతని కలను సాకారం చేయడమే కాక, మరి కొందరికి ఉపాధి కల్పించి ఆదర్శంగా నిలిచిన శశికళ నేడు ఎందరికో స్ఫూర్తి దాయకం.

భర్తకుఇచ్చిన మాట కోసం

భర్త మరణంతో శశికళ జీవితంలో ఒక్కసారిగా చీకటి అలుముకుంది. కొన్నేండ్ల పాటు మానసికంగా కుంగిపోయారు. అతని ఆలోచనలు వెంటాడుతూ ఉండేవి. ఆత్మహత్యాయత్నం చేస్తుండగా కుటుంబ సభ్యులు గమనించి కాపాడారు. ఆ సమయంలో తమ్ముడు వివేకానందుని పుస్తకాలు తెచ్చి చదవమని అనేవాడు. తల్లి తండ్రులు ఎంతో అండగా నిలిచారు. లోకం తెలియని కొడుకు మొహం చూసి, వాడి బాధ్యత, భవిష్యత్తు తన చేతుల్లోనే ఉన్నాయని, వాడికోసమైనా బతకాలని నిర్ణయించుకున్నారు. భర్తకు వ్యవసాయ మంటే ప్రాణం. అతనికి ఇచ్చిన మాట ప్రకారం ఆ పల్లెటూరిలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. అత్తింటి వారికి పొలాలు ఉంటే వాటిని కౌలుకు ఇచ్చారు. కానీ కౌలు డబ్బులు సక్రమంగా వచ్చేవి కాదు. ఇన్ని ఆటుపోట్ల నడుమ ఇక తానే స్వయంగా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
– పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -