మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చైర్మన్‌గా ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్, తమ రిపోర్టును ముఖ్యమంత్రికి 2026 ఫిబ్రవరి 27న అందజేసింది. ఈరోజు వరకు రిపోర్టుపై మీడియాలో వస్తున్న వార్తలను చూసినప్పుడు రిపోర్ట్‌లోని సానుకూల అంశాలను ప్రస్తావించకుండా, కొన్ని ప్రతికూల అంశాలను మాత్రమే పదే పదే రిపోర్ట్ చేస్తున్నట్టు కనిపించింది. విద్య అంటేనే విద్యార్థి, ఆ తర్వాతే ఉపాధ్యాయుడు. ఈ రిపోర్టు విద్యార్థి కేంద్రంగా ఉన్నదా లేదా అనేది ప్రధానాంశం. రిపోర్టు ”విద్యార్థి కేంద్రం”గా తయారు చేయబడింది. 1966లో డాక్టర్ కొఠారి కమిషన్ రిపోర్ట్ కూడా ‘విద్యార్థి కేంద్రం’గానే ఇవ్వబడింది. ఇక్కడ నేను పూర్వ ప్రాథమిక విద్య, పాఠశాల విద్యకు పరిమితమై పరిశీలన చేస్తాను.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్య నేడు తీవ్ర సంక్షోభంలో ఉన్నది. ఇందులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అత్యంత దయనీయస్థితిలో ఉన్నాయి. 2024-25 యు డైస్ గణాంకాల ప్రకారం దాదాపు 30 లక్షల పైగా విద్యార్థులు 1 నుండి 5వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే 19727 ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 5వరకు 7,07,755 మంది విద్యార్థులు, 3143 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుండి 5వరకు 1,25,475 మంది విద్యార్థులు చదువుచున్నారు. 1 నుండి 5వ తరగతి విద్యార్థులలో 28శాతం మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుచున్నారు. రెండు శాతం విద్యార్థులు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఐదవ తరగతి చదువుతున్నారు. 1 నుండి 5 వరకు 70శాతం విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల్లో చదువుచున్నారు. ఈ అంశంపై ముఖ్యమైన ఉపాధ్యాయ సంఘాలతో, తల్లిదండ్రులతో విద్యా కమిషన్ విస్తృతంగా చర్చించింది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ బృందంతో నేను కూడా చర్చలో పాల్గొన్నాను. ఆ సందర్భంగా ప్రయివేటు పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య(నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి) తరగతులు ఉండుట వలన తల్లిదండ్రులు ప్రయివేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు.
అందువలన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కూడా పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని సూచించాము. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక గది, తరగతికి ఒక టీచర్ లేకపోవడం వలన విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని, తరగతికొక గది, తరగతికొక టీచర్, ప్రధానోపాధ్యాయుడు, ఇతర భౌతిక వసతులు ఏర్పాటుచేయాలని చెప్పాము. రిపోర్టులోని పేజీ 50 నుండి 55 వరకు పూర్వ ప్రాథమిక విద్యకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో స్పష్టంగా పేర్కొన్నారు. పూర్వ ప్రాథమిక తరగతులు ప్రాథమిక పాఠశాలలోనే నిర్వహించాలని, మూడు తరగతులకు మూడు గదులుండాలని, ముగ్గురు టీచర్లు ఉండాలని, విద్యార్థుల సంఖ్య సెక్షన్‌కు 20కి పరిమితం చేయాలని, ఆయా ఉండాలని, అవుట్డోర్ మరియు ఇండోర్ ఆటస్థలం ఉండాలని, ఆకర్షణీయంగా పాఠశాలను తయారు చేయాలని, ఉమ్మడి కృత్యాలు నిర్వహించుటకు 1200 చ.అడుగుల హాలు ఉండాలని, విద్యార్థులకు తరగతి గదిలో ఆకర్షనీయమైన రంగులతో కూడిన ఐదు టేబుల్లు 20 కుర్చీలు ఉండాలని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా అర ఎకరం స్థలంలో ఏర్పాటు చేయాలన్నారు.
2910 పాఠశాలల్లో పదికంటే తక్కువ విద్యార్థులు..
పాఠశాల విద్య గురించి రిపోర్ట్‌లో 56వ పేజీ నుండి 67వ పేజీ వరకు, నేడు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు ఎలా ఉన్నాయి? విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఎలా ఉన్నది? ప్రభుత్వ పాఠశాలలను ఎలా అభివృద్ధి చేయాలి? ప్రయివేటు పాఠశాలల నియంత్రణ ఎలా ఉండాలి? అనే అంశాలను చాలా వివరంగా ప్రస్తావించారు. యు డైస్ ప్రకారం రాష్ట్రంలో 41,336 పాఠశాలలు ఉండగా, వీటిలో 11,154 ప్రయివేటు పాఠశాలలు, 30,182 ప్రభుత్వ డబ్బుతో నడిచే పాఠశాలలున్నాయి. వీటిలో మూతబడ్డ ప్రభుత్వ పాఠశాలలు 1920. ఒకటి నుండి పది వరకు మొత్తం విద్యార్థులు 58,95,344. ఇందులో ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు 35,13,510. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 23,81,834. 19727 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1920 పాఠశాలల్లో విద్యార్థులు లేరు, 2910 పాఠశాలల్లో పదికంటే తక్కువ విద్యార్థులు, 4303 పాఠశాలల్లో 11 నుండి 20 మధ్య విద్యార్థులు, 2711 పాఠశాలల్లో 21 నుండి 30 మంది విద్యార్థులున్నారు. 14,228 పాఠశాలల్లో అరవైలోపే విద్యార్థులున్నారు. అరవైలోపు విద్యార్థులకు విద్యాహక్కు చట్టం ప్రకారం ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు.
ఇద్దరే ఉపాధ్యాయులున్న పాఠశాలలకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించుటకు సిద్ధంగా లేరు. విద్యాహక్కు చట్టం ప్రకారం 120కి పైగా విద్యార్థులు ఉంటేనే ఐదుగురు ఉపాధ్యాయులుండే అవకాశమున్నది. 120కి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలు 909 మాత్రమే. 150కు పైగా విద్యార్థులు ఉంటేనే ప్రధానోపాధ్యాయ పోస్టు ఉంటుంది. 150కి పైగా విద్యార్థులున్న పాఠశాలలు 479 మాత్రమే. 3143 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. మెజారిటీ ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 6,7 తరగతుల్లో విద్యార్థులు లేరు. 2149 పాఠశాలల్లో 7 తరగతులకు 70కి లోపు విద్యార్థులున్నారు. 773 పాఠశాలల్లో 7 తరగతులకు 71 నుండి 140 మధ్య విద్యార్థులున్నారు. ఈ ఎన్రోల్మెంట్ పరిశీలించినప్పుడు ప్రాథమికోన్నత పాఠశాలలు అవసరం లేదనిపిస్తుంది. 614 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐదు తరగతులు కలిపి 50కంటే తక్కువ విద్యార్థులున్నారు.706 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 51నుండి 75 మధ్య విద్యార్థులు ఉన్నారు. 577 ఉన్నత పాఠశాలల్లో 76 నుండి 100 మధ్య విద్యార్థులున్నారు. 4704 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 200కు పైగా విద్యార్థులున్న పాఠశాలలు 1217.
మౌలికమైన మార్పులకు సూచనలు..
తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ వేగవంతమవుతోంది. తదనుగుణంగానే విద్యార్థుల సంఖ్య నగర/పట్టణ ప్రాంతాల్లో పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతంలో తగ్గుతోంది. 1 నుండి 10వ తరగతి వరకు చదివే మొత్తం విద్యార్థుల సంఖ్య హైదరాబాద్ జిల్లాలో 8,07,051, రంగారెడ్డి జిల్లాలో 7,25,110, మేడ్చల్ జిల్లాలో7,06,275, ములుగు జిల్లాలో 36,011, కరీంనగర్ జిల్లాలో1,38,812, వనపర్తి జిల్లాలో 78,088. ప్రభుత్వ బడుల సంఖ్య హైదరాబాద్ జిల్లాలో 691, రంగారెడ్డి జిల్లాలో 1312, మేడ్చల్ జిల్లాలో 505, ములుగు జిల్లాలో 485, కరీంనగర్ జిల్లాలో 654, వనపర్తి జిల్లాలో 526. గత 30 సంవత్సరాలుగా విస్తరిస్తున్న నగర/ పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వం కొత్తబడులు పెట్టలేదు. పది గ్రామీణ జిల్లాలలో విద్యార్థుల సంఖ్య లక్షలోపు ఉంటే, రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి మండలంలో, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలో లక్షకు పైగా విద్యార్థులు చదువుచున్నారు.
పై అంశాలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రంగంలో పాఠశాల విద్యను అభివృద్ధి చేయడానికి మౌలికమైన మార్పులతో కమిషన్ రిపోర్టులో సూచనలు చేసింది. ఒక్కొక్క పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంటే, పాఠశాలల సంఖ్య తగ్గుతుంది. అపుడు అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను సంపూర్ణంగా కల్పించవచ్చనే ఉద్దేశంతో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల/ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల/ మోడల్ స్కూల్ గాని, మండలం యూనిట్ గా ఎంపిక చేసి అన్ని మౌలిక వసతులను కల్పించి, ఆ స్కూలుకు ”తెలంగాణ పబ్లిక్ స్కూల్” అనే పేరు పెట్టాలనేది కమిషన్ సిఫారసు. ప్రస్తుతమున్న పాఠశాలలు, ఉపాధ్యాయుల తోనే తల్లిదండ్రులు మెచ్చేటట్లు పాఠశాలలను అభివృద్ధి చేసి, ఎక్కువ మంది విద్యార్థులకు మంచి విద్యను అందించే ప్రతిపాదన. ఈ పద్ధతిలో మార్చుట వలన ఉపాధ్యాయులు మిగిలే అవకాశం ఉండదు. విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ అదనపు ఉపాధ్యాయులు అవసరమవుతారు.
కమిషన్ రిపోర్టులోని పేజీ118 ప్రకారం ప్రీ ప్రైమరీ నుండి పదవ తరగతి వరకు తరగతికి మూడు సెక్షన్ల నిర్వహణకు ఒకరు స్కూల్ హెడ్, ముగ్గురు ప్రధానోపాధ్యాయులు, 12 మంది ఫ్రీ ప్రైమరీ టీచర్లు, 18 మంది ప్రైమరీ టీచర్లు, 24 మంది హైస్కూల్ టీచర్లు, 6 మంది పిడి/ పిఇటిలు, ఒక్కొక్కరు చొప్పున ఆర్ట్, మ్యూజిక్, డాన్స్ టీచర్లు, ఇద్దరు లైబ్రెరేరియన్లు ఉంటారు. ప్రీ ప్రైమరీ తరగతులకు సెక్షన్‌కు ఒకరి చొప్పున చైల్డ్ కేర్ అసిస్టెంట్లు, 150 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున పారిశుద్ధ్య కార్మికులు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్స్, ఒక నర్స్, 9 మంది నాన్ టీచింగ్ స్టాఫ్, ఒక హెడ్ కుక్, ప్రతి 200 మంది విద్యార్థులకు ఒక కుక్ చొప్పున నియమించాలి.
మండల జనాభా ఆధారంగా 20వేల లోపు ఒక స్కూల్, 40వేల లోపు రెండు స్కూల్స్, 60వేల లోపు మూడు స్కూల్స్, 80వేల లోపు నాలుగు స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నగర/ పట్టణ మండలాలలో రెండు లక్షల జనాభా కూడా ఉంటుంది. రెండు లక్షల జనాభా ఉన్న మండలాల్లో 10 స్కూల్స్ ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మంచి భోజనం, సాయంత్రం స్నాక్స్ అందజేయాలి. ఆకర్షణీయమైనా స్కూల్ డ్రెస్సులు, టై, బెల్ట్, షూలు ఇవ్వాలి. జనాభా ఎక్కువ ఉన్న రెవెన్యూ జిల్లాలలో మూడు జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లా విద్యాబోర్డుకు ఒక డిఇఓ పోస్ట్ ఉండాలని ప్రతిపాదనలు చేసింది.
15 సాధారణ సిఫారసులు, ముఖ్యమైనవి..
1.తెలంగాణ రాష్ట్రంలో కామన్ స్కూల్ వ్యవస్థ ద్వారా అందరికీ నాణ్యమైన విద్య అందించాలి.2.పట్టణ/ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యాసంస్థల ఏర్పాటు, విస్తరణ కొరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలి. 3.విద్యాశాఖలో నియమించబడే అధికారులు ప్రభుత్వ విద్య పట్ల సానుకూల దృక్పథం, అభిరుచి కలవారై ఉండాలి. పై మూడు సిఫారసులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగానికి కీలకమైనవి, అత్యవసరమైనవి.
రిపోర్టును గందరగోళ పరిచిన 8వ సిఫారసు
మార్కెట్ ప్రయోజనాలతో పోలిస్తే శాశ్వత ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల సంక్షేమం, విద్యా నాణ్యత పెంచడానికి బడ్జెట్‌లో అవకాశం కల్పించడానికి వీలుగా భవిష్యత్ సిబ్బంది నియమాకాలలో వేతనాలను సమీక్షించి, హేతుబద్ధీకరించాలి. రాష్ట్రంలో ఉపాధ్యాయుల, అధ్యాపకుల వేతనాలు ఎక్కువేమీ లేవు. రాష్ట్ర జిడిపికి అనుగుణంగానే ఉన్నాయి. దీంతో పాటు ద్రవ్యోల్బణం ఆధారంగా నిరంతరం వేతనాలు పెంచవలసి ఉంటుంది. ఉపాధ్యాయుల పదోన్నతులు, నియామకాలకు సంబంధించిన సిఫార్సులు కూడా లోతుగా చర్చించవలసిన అవసరం ఉన్నది.
రాజ్యాంగ లక్ష్యాల కనుగుణంగా విద్యారంగం ఉండాలనేది రిపోర్టులో చాలాచోట్ల కనిపించింది. దేశ ఐక్యతకు, సామరస్య జీవనానికి, అభివృద్ధికి కీలకమైనది. రిపోర్టు మొత్తం కూడా ”విద్యార్థి కేంద్రం”గా సిఫారసులు చేయబడ్డాయి. అందువల్ల నేమో కేంద్రమంత్రి ఒకరు ఈ రిపోర్టును మూసీలో వేయమన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారనే సాకుతో వారు రిపోర్టును దుయ్యబట్టారు. కొందరు వ్యక్తిగత ద్వేషంతో రిపోర్టు మొత్తాన్ని వ్యతిరేకించినట్లు కనిపించింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి చేయడానికి ఈ రిపోర్ట్టులోని మెజార్టీ సిఫారసులు ఉపయోగ పడతాయని భావిస్తున్నాను. రిపోర్టులోని ఇతర చాప్టర్లపై మరొకసారి పరిశీలన చేసుకుందాం.
అలుగుబెల్లి నర్సిరెడ్డి
9490300678



